సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, March 27, 2014

గౌతమీ గాథలు


"దేశంలో ఎన్నినదులు లేవు?ఏమిటీ హృదయబంధం?

గోదావరి ఇసుకతిన్నెలు.. పాపికొండలు.. భద్రాద్రి సీతారాములు...
గట్టెక్కిన తరువాత 
కడచిన స్నేహాల వియోగాల సలపరింపులు
సభలు, సాహిత్యాలు, వియ్యాల్లో కయ్యాలూ
కయ్యాల్లో వియ్యాలు!
రక్తంలో ప్రతి అణువూ ఒక కథ చెబుతుంది.."
అంటారొక కథలో రచయిత 'ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి'.


నిజానికివి కథలు కావు. తూర్పుగోదావరి జిల్లాలో రచయిత గడిపిన సాహిత్య జీవితానికి జ్ఞాపకాలు. ఆ అనుభవాలన్నింటికీ ఎంతో ఆసక్తికరంగా కథారూపాన్నందించారాయన. ఆ రోజుల్లో ఎందరో గొప్పగొప్ప సమకాలీన సాహితీవేత్తల స్నేహం, సహచర్యం పొందిన అదృష్టవంతులు హనుమచ్ఛాస్త్రి గారు. ఈ పుస్తకం ద్వారా ఆనాటి సంగతులు, ఆయా రచయితల తాలూకూ కబుర్లు చదవగలగడం మన అదృష్టం. ఆ కాలపు సాహిత్యవాతావరణాన్ని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఈ పుస్తకం బాగా నచ్చుతుంది. శ్రీపాద, చెళ్లపిళ్ళ, బాపిరాజు, విశ్వనాథ, పి.గణపతిశాస్త్రి, దేవులపల్లి, భమిడిపాటి మొదలైన ఎందరో మహానుభావుల కబుర్లు, ఆ స్నేహాలు, ఆప్యాయతలు, వారి సంభాషణలు చదవగలగడం నాకైతే చాలా చాలా ఆనందాన్నిచ్చింది.


కొన్నాళ్ళు ఈనాడులో ప్రచురితమయ్యాకా, ఓ ఏడాది తర్వాత ఆంధ్రజ్యోతిలో "గౌతమీ గాథలు" పేరిట ధారావాహికంగా వచ్చాయిట ఇందులోని వ్యాసాలు. మళ్ళీ దాదాపు ముఫ్ఫైఏళ్ల తరువాత క్రిందటేడు పుస్తకరూపంలో ఇవి ప్రచురితమయ్యాయి. రామచంద్రపురం బోర్డ్ నేషనల్ స్కూల్లో తెలుగు, సంస్కృతం అధ్యాపకులుగా ఉంటూ ఎన్నో అభ్యుదయోత్సవాలు, వసంతోత్సవాలు నిర్వహించారు  హనుమచ్ఛాస్త్రిగారు. "ఈ గాథలు స్వీయచరిత్రాత్మకాలు. సాహిత్య సందర్భాలూ, తన మానసిక స్థితిగతులు తెలియజేస్తాయి.." అంటారు రచయిత కుమారులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు.


"సుమారు ఏభై ఏళ్ల క్రిందట నా ఉదీయమానవేళల్లో ఈ దేశపు అంతరంగాలు, ఆవేశాలు, ఆకాంక్షలు ఎట్లా ఉండేవి? ఎట్లా నడిచాయి?వాటి వెనుక రకరకాల ఉద్యమ ప్రభావాలు ఎట్లా పనిచేసాయి? ఆనాటి శైష్యోపాధ్యాయిక తీరు ఎట్లా ఉండేది? ఈనాడు కథావశిష్టులైన పెద్దలు ఏ దిశగా నడిచారు? ఎలా ఆలోచించారు? అనే బొమ్మ ఈ తరంవారికి చూపడమే నా ముఖ్యోద్దేశం.(4-3-81)" అంటారు రచయిత ముందుమాటలో. చివరలో "రౌద్రి, మాఘ బహుళ సౌమ్యవారం, మహాశివరాత్రి " అనే సంతకమే భలే పులకింతను కలిగించింది. ఈమధ్యన మరికొన్ని పుస్తకాల్లో కూడా ఇలాగే ముందుమాట చివరలో సంవత్సరం, తిథి, వారాలతో కూడిన సంతకాలు చూసి చాలా సంబరపడ్డాను.



పుస్తకంలోని కొన్ని విశేషాలు:

* శ్రీపాద వారిది 'రావణా పట్టుదల' అని కొన్ని ఉదాహరణలు చెప్తూ "ఏటికి ఎదురీత అయిన ఈ పట్టుదలతో ఆయన లోకంలో నెగ్గుకు వచ్చారంటే ఎంత ప్రాణశక్తి వచస్సారం ఖర్చుపెట్టి ఉంటారో అనిపిస్తుంది" అంటారు రచయిత. ఆయన పెట్టిన పత్రిక నడవకపోతే ఓటమినొప్పుకుని, ఆయుర్వేదం తెలుసును కాబట్టి బజార్లో ఆయుర్వేదం కొట్టు పెట్టీ చూర్ణాలు, మాత్రలు, లేహ్యాలూ అమ్మేవారుట శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు.


* "విస్సన్న చెప్పిన వేదం.." అని మిస్సమ్మ పాటలో వస్తుంది కదా, ఆ నానుడీ ఎలా వచ్చిందో ఓచోట చెప్పారు. 'ఇంద్రగంటి' ఊరి పేరే ఇంటిపేరయిన విస్సన్నగారి పూర్తి పేరు "ఇంద్రగంటి విశ్వపతిశాస్త్రి"ట. ఆయన కోటిపల్లి కోట నివాసి, మహా పండితుడు, గొప్ప ధర్మవేత్త. ధర్మ సందేహానికి ఆయన చెప్పిందే వేదం. అదే సామెత అయిపోయిందిట.


* అవధానం గురించి చెప్తూ జాతీయోద్యమంతో పాటూ భావకవిత్వం జోరు ఎక్కువై అవధానాల పత్ల మోజు ఎలా తగ్గిందో, రాయప్రోలువారు, వేదుల వారు మంచి కవిత్వం వైపుకి ఎలా తిప్పారో చెప్తూ అసలు అవధానం అంటే ఏమిటి? అవధానం ఎలా చేస్తారు.. మొదలైన వివరాలు విపులంగా చెప్పడమే కాక తాను చూసిన ఒక అష్టావధానానికి చమత్కారముగా ప్రత్యక్ష్యవ్యాఖ్యానం చెప్తారు 'అవధానం' కథలో.


* 'కర్ణాట కలహం' అంటే 'కోరి పోట్లాడటం' ట. ఓసారి శ్రీపాదవారి మందుల కొట్లో జరిగిన సంభాషణ గురించి చెప్తారు రచయిత ఈ కథలో. మెట్లెక్కి వెళ్ళగానే కనబడ్డ భమిడిపాటి కామేశ్వరరావుగారు, శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు, పి.గణపతి శాస్త్రిగార్లను; ఓ చేత్తో మందులు అందిస్తూనే సాహిత్య గోష్ఠిలో పాల్గొంటున్న శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారినీ చూస్తే అది 'మందుల కొట్టా? సాహిత్య దుకాణమా?' అని సందేహం వచ్చిందిట రచయితకు. 

కొందరు పండితులను గేలి చేస్తూ వెలువడ్డ ఓ పత్రికను చూసి కామేశ్వరరావుగారు పి.గణపతిగారికొక సలహా ఇస్తారు "పండితులను వెటకారం చెయ్యడం ఈనాటి ఫాషన్. మనకు ఏది లేదో అది ఉన్నవారి మీద అసూయ తెలియకుండానే పుట్టుకు వస్తుంది. ఈనాడు ప్రబంఢాలను తిట్టేవారంతా ముందు అవి అర్థం కాక. తర్వాత సామాజిక స్పృహ, ప్రజావళి,అవగాహన అనేవి పడికట్టు రాళ్ళు. ఆధునిక పరిజ్ఞానానికీ, సదవగాహనకీ, పండితుడవడం అడ్డు రాదు. అవి విలక్షణమైన చిత్త సంస్కారం వల్ల ఏర్పడతాయి కానీ చదువుకున్న భాష వల్ల కాదు. 
ఇంకో చమత్కారం ఉంది.. ఈ పీచు కాగితాల పత్రిక్కి గుర్తింపు కావాలి. దానికొక సంఘర్షణ లేవదియ్యాలి. మీ వంటివారు రంగం లోకి దిగితే ఇంక వారికి కావలసినదేమిటి? దానికి ఎక్కడలేని ప్రచారం లభిస్తుంది. మీరు గడుసువారయితే ఒక పని చెయ్యాలి. దీన్నీ దాని రాతల్ని ఖాతరు చెయ్యకుండా రచనల్ని జోరు చెయ్యండి. మీ పరిజ్ఞానం ఎంతటిదో, మీ అవగాహాన ఏమిటో ఋజువు చెయ్యండి. బస్ , అదే దానికి జవాబు".
కృష్ణశాస్త్రి గారు కూడా ఓ విమర్శ గురించి ఇదే మాటన్నారుట ఒకసారి.. "వారికి మేమేం జవాబు చెప్పగలం? మరింత జోరుగా, రెట్టింపు ఉత్సాహంతో వ్రాయడమే వారికి తగిన జవాబు!" అని.

ఈ ఇద్దరు పండితుల మాటలూ ఈనాటికీ ఎంతగా వర్తిస్తాయి.. అనిపించింది నాకు. 


* 'లంకలో లేడిపిల్ల', 'వ్యసనైకమత్యం', 'అల తల వల', 'రైల్వే సుందరి' కథలు ఆకట్టుకుంటాయి.


* 'ఆవకాయ మహోత్సవం' కథలో గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమలో ఆవకాయలు ఎలా పెడతారో చెప్పే ఘట్టం మహా సరదాగా ఉంది. చివర్లో ఆ రోజు తిన్న రకరకాల కొత్తావకాయల దెబ్బకు నిద్రపట్టక కదులుతున్న రచయితకు శ్రీపాదవారు 'ద్రాక్షారిష్టం' ఇచ్చి నిద్ర పట్టించడం నవ్వుతెప్పిస్తుంది.


* 'క్యూ' కథలో ఒక పల్లెటూరి గృహిణి స్వచ్ఛత, నిర్మలత్వం కట్టిపడేస్తాయి. రచయిత అన్నట్లే పట్నవాసపు ప్రలోభాలూ, సంపర్కాలూ కొందరి మనసుల్లోని స్వచ్ఛతని నిజంగా చంపేస్తున్నాయి అనిపిస్తుంది!


అలా అయిదేళ్ళ పాటు అమ్మ గౌతమి వద్దా, గొప్ప గొప్ప సాహితీ సంస్కారాల మధ్యన మెలిగిన తరువాత పినతల్లి పినాకిని పిలుపు అందుకుని 'సింహపురి'కి పయనమయ్యారుట హనుమచ్ఛాస్త్రి గారు. వారి అంతరంగ కథనాలని, అనుభవాలనూ మనకేమో ఈ అపురూపమైన గౌతమీ గాథల రూపంలో అందించారు. 


వారం క్రితం ఒక పుస్తకం కోసం వెళ్తే, కావాల్సినది దొరకలేదు కానీ ఇది దొరికింది. ఎలానూ గోదారమ్మ నాకు దేవకి కదా అని చటుక్కున కొనేసాను. చక్కని తెలుగు, ఇదివరకూ తెలియని కొత్త తెలుగు పదాలు ఎన్నో నేర్చుకోవడానికి దొరుకుతాయీ పుస్తకంలో. నా అంచనాకు రెట్టింపు ఆనందాన్ని ఇచ్చిందీ పుస్తకం!