సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, October 12, 2014

Bright sunday !





పొద్దున్నే లేవడం లేటైనా వాకింగ్ మానలేక గబగబా తెమిలి బయల్దేరా. మిష్టర్ సూర్యదేవ్ అప్పుడే ఎదురైపోయాడు. వెలుతురు రాకుండా వాకింగ్ చేస్తే బావుంటుంది కానీ ఇలా మిష్టర్ సూర్యదేవ్ వంక చూస్తూ ఆ వెచ్చని చూపులు తనువుని తాకుతూండగా నడవడం కూడా భలేగా ఉంటుంది. లేటవడం కూడా బావుంది అనుకున్నా. ఓ ఎఫ్.ఎం లో గణేష సుప్రభాతం పాడుతున్న బాలమురళీకృష్ణగారి గాత్రం తాలూకూ బేస్ వైబ్రేషన్ నెమ్మదిగా ఇయర్ఫోన్స్ లోంచి మెదడుని తాకుతోంది.

నిన్నసలు రోజు మొదలవ్వడమే చిరాగ్గా మొదలైంది. ఒక సంఘటన చాలా బాధపెట్టేసింది. సాయంత్రం దాకా ఫీలయ్యీ ఫీలయ్యి..లయ్యీ..ఈ.... ఇక లాభం లేదనుకుని 'ఓ సామీ ఎలాగూ దీపావళి వస్తోంది కదా కాస్తలా షాపింగ్ కి తీసుకుపోదురూ' అని బ్రతిమాలా అయ్యవారిని. ఏదో పొదుపు చేసేద్దామనుకున్నప్పుడే ఖర్చులు ఇంకా పెరుగుతాయి..(నెలకి రెండు పండగలు వస్తాయి) కదా... పాపం జేబులు తడుముకుంటూ బయల్దేరారు! నిర్దాక్షిణ్యంగా వాళ్ళని నాతో పాటూ అరడజను షాపులు తిప్పేసాకా, 'అమ్మా ఇంక వెళ్పోదామని' పిల్ల పేచీ మొదలెట్టే సమయానికి, ఆఖరికి రోడ్డు మీద ఓ పక్కగా గుట్టగా పోసి అమ్మేస్తున్న టాప్స్ లోంచి య్యగారి అనుమతితో రెండు సెలక్ట్ చేసి షాపింగ్ పూర్తి చేసా. అంతకు ముందే పిల్లకి బాగా నచ్చిన ఫ్రాక్ కొనేసాం కాబట్టి 'అమ్మా నువ్వు రెండు కొనుక్కున్నావ్..' అని పోటీకి రాలేదని. బస్సులో కూచున్నాకా 'హమ్మయ్య హేపీనా..' అనడిగారు అయ్యవారు. 'ఏదీ ఇంకా ఒక టాప్ మీదకి మ్యాచింగ్ పటియాలా బాటమ్,చున్నీ కొనుక్కోవాలి కదా..' అన్నా. 'హతవిధీ!!' అని తలకొట్టుకున్నారు పాపం :) ఏదేమైనా మూడ్ బాలేనప్పుడు షాపింగ్ చెయ్యడమే మంచి ఉపాయం...! ఇంటికొచ్చి భోం చేసి, సంగీతప్రియలో పాట పోస్ట్ పెట్టి, పురాణం చదువుకుని పడుకునేసరికీ సమయం రెండు గంటలు చూపించింది. (ఈ పురాణ పఠనం గురించి ఓ పోస్ట్ రాయాలని నెలరోజుల్నుంచీ అనుకుంటున్నా!! ఎప్పటికవుతుందో) అందుకే ఇవాళ పొద్దున్న లేవలేకపోయా. అదన్నమాట.

సరే మళ్ళీ పొద్దుటి వాకింగ్ దగ్గరికొచ్చేస్తే.. కొత్త రూట్ లో వెళ్దాం అని వేరే సందులోకి తిరిగాను. ఇదివరకూ అక్కదంతా ఖాళీ జాగా ఉండేది. ఇప్పుడు కొత్తగా ఇళ్ళు రెడీ అయిపోతున్నాయి..అక్కడుండే చెట్లు మొక్కలు అన్నీ కొట్టేసారు :( 


సెక్యూరిటీ గార్డ్ గుడిసె అనుకుంటా..బాగుంది కదా..

ఓ ఇంటి ముందర కాశీరత్నం తీగ కనబడింది. ఈ ఎర్రటి నాజూకైన పూలు నాకెంత ఇష్టమో చెప్పలేను. బెజవాడలో మా క్వార్టర్ గుమ్మానికి పక్కగా క్రీపర్ పెంచి ఎంతమందికి ఈ విత్తనాలు పంచానో..! చిన్నప్పుడు భాస్కరమ్మగారింటి వెనక పెరట్లో పిచ్చిమొక్కలతో పాటూ ఎన్ని తోగలు పెరిగేవో.. ఈ తీగ కనబడితే చాలు నేను నాస్టాల్జిక్ అయిపోతాను. నెమ్మదిగా ఆ గుమ్మం దాకా వెళ్ళి నాలుగు విత్తనాలు కోసేసుకుని చున్నీ చివర ముడి వేసేసాను. ఇంట్లో ఎవరూ లేచిన అలికిడి లేదు. ఎవరైనా కనబడితే అడిగే కోసుకుందును. గొప్ప ఆనందంతో వేరే సందులోకి వెళ్ళా. అక్కడ ఉండే ఓ ఇండిపెండెట్ హౌస్ నాకు బాగా ఇష్టం. చుట్టూరా చక్కగా  బోలెడు కూరగాయల  మొక్కలు వేస్తూంటారు వాళ్ళు. సీజనల్ కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. పపాయా పిందెలు చెట్టు నిండా ఉన్నాయి. ఇంకా వంకాయ, కాలిఫ్లవర్, చిక్కుడు వేసారు. కన్నులారా ఆ మొక్కల్ని చూస్తూ ఆ సందు దాటాను.





వంకాయలు కనబడుతున్నాయా?



సత్సంగ్ కాలనీ లో ఫస్ట్ సిటీ బస్సు ఆగి ఉంది. వాళ్ల కాలనీ బయట పెంచే మొక్కలు కూడా చాలా బావుంటాయి చూడ్డానికి. అవి చూడడానికే అటువైపు వెళ్తుంటాను నేను. అప్పుడే లోపల్నుండి పాల బెల్లు ఔంవినపడింది. వాళ్లవన్నీ ఖచ్చితమైన పధ్దతులు. మా గేటేడ్ కమ్యూనిటీలో కూడా ఉన్నారు బోలెడుమంది సత్సంగీస్. పొద్దుటే నాలుగున్నరకే ప్రయర్ కి వెళ్టూంటారు. అక్కడ రౌండ్ పూర్తి చేసుకుని మళ్ళీ వెనక్కి వస్తున్నా రోజూ నాకెదురయ్యే జంట దూరంగా వెళ్పోతూ కనబడ్డారు. నేను లేట్ కదా ఇవాళా. చెవిలో గణేశ సుప్రభాతం అయిపోయి 'ఢోల్ బాజే' పాట ఎప్పుడు మొదలయ్యిందో గమనించలేదు కానీ అది పూర్తయ్యి 'నీ జతగా నేనుండాలి..' మొదలయ్యింది. ఎదురుగా ఉన్న మిష్టర్ సూర్యదేవ్ చూపుల వేడి ఎక్కువయ్యింది. ఇక ఈ పూటకి ఎనర్జీ బానే వచ్చేసింది వాకింగ్ చాలెమ్మనుకుని ఇంటిదారి పట్టాను.

బ్లాగ్ ముట్టుకుని చాలారోజులైందనిపించి ఈ ఉదయపు నడక కబుర్లన్నీ ఇక్కడ ఇలా నమోదు చేసా. సరే మరిక కబుర్లయిపోయాయి.. మీ పనుల్లో మీరుండండి..:-)