సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, July 26, 2019

శ్రీకాంత శర్మ మావయ్యగారి జ్ఞాపకాలు..



చాలా పుస్తకాల కబుర్లు రాయాలని మనసులో ఉన్నా; కాస్తంత పని ఒత్తిడి, కూసింత బధ్ధకం, అంతరంగంలో నిండుకుంటున్న మౌనం.. అన్నీ కలగలిసి బ్లాగు వైపు కన్నెత్తనివ్వలేదు. ఇంతలోనే నిన్న పొద్దుటే వచ్చిన దుర్వార్త జ్ఞాపకాల మూటలతో అటకెక్కిన ఎన్నో బెజవాడ కబుర్లను, ఎన్నో మధురస్మృతులను విషాదంతో మేల్కొలిపింది. స్కూలు రోజుల నుండీ పీజీ పూర్తయ్యాకా కూడా, అంటే దాదాపు ఇరవై పాతికేళ్లపాటు నేను యద్ధేచ్ఛగా తిరుగుతూ గడిపిన బెజవాడ రేడియో స్టేషన్, దాని చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, ఆ అపురూపమైన మరపురాని రోజులూ గుర్తుకువస్తూనే ఉన్నాయి నిన్నంతా.
"బాల్య కౌమారాలు చిరు పగడాలు సంజల కలియగా 
తరిపి వెన్నెల యౌవనంలో జాజిపూవులు పూయవా"
అన్న శర్మ గారి పద్యమూ గుర్తుకు వచ్చింది. ఎన్ని కవితలు, ఎన్ని మాటలు, ఎన్ని జ్ఞాపకాలో... ఒక అద్భుతమైన కవిగా నాకు ఆయనంటే ఎనలేని అభిమానం.

శ్రీకాంత శర్మ మావయ్యగారంటే ఒక నడిచే ఎన్సైక్లోపీడియా.
శ్రీకాంత శర్మ మావయ్యగారి భాష తేనెల తేటల తెలుగు.
శ్రీకాంత శర్మ మావయ్యగారు వాడే పదాలు తాజా పూతరేకులు.
శ్రీకాంత శర్మ మావయ్యగారి కవితలు పుస్తకంలో దాచుకున్న నెమలీకలు.
శ్రీకాంత శర్మ మావయ్యగారి జ్ఞాపకాలు ఎన్నటికీ వాడని జాజిపూల పరిమళాలు.
శ్రీకాంత శర్మ మావయ్యగారు ఒక అనుపమానమైన వ్యక్తి !!


ఆయన గొప్పదానాన్నో, తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవనో, లేదా ఆయన పాండిత్యాన్ని గురించో చెప్పేంతటి దాన్ని కాదు. వాటి గురించి చెప్పే పెద్దలు చాలామంది ఉన్నారు. కానీ నా చిన్న ప్రపంచంలో, నా జ్ఞాపకాల దొంతరల్లోంచి ఆయన గురించిన మాటలు కొన్ని తలుచుకోవడమనేది ఇవాళ నేనెంతో మురిపెంతో చేస్తున్న పని. అంత అభిమానం నాకు శ్రీకాంత శర్మ మావయ్యగారంటే! అభిమానాన్ని మించిన ఆప్తస్నేహం నాన్నదీ, ఆయనదీ. మావయ్యగారి సమగ్ర సాహిత్యం రెండు భాగాలుగా విడుదల అయ్యాకా నాన్నకు పంపించిన కాపీ చదువుతూ, మొదటి భాగం సృజనలో "వెనుదిరిగి చూసుకుంటే..." అనే ముందుమాటలో ప్రస్తావించిన ఆప్తమిత్రుల్లో తన పేరు చూసుకుని "అయ్యా, నా పేరు కూడా రాశారే" అన్నారట ఫోన్ లో నాన్న. "అయ్యో, భలేవారే! మీ పేరు లేకుండానా" అన్నారట శర్మ గారు. ముఫ్ఫై ఏళ్ల ఉద్యోగ సాంగత్యాన్నే కాక అంతకు మించిన మధురమైన స్నేహసౌరభాన్ని వారిద్దరి పరిచయానికి అద్దింది రేడియో. మొన్నటి దాకా అది పరిమళాలను వెదజల్లుతూనే ఉంది. ఈమధ్యన నాన్నకూ బాగోవడం లేక ఒక్కరూ ఎక్కడికీ  వెళ్ళలేకపోతున్నారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితమే కృష్ణమోహన్ అంకుల్ నాన్నను తనతో పాటూ తీసుకువెళ్ళారు శర్మగారిని కలవడానికి. మావయ్యగారు తన కూడా ఉన్న అటెండర్లు చెప్పారట "పొద్దున్నుంచీ మూడు నాలుగుసార్లు చెప్పారు నా ఫ్రెండ్స్ వస్తున్నారు.." అని. కృష్ణమోహన్ అంకుల్ , శర్మగారూ, నాన్న ముగ్గురిదీ మరో స్నేహం! కాసేపు కబుర్లయ్యకా మళ్ళీ నాన్నని ఇంటి దగ్గర దింపేసి వెళ్లారుట అంకుల్. బాగా నీరసపడిపోయారని నాన్న చెప్పినా ఎప్పటిలానే శర్మగారు మళ్ళీ కోలుకుంటారనే అనుకున్నాం అమ్మ,నేనూ.

పిల్లని స్కూలుకి పంపించే హడావుడిలో ఉండగా నిన్న పొద్దున్నే నాన్న ఫోన్ చేసి ఏంచేస్తున్నావని అడిగారు. ఈ టైంలో ఫోన్ చేయవు కదా, ఏమిటి అని అనుమానంగా అడగగానే చెప్పారు.. ఇప్పుడే ప్రాంతీయ వార్తలు విన్నాను... అని! "వెళ్తావా" అని అడిగాను. "పలకరించే ఆ మనిషే లేనప్పుడు ఎలా వెళ్ళనే?" అన్నారు దిగులుగా. ఈమధ్య ఆరోగ్యం బాగుండటం లేదని వెళ్ళే ప్రయత్నం చెయ్యలేకపోయారు నాన్న. వీక్ డే అవడంతో ఎంత మనసైనా నిన్న ఇంటికి వెళ్ళలేకపోయాను. రోజంతా పది, పదిహేను సార్లు ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడుగుతూనే ఉన్నాను నాన్నని.

నిన్నటి రోజు చాలా అన్యమనస్కంగానే గడిచింది నాక్కూడా. బాగా దగ్గరగా తెలిసినవాళ్ల గురించి రాయాలన్నా మనసు ఒప్పదు. సాయంత్రం ఆల్వాల్ లో కార్యక్రమం జరుగుతుందని నెట్ లో చదివాను. సాయంత్రం వాకింగ్ చేస్తూ మౌనంగా శర్మమావయ్యగారికి మనసులోనే నమస్కరించాను. ఇవాళ మధ్యాహ్నానికి కాస్త అక్షరాలు రాయగలననిపించి మొదలుపెట్టాను. 

బెజవాడ క్వార్టర్స్ లో ఇంట్లో నా గదిని మావయ్యగారు ఉండటానికి ఇచ్చి నాన్న ఆయనతో అవార్డ్ ప్రోగ్రామ్స్ గురించి చేసిన చర్చలు, మా ఇంట్లో భోజనాలు, కూరలు, పెరుగు పచ్చళ్ళు, అగర్బత్తీలు, ఒకటేమిటి...ఎన్ని కబుర్లు గుర్తుకొచ్చాయో... ఎన్ని జ్ఞాపకాలో!! పెళ్లయి వెళ్పోయాకా కూడా తెలుగు భాషపై ఏ సందేహం వచ్చినా వెంటనే నాన్నకు ఫోన్ చేసి మావయ్యగారిని ఫలానా సందేహం గురించి అడగమని ఆర్డరేసేదాన్ని. నాన్న ఆయనను అడిగితే సందేహ నివృత్తి చేసేసి, "తను నన్నే నేరుగా అడగచ్చు. మళ్ళీ మీతో ఎందుకు అడిగించడం" అనేవారుట. ఒకసారి కొన్నాళ్ళు అమ్మావాళ్ల దగ్గర ఉన్నాకా, నన్ను అత్తవారింట్లో దింపడానికి అమ్మ,నాన్న ఇద్దరూ వచ్చారు. మధ్యలో వస్తుంది శర్మగారు అప్పట్లో ఉండే అపార్ట్మెంట్ . ఆయనతో ఏదో పని మీద అక్కడ ఆగి ఇద్దరూ పైకి వెళ్లారు. నా పెళ్ళిలోనే ఆయనను  ఆఖరు కలవడమే. తరువాత బొంబాయి వెళ్పోవడం వల్ల తెలిసినవారెవ్వరినీ కొన్నేళ్లపాటు కలవలేదు నేను. ఆ రోజు కారులో సామాను ఉండడం వల్ల నేను పైకి వెళ్లలేదు. మా పాప కూడా చిన్నది అప్పటికి. అప్పటికే శర్మ గారికి మోకాళ్ల నెప్పులకు వైద్యం జరుగుతోంది. వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తున్నారని చెప్పారు. గేట్ వైపు అమ్మావాళ్ల కోసం చూస్తూంటే, లిఫ్ట్ లేని ఆ అపార్ట్మెంట్ మెట్లు దిగి ఆయన క్రిందకి వచ్చేసారు. చాలారోజులైంది చూద్దామని వచ్చానన్నారు. అయ్యో.. నా కోసం మెట్లు దిగి వచ్చారా అని నొచ్చుకుంటూ గబుక్కున పాపతో క్రిందకి దిగాను. మా మనవరాలు కూడా అచ్చం ఇలానే ఉంటుంది అన్నారు మా అమ్మాయిని చూసి. వాళ్ళిద్దరిదీ ఒకటే వయసు. నెలలు తేడా. చిన్నప్పటి నుండీ ఎరిగినవాళ్లంటే అభిమానాలు అలా ఉంటాయి. నిన్న పాండురంగారావు మావయ్యగారిని తీసుకుని రాధిక వచ్చిందని తెలియగానే తనకి మెసేజ్ పెట్టాను. తనూ అదే రాసింది "ఎంత కలిసి ఉండేవాళ్లమో అందరమూ..ఆ రోజులే వేరు.." అని. అప్పటి అప్యాయతలు, అభిమానాలే వేరు. ఇప్పుడన్నీ కాగితం పూలకు మల్లే నాజూకైన స్నేహాలేగా! 

నాన్నకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మావయ్యగారూ, జానకీ బాల గారూ ఇద్దరూ వచ్చారు చూడడానికి. అప్పుడు కూడా ఆయన మోకాళ్ల నెప్పులతో బాగా ఇబ్బంది పడుతూ వాకింగ్ స్టిక్ వాడుతున్నారు. నాన్నావాళ్ల లిఫ్ట్ రిపేర్ లో ఉందప్పుడు. ఆయన ఎంతో అవస్త పడుతూ మూడంతస్తులు మెట్లు ఎక్కి వచ్చారు. అయ్యో, ఎంత ఇబ్బంది పడ్డారో అని ఎంతో బాధ పడ్డాము అందరమూ. ఎలాగైనా రామంగారిని చూడాలని పట్టుబట్టి వచ్చారని జానకీ బాల గారు అన్నారు. శర్మగారిని తలుచుకోవడం మొదలుపెడితే ఎన్నో కబుర్లు... ఎన్నని రాయను? ఒకసారి నాన్న మావయ్యగారిని కలవడానికి వెళ్తూంటే నేను రెగులర్ గా బ్లాగింగ్ చేసిన సమయంలో కౌముది వెబ్ పత్రికకు రాసిన "నవలా నాయకులు" సిరీస్ ను ప్రింట్ తీసి ఇచ్చి పంపించాను. మావయ్యగారికి, శారదత్తకీ ఇద్దరికే ఇచ్చాను అలా ప్రింట్ తీసి. నా దగ్గర కూడా లేదు కాపీ. మావయ్యగారు అది చదివాకా ఏమంటారో తెలుసుకోవాలని. ఆయన అభిప్రాయం ఎంతో అపురూపం నాకు. ఒక్క నాలుగు వాక్యాలు రాసి ఇవ్వమని దాచుకుంటానని నాన్నని అడగమన్నాను. ఆయన అలాగే తప్పకుండా అన్నారుట. వారం రోజుల్లో నాన్న అడ్రస్ కి కొరియర్లో ఒక కవర్ వచ్చింది. నాలుగు వాక్యాలు అడిగితే రెండూ పేజీల కానుకని అందించారు మావయ్యగారు. ఆయన స్వదస్తూరీతో ఉన్న ఆ కాగితాలని ఎంతో భద్రంగా దాచుకున్నాను. పెద్ద అవార్డ్ తో సమానం నాకు ఆయన మాటలు.






ఆ తర్వాత కొన్నాళ్లకు అమ్మ, నాన్న మా ఇంటికి వచ్చినప్పుడు శర్మగారింటికి వెళ్తూంటే నేను కూడా వెళ్ళాను. చాలా అనారోగ్యం చేసి కోలుకున్నారప్పుడు. కులాసాగా ఉన్నారు. చాలాసేపు కబుర్లు చెప్పారు. అలా అనర్గళంగా మాట్లాడడం ఆయనకు విసుగు లేని పని. అప్పుడు, నవలా నాయకులు గుర్తుచేసుకుని "బావుంది. చక్కగా రాశావు. ఏమిటి ఇంకా ఏమేమి రాశావు?" అని నన్నడిగారు. లేదండీ, ఇప్పుడు ఏమీ రాయట్లేదు అన్నాను. ఎందుకని అడిగితే, ఎవరు చదువుతారులే అనే నిర్లిప్తత వల్ల రాయట్లేదండీ అన్నాను. ఆప్పుడాయన "అది చాలా తప్పు. అలా ఎప్పుడూ అనుకోకూడదు. మన వే ఆఫ్ థింకింగ్ తో కలిసేవాళ్ళు, ఫలానావాళ్ళు రాస్తే చదవాలి అని ఎదురుచూసేవాళ్ళు తప్పకుండా ఉంటారు. మనకు వాళ్ళు ప్రత్యక్ష్యంగా తెలియకపోవచ్చు. కానీ మనం రాసేది చదవడానికి ఎదురుచూసేవాళ్ళు, చదివేవాళ్ళు తప్పకుండా ఉంటారు. అంచేత, రాయటం ఎప్పుడూ మానద్దు. రాస్తూ ఉండు" అని చెప్పారు. ఆశీర్వచనంలాంటి ఆ మాటలు శ్రీకృష్ణుడి గీతాబోధలా నా మీద పనిచేసాయి. పుస్తకాలు చదవడం కూడా మానేసిన నేను మళ్ళీ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను.

ఒక నిండు జీవితాన్ని చూసిన వ్యక్తి. తాను రాసిన సమగ్ర సాహిత్యాన్ని అచ్చువేయించుకున్నారు. ఆత్మకథ రాసుకున్నారు. పిల్లల ఎదుగుదలను చూశారు. తృప్తికరమైన సంపూర్ణమైన జీవితాన్ని గడిపారు. నిజానికి ఆయన మరణానికి దు:ఖించకూడదు. కానీ అభిమానం అనేది కన్నీళ్ళని ఆగనీయదు. సత్యాన్ని చూడనివ్వదు. తెలుగు సాహిత్యానికి తన వంతు సేవని అందించిన ఆ మహానుభావుడికి నమస్సుమాంజలి.



----------------------------------------------

(ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాత్రమే ఆ photoలను ఇక్కడ పెట్టాను తప్ప గొప్పలు చెప్పుకోవడం కోసం అయితే ఆయన పంపిన వెంటనే పెట్టుకుని ఉందును. పలు సందర్భాల్లో మావయ్యగారితో తీసుకున్న ఫోటోలేవీ కూడా ఇక్కడ షేర్ చెయ్యట్లేదు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే తత్వమే ఉండుంటే చాలా సందర్భాల్లో ఎందరో పెద్దలతో ఉన్న ఫోటోలను ’పక్కన్నేను, పక్కన్నేను ’ అని ఎప్పుడో చాటింపుగా బ్లాగులో ప్రచురించుకుని ఉండేదాన్ని. సంజాయిషీలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ కొన్ని విషయాలు చెప్తే కాని అర్థం కానివాళ్ళు కూడా ఉంటూంటారని ఇలా రాయడం! )