సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, June 21, 2014

కొత్తపుస్తకాలు: 1. "తెలుగు జానపద కళారూపాలు - సంక్షిప్త వివరణ".


                        


ఈ మధ్యన పనిమీద బజార్లోకి వెళ్ళినప్పుడు అటుగా ఉన్న పుస్తకాల షాపులోకి వెళ్ళి కొన్ని పుస్తకాలు కొన్నాను. వాటి వివరాలు రాద్దామంటే కుదరట్లేదు..:( కొన్నింటి గురింఛైనా రాద్దామని ఇప్పుడు కూచున్నా. నేను కొనుక్కునే పుస్తకాలు మరెవరికైనా ఆసక్తికరంగా ఉండచ్చు, ఏ సమాచారమో వెతుక్కునేవారికి ఉపయోగపడచ్చు అన్న ఉద్దేశంతో మాత్రమే నేను వాటి ఫోటోలు, వివరాలు బ్లాగ్ లో రాస్తూంటాను. ప్రదర్శించుకోవడానికో, ఇన్ని కొనేస్కున్నాను.. అని గొప్పగా ప్రదర్శించడానికి మాత్రం కాదు !! 


ముందు చివరగా కొన్న చిన్న పుస్తకం గురించి... 

కొన్న పుస్తకాలకి బిల్లు వేసేప్పుడు అటు ఇటు చూస్తూంటే కనబడింది ఈ పుస్తకం.. పేరు "తెలుగు జానపద కళారూపాలు - సంక్షిప్త వివరణ". డా.దామోదరరావు గారి రచన, విశాంలాంధ్ర వారి ప్రచురణ. వెల నలభై రూపాయిలు మాత్రమే..:) ఇటువంటి పుస్తకం కోసం చాలారోజులుగా వెతుకుతున్నా నేను. చిన్నప్పుడు రేడియోలో వేసేవారు తప్పెట గుళ్ళు, యక్షగానం, బుర్ర కథ, జముకులు, వీర నాట్యం, చిందు భాగోతం మొదలైనవి. నాన్న కోసం రేడియో స్టేషన్ కి వెళ్ళినప్పుడు రికార్డింగ్ కోసం వచ్చిన పల్లె జనాలు వాళ్ల గజ్జెలు, డప్పులు, ఆ శబ్దాలూ భలే విచిత్రంగా తోచేవి. వాళ్ళకు నాగరీకులతో పెద్దగా పరిచయం ఉండేది కాదు. చాలా అమాయకంగా కనబడేవారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో ఈ కళారీతులను ప్రదర్శించుకుని జీవనం సాగించుకునేవారు వారు. ఆకాశవాణి వారు ప్రోగ్రాం వేసి రమ్మంటే వచ్చేవారు. రికార్డింగ్ అయిపోయాకా వెళ్పోయేవారు. కొన్ని కార్యక్రమాలని అవి ప్రదర్శించే ప్రదేశాలకు వెళ్ళి మరీ రికార్డింగ్ చేసుకుని వచ్చేవారు కూడా. నాన్న డ్యూటీలో ఉన్నప్పుడు నాన్న గొంతు వినడానికి ఆ పూట ట్రాన్స్మిషన్ అంతా వినేసేవాళ్లం. అలా కూడా నాకు కొన్ని జానపదాలతో పరిచయం ఉంది.


అది కాకుండా, ఫోక్ మ్యూజిక్ సెక్షన్ (ఎఫ్.ఎం అనేవారు) ఒకటి ఉండేది విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో. దానికి కె.వి. హనుమంతరావుగారు అనే రేడియో ప్రయోక్త(ప్రొడ్యూసర్) ఉండేవారు. ఉద్యోగరీట్యానే కాక వ్యక్తిగతంగా కూడా ఆయనకు ఈ జానపద కళారీతుల పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఆయన ఎక్కడేక్కడి నుండో మారుమూల గ్రామాల్లో గాలించి కొన్ని మూలపడిపోతున్న జానపద కళారూపాల్ని ఆకాశవాణికి ఆహ్వానించి రికార్డింగ్ చేసేవారు.  ప్రజలకు అంతరించిపోతున్న ఈ కళారీతులను పరిచయం చేయడం కోసం విజయవాడ , గుంటూరు ,నెల్లూరు మొదలైన పట్నాల్లో విడివిడిగానూ, సామూహికంగానూ కూడా వీటి ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు హనుమంతరావుగారు. ఆ కార్యక్రమాలకు వ్యాఖ్యానం చెప్పటానికి నాన్న కూడా వెళ్ళేవారు. సామూహిక ప్రదర్శనల్లో అయితే జానపద రామాయణం, జానపద భారతం, జానపద భాగవతం అని ఈ కళారీతులన్నింటినీ కూర్చిఒక పదర్శన తయారు చేసి ప్రదర్శించేవారు. అంటే రామాయణ/భారత/భాగవతాల్లో ఒకో ఘట్టం ఒకో జానపద కళారూపం వాళ్ళు ప్రదర్శిస్తారన్నమాట! అలా అన్నీ మిక్స్ చేసి తయారుచేసిన ప్రదర్శనలు ఎంతో బాగుండేవి అని ఆ ప్రదర్శనలకు వెళ్ళి వచ్చాకా నాన్న చెప్తుండేవారు. కొన్ని విడివిడిగా ప్రదర్శించిన కళారూపాలైతే ఎప్పుడూ పేరు కూడా తెలియనివి ఉండేవిట. "రుంజ" అనే కళారీతి తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుందిట. మరో అపురూప కళారీతి అయితే కర్నూలు అటవీ ప్రాంతం లోనే ఉండేదిట. శ్రమకూర్చి వాళ్ళని కూడా పట్టణప్రాంతానికి తీసుకువచ్చి ప్రదర్శనలిప్పించేవారు హనుమంతరావు  గారు. 


ఆయన జానపద ప్రయోక్తగా ఉన్న కాలంలో ఢిల్లీ ఆకాశవాణి వారు ఒక ప్రతిపాదన చేసారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే జానపద కళారూపాల తాలూకూ సంగీత పరికరాలనీ, వాద్యాలనీ సేకరించి ఢిల్లీలో ఒక మ్యూజియం లో పదిలపరచాలనే ఒక ప్రతిపాదన తెచ్చారు. ఆయన అకాల మరణానంతరం ఆ ప్రతిపాదన పూర్తయ్యిందో లేదో తెలీదు మరి. జానపద కళారీతుల గురించిన అటువంటి విశిష్ఠమైన కృషి ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో జరిగింది. కొన్ని రికార్డింగ్స్ నాన్న దగ్గర ఇంకా ఉన్నాయనుకుంటా కూడా..


ఈ రకమైన పరిచయం వాల్ల కలిగిన ఆసక్తితో మన తెలుగువారి జానపద కళల గురించి మంచి పుస్తకమేదైనా దొరికితే బాగుండు అని పుస్తక ప్రదర్శనల్లో వెతుకుతూ ఉండేదాన్ని. చిన్నదైనా మొత్తానికి ఇది దొరికింది. ఇంతకీ ఈ పుస్తకంలో ఏముందీ అంటే.. ఒక నలభై తెలుగు జానపద కళారీతుల గురించిన సంక్షిప్త పరిచయం. ప్రాంతాల వారీగా వారి పరిచయాలు, వాటి వివరాలు, చిన్న చిన్న బొమ్మలు. అసలైతే, తెలుగునాట దాదాపు అరవై జానపద కళారూపాలు ఉన్నట్లుగా సుప్రసిధ్ధ జానపద, రంగస్థల ప్రయోక్త ఆచార్య మొదలి నాగభూషణం శర్మ తన పరిశోధన సేకరణలో తెలిపారుట. కానీ ఇప్పుడు వాటిల్లో ఎన్నో అంతరించిపోగా, కొన్నింటి పేర్లు కూడా ఎవరికీ తెలియకపోవడం విచారకరం. ఈ జానపద కళల పరిరక్షణలో బెంగాలీ వాళ్ళకు ఉన్న శ్రధ్ధాసక్తులను మెచ్చుకుని తీరాలి.


ఈ పుస్తకంలో పరిచయం చేసిన కొన్ని జానపద కళారూపాల పేర్లు:
డప్పు నృత్యం, పులి వేషం, తప్పెట గుళ్ళు, కోలాటం, గరగలు, జంగం కథ, జముకుల కథ, కాకి పదగలు, భామా కలాపం, చిరుతల రామాయణం,  యక్షగానం, బుడబుక్కలు, చిందు భాగోతం, పిచ్చుక గుంట్లు, గురవయ్యలు.. మొదలైనవి. ఇవన్నీ ఏ ఏ ప్రాంతాల్లో ప్రదర్శించేవారు, ఎలా ఆడతారు మొదలైన వివరాలు క్లుప్తంగా ఇచ్చారన్నమాట. క్రింద కొన్ని చిత్రాలు ఉన్నాయి చూడండీ..












ఇంకా కొన్ని మంచి పుస్తకాల గురించి వరుసగా రాస్తాను... ఎదురుచూడండి...:-)