1934లో "ఎ సెర్చ్ ఇన్ సిక్రెట్ ఇండియా" పేరుతో ఆంగ్లంలో మొదటి ప్రచురణ జరిగిన ఈ పుస్తకం ప్రతులన్నీ రెండు రోజులకే అయిపోయి మూడో రోజే రెండో ముద్రణ చేసారుట. మరో ఇరవై ఏళ్ళలో 18ముద్రణలు జరిగాయిట. అయితే తెలుగులో రమణ మహర్షి తాలూకూ కొన్ని అధ్యాయాల అనువాదం జరిగిందట కానీ మొత్తం పుస్తకం తెలుగులో రాలేదని.., ఈ పుస్తకం పట్ల ఎంతో ఆకర్షితులైన జొన్నలగడ్డ పతంజలి గారు తానే తెలుగులోకి అనువదించారుట. 2013,మార్చిలో ఈ పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. ఒరిజినల్ చదివితే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేదేమో తెలీదు కానీ తెలుగు అనువాదం మాత్రం నాకు చాలా నచ్చింది. ఇంత మంచి పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అందించినందుకు అనువాదకులకు కృతజ్ఞతలు.
అసలు ముందుగా పాల్ బ్రంటన్ కి వేలవేల కృతజ్ఞతలు తెలపాలి. ఎంతో శ్రమ కూర్చి మనమే మర్చిపోతున్న భారతీయ ప్రాచీన సంస్కృతినీ, మనకి తెలియని భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని వెలికి తీసే ప్రయత్నం చేసి, వాటినన్నింటినీ గ్రంధస్థం చేసినందుకు! భారతీయయువత ఆయనకు ఒకవిధంగా ఋణపడి ఉండాలి. అసలు పాశ్చాత్యులకు కాదు; ఇటువంటి ఒక మనిషి ఉన్నాడనీ, సత్యాన్వేషణ చేస్తూ, ఆత్మ సాక్షాత్కారం దిశగా పయనిస్తూ మన దేశంలో ఇటువంటి పరిశోధన చేసాడని, ఇన్ని విషయాలు తెలుసుకున్నాడనీ, పాశ్చాత్య నాగరికత మోజులో కొట్టుకుపోతూ, ఆ జీవనవిధానమే గొప్పదనుకునే నేటితరాలకు ఇటువంటి సంగతులు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక నెల క్రితం దాకా నాకూ "పాల్ బ్రంటన్" పేరు తెలీదు. పుస్తకప్రదర్శనలో టైటిల్ చూడగానే ఎందుకో కొనాలని అనిపించింది. పుస్తకానికా పేరు పెట్టడం వెనక ఉన్న ఉద్దేశం కూడా రచయిత వివరిస్తారొకచోట. కొన్న పదిహేనురోజులకి మొన్న ఇరవైయ్యో తారుఖున పుస్తకం చదివాను. ఇటువంటి ఒక పరిశోధకుడి గురించి తెలుసుకోవడమే ఒక అద్భుతం. రచయిత గురించిన వివరాలు వెతికితే, అతని పరిశోధనల వివరాలు, జీవిత విశేషాలు, అతను రాసుకున్న నోట్స్ మొదలైన వివరాలన్నీ ఉన్న వెబ్సైట్ దొరికింది..
http://www.paulbrunton.org/
ఇదివరలో "ఒక యోగి ఆత్మకథ", స్వామి పుస్తకాలు, యోగాభ్యాసాల పుస్తకాలు, ఇతర ఆధ్యాత్మిక, తాత్వకపరమైన పుస్తకాలు చదివిఉండటం వల్ల కొన్ని సంగతులు నాకు పరిచితాలు అనిపించి, నేనీ పుస్తకపఠనాన్ని మరింతగా ఆనందించగలిగాను. "అడయారు యోగి బ్రమ" తెలిపిన యోగ సాధన సంబంధిత విషయాలలో కొన్ని నేను 'బీహార్ స్కూల్ ఆఫ్ యోగా'లో యోగా క్లాసులకి వెళ్ళినప్పుడు మా మేడమ్ చెప్పేవారు. వారి వద్ద కొన్ని పుస్తకాలు కూడా కొన్నాను. 'బ్రమ' పాల్ బ్రంటన్ కి చెప్పిన కొన్ని ఆసనాలు, వాటి వివరాలు, వాటివల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ తెలిసినవే! దురదృష్టవశాత్తూ ఆరోగ్యం సహకరించక కారణంగా కొన్ని ఆసనాలు వెయ్యలేని స్థితి నాది :(
శ్వాస నియంత్రణ వల్ల ఆయుష్షును పెంచుకోవచ్చనీ, వృధ్ధాప్యాన్ని దూరం పెట్టచ్చనే సంగతులు కూడా మా యోగా మేడమ్ చెప్పేవారు. ఇంకా పుస్తకంలో బ్రమ ఏం చెప్తాడంటే కొన్ని యోగాసనాలు అరోగ్య సంరక్షణకే కాక వాటిపై ఏకాగ్రత, శ్రధ్ధ, మనోబలం తీవ్రంగా పనిచేసి సాధకుడిలోని నిద్రాణమైన శక్తులని మేల్కొలుపుతాయట. శ్వాసని నియంత్రించడం ద్వారా ప్రాణాలు నిపి ఉంచే ఆంతరంగిక శక్తిని నియమ్రించవచ్చునని చెప్తాడతను. కొద్దిసేపు తన హృదయస్పందనని ఆపివేయడం, శ్వాసించడం అపివేసి చూపడం వంటి అద్భుతాలు కూడా రచయితకు చూపిస్తాడతను. యోగశాస్త్ర ప్రావీణ్యం ఉన్న యోగి తన శ్వాసను కొన్ని సంవత్సరాలు బంధించి తద్వారా జీవితకాలాన్ని సుదీర్ఘంగా కొన్ని వందల ఏళ్లవరకూ పొడిగించగలడని బ్రమ చెప్తాడు.
దీర్ఘకాల జీవనానికి ఉన్న మూడో మార్గాన్ని చెప్తూ బ్రమ ఏమంటాడంటే "మనిషి మెదడులో అతిసూక్ష్మరంధ్రం ఉంటుంది. ఈ సూక్ష్మరంధ్రం లోనే అత్మ స్థానం ఏర్పరుచుకుంటుంది. వెన్నుముక చివర కంటికి కనిపించని ఒక అదృశ్య ప్రాణశక్తి ఉంటుంది. ఈ ప్రాణశక్తి క్షీణించటమే వృధ్ధాప్యానికి కారణం. ఈ ప్రాణశక్తి క్షీణతని ఆపగలిగితే శరీరానికి నూతన జవసత్వాలు నిరంతరాయంగా సమకూరుతూఉంటాయి. కొందరు పరిపూర్ణ యోగులు నిరంతర సాధనతో ఈ ప్రాణశక్తిని వెన్నుముక ద్వారా పైకి తీసుకువచ్చి, మెదడులోని సూక్ష్మరంధ్రంలో నిక్షిప్తం చెయగలిగే శక్తి సాధిస్తారు. ఇటువంటి యోగులు తమ మరణాన్ని తామే నిర్ణయించుకోగలరు.."
దీర్ఘాయువుని పొందే ఈ ప్రక్రియ గురుసహాయం లేకుండా చేస్తే మృత్యువుని ఆహ్వానించినట్లేనని అతడు చెప్తాడు. ఈ శారీరక యోగసాధనతో పాటూ మానసిక యోగసాధన కూడా చేయాలని,అదే ఆధ్యాత్మికౌన్నత్యాన్ని ఇస్తుందనీ కూడా చెప్తాడు. ఇంకా.. వేలమైళ్ల దూరంలో ఉన్న గురువుతో మాట్లాడగలనంటూ బ్రమ చెప్పే మిగిలిన విషయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
దయాల్బాగ్ సత్సంగుల గురించీ, వారి జీవనవిధానాల గురించి చెప్పిన ఆధ్యాయం బాగుంది. ఆప్పట్లో రాధాస్వామి అశ్రమానికి అధిపతిగా ఉన్న శ్రీ స్వరూపానంద్ గారు తెలిపిన విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. (మా ఇంటికి దగ్గరలో ఈ రాధాసామి సత్సంగ్ కాలనీ ఉండటం వల్ల, మా అపార్ట్మెంట్స్ లో చాలా మంది సంత్సంగీస్ ఉండటం వల్ల వీరిని గురించి తెలిపిన విషయాలు పరిచితమనిపించాయి.) ఇంకా కలకత్తాలో శ్రీ రామకృష్ణపరమహంస శిష్యులలో ముఖ్యులైన మాష్టర్ మహాశయులనే వారిని కలవడం, ఆయన తెలిపిన విశేషాలు చదవడం ఒక చక్కని అనుభూతి. మద్రాస్ లో మౌనయోగి ద్వారా పాల్ బ్రంటన్ పొందిన ప్రశాంతత, కాశీ నగరంలో శ్రీ విశుధ్దానంద చూపే సౌరశాస్త్ర ప్రయోగాలు అద్భుతాలే. ప్రాచీన ఋషులకు తప్ప ఎక్కువమందికి తెలియని ఈ సౌరశాస్త్రం ప్రకారం సూర్యకిరణాలలో ప్రాణశక్తి ఉంటుందిట. ఆ సూక్ష్మశక్తిని లోబరుచుకుని, కిరనాల నుండి ఆ ప్రాణశక్తిని వేరు చేస్తే ఎన్నో అద్భుతాలను చేయవచ్చని ఆయన చెప్తారు. కాశీ నగరంలోనే కలిసిన జ్యోతిష్కుడు సుధీబాబు చెప్పిన విషయాలు విన్న తరువాత హిందూ జ్యోతిష్యశాస్త్రాన్ని కూడా మూఢనమ్మకంగా కొట్టివేయలేమనీ అభిప్రాయపడతాడు రచయిత. వంట చేసే మనిషిలోని అయస్కాంత శక్తి అతను వండేవంటలోకీ తద్వారా అది తినే మనిషిలోకీ ప్రవేశిస్తుందనీ ,అందువల్ల వంట చేసే మనిషి ఆలోచనలు కూడా మంచిగా,సక్రమంగా ఉండాలని కూడా ఓ సందర్భంలో సుధీబాబు చెప్తాడు. (ఈ పాయింట్ నాదగ్గర 'ఆయుర్వేదిక్ కుకింగ్' అనే పుస్తకంలో గతంలో చదివాను నేను.) వేల సంవత్సరాల క్రితం భృగు మహర్షి రాసిన "బ్రహ్మచింత" అనే గ్రంధబోధ కూడా రచయితకు సుధీబాబు అందిస్తాడు. ఇలాంటి ఎందరో యోగులు, జ్ఞానులు మొదలైనవారు తమ విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా ఉంచడం వల్ల ఆ జ్ఞానసంపదంతా ఎవరికి తెలియకుండానే చరిత్రలో కలిసిపోతోందని, భారత దేశ రహస్యాలెన్నో ఎవరికీ తెలియకుండానే శశ్వతంగా సమాధి అవుతున్నాయేమోనని రచయిత విచరపడతారొకచోట. నాకు అది నిజమేననిపించింది.
అప్పటి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి స్వామివారితోనూ, అరుణాచలయోగి శ్రీ రమణ మహర్షి తోనూ పాల్ బ్రంటన్ సంభాషణలు మనలోని ఎన్నో ప్రశ్నలకి సైతం సమాధానాలనిస్తాయి. ఒకచోట రచయిత ప్రశ్నలకు 'చంద్రశేఖరస్వామి'వారి సమాధానాలు...
* "...తగిన సమయం వచ్చినప్పుడే భగవంతుడు మానవులకి సద్భుధ్ధిని కలిగిస్తాడు. దేశాల మధ్యన విద్వేషాలు, మనుష్యులలో దుర్భుద్ధీ, లక్షలాది ప్రజల దారిద్ర్యమూ ఉధృతమైనప్పుడు వీటికి విరుగుడుగా భగవత్ప్రేరణా, భగవదాదేశము పొందిన వ్యక్తి తప్పకుండా ఉద్భవిస్తాడు. ప్రతి శతాబ్దంలోనూ ఇది జరుగుతూనే ఉంటుంది. అధ్యాత్మిక అజ్ఞానం వల్ల కలిగే అనర్థం ఎంత తీవ్రమైతే ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఉద్భవించే మహనీయుడంత ఎక్కువ శక్తిమంతుడవుతాడు."
** " క్రమం తప్పకుండా ధ్యాన సాధన చెయ్యాలి. ప్రేమ నిండిన హృదయంతో శాశ్వతానందాన్ని గూర్చి విచారణ చెయ్యాలి. ఆత్మ గురించి నిరంతరంగా ఆలోచిస్తూ ఉంటే తప్పకుండా దానిని చేరతావు. ధ్యానానికి ఉష:కాలం ఉత్తమమైనది. సంధ్యాకాలం కూడా అనుకూలమైనదే. ఆ సమయంలో ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. మనస్సుని నిశ్చలంగా ఉంచటం తేలికౌతుంది."
వివిధ సంభాషణలో రమణ మహర్షి పాల్ బ్రంటన్ కు చెప్పిన కొన్ని సంగతులు...
* "ఆనందమే మనిషి సహజస్థితి. ఈ ఆనందం నిజమైన నేను లో సహజంగానే ఉంటుంది. ఆనందం కోసం మానవుడు చేసే ప్రయత్నమంతా తన సహజస్థితిని కనుక్కోవటానికి చేసే అసంకల్పిత ప్రయత్నమే! ఈ సహజస్థితికి నాశనం లేదు. అందుకని మనిషి ఈ సహజస్థితిని కనుక్కోగలిగినప్పుడు నిరంతరమైన ఆనందాన్ని అనుభవిస్తాడు."
** "నేను ఎవరు?" అనే అన్వేషణ ప్రారంభించి ఈ శరీరమూ, ఈ కోరికలూ, ఈ భావాలూ, ఇవన్నీ నేను కాదనీ అర్థం చేసుకోగలిగితే, నీ అన్వేషణకి సమాధానం నీ హృదయపు లోతుల్లోనే నీకు అవగతమౌతుంది. అసంకల్పితంగానే ఒక గొప్ప అనుభవమ్గా అది నీకు దక్కుతుంది. "నేను" గురించి తెలుసుకో. అప్పుడడు సూర్యకాంతి లాగ సత్యం నీకు గోచరిస్తుంది. నీ మనస్సు ఎదుర్కుంటున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ ఆత్మజ్ఞానం కలిగితే ఇంక నీకు సందేహాలంటూ ఏమీ మిగలవు."
*** "తాను స్వాభావికంగా బలహీనుడిననీ, పాపాత్ముడిననీ ఆలోచించడమే మనిషి చేసే పెద్ద తప్పు. స్వాభావికంగా ప్రతిమనిషి మనసులోనూ బలమూ,దైవత్వము నిండి ఉంటాయి. బలహీనంగానూ, పాపమయంగానూ ఉండేవి అత్డి ఆలోచనలూ ,అలవాట్లూ,కోరికలూ మాత్రమే కానీ, మనీషి కాదు."
రమణమహర్షి ముఖ్య శిష్యులలో ఒకరైన యోగి రామయ్య గురించిన కబుర్లు కూడా బాగున్నాయి. ఒక సందర్భంలో రచయిత విచారగ్రస్తుడై ఉన్నప్పుడు రామయ్య యోగి ఆయనని తనతో అరణ్యం మధ్యలో ఒక సరస్సు ప్రాంతానికి తీసుకువెళ్ళి ధ్యానంలో మునిగిపోవడం...క్రమక్రమంగా రామయ్య యోగి తాలూకూ ప్రశాంత తరంగాలు రచయితకు చేరి అతని మనస్సు కల్లోలరహితంగా మారే సన్నివేశం రమణీయం! 'రమణాశ్రమం'లో రచయిత పొందిన అనుభూతులూ, ధ్యానంలో అందుకున్న స్వప్నసాక్షాత్కారాలు మొదలయినవి చదివాకా 'అరుణాచలం' వెళ్లాలనే నా చిరకాల కోరిక మరోసారి గాఢంగా మొదలైంది.
నేనీ పుస్తకాన్ని మాత్రం పాల్ బ్రంటన్ కళ్లతోనే చదివాను. ప్రతి సంఘటననూ, అనుభూతినీ తార్కికంగా, హేతువాద దృక్పధంతో అర్థం చేసుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం నన్ను ఆకట్టుకుంది. ఒక పాశ్చాత్యుడు చేసిన పరిశోధనల వల్ల మన ప్రాచీన జ్ఞానసంపద గురించి మనకి తెలియడం కాస్తంత విచారకరమైనా, ఎలాగోలా ఇటువంటి నిగూఢ రహస్యాలు, యోగవిజ్ఞానవిషయాలు వెలుగులోకి వచ్చినందువల్ల యువతను సన్మార్గంలోకి మళ్ళించగలిగే సదవకాశం కలిగింది కదా అని ఆనందపడ్డాను. పాల్ బ్రంటన్ కు ఎదురైన సంఘటనలు, దివ్యానుభూతులూ, కలిసిన విశిష్ఠవ్యక్తులూ, చివరికి రమణ మహర్షి దగ్గరకు అతడు చేరే విధానం.. అన్నీ అతడిలో సత్యాన్వేషణ పట్ల ఉన్న ధృఢనిశ్చయానికీ, పూర్వజన్మ సుకృతానికీ ఫలితాలనిపిస్తాయి. మనిషి తీవ్రంగా దేనికొరకైతే అన్వేషిస్తాడో దానిని సాధించడానికి ప్రకృతి కూడా తన వంతు సహకారాన్ని అందిస్తుందన్న సూత్రంలో నిజం లేకపోలేదు! నాకీ పుస్తకం చదివే అవకాశం కలగడం నా అదృష్టమనే భావిస్తున్నాను.
తత్వపరమైన విషయాల పట్ల, ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారికి ఈ పుస్తకం పూర్తిస్థాయి ఆనందాన్నివ్వగలదు. అలా లేని పక్షంలో పుస్తకప్రియులైనా కూడా ఈ పుస్తకం జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది.