అభిమానులెవరైనా "ఏమండీ ఈ మధ్య మీరేమీ రాయడం లేదే?" అని అడిగితే "ఏం, ఎందుకు రాయాలి? పద్యం రాస్తే విశ్వనాథతో సమానంగా, లిరిక్ రాస్తే కృష్ణ శాస్త్రి స్థాయిలో, గేయం రాస్తే శ్రీశ్రీ లాగా, వచనం రాస్తే వేలూరి, శ్రీపాదల్లాగా, కథలు రాస్తే చలం లాగా రాయగలిగినప్పుడే రాస్తాను. అలా రాయలేనప్పుడు అస్త్రసన్యాసం చేసి హాయిగా చదువుతూ కూచుంటాను" అని జవాబు చెప్పేవారుట. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, అద్దం మీద ఆవగింజలా అందకుండా జారిపోయే చాతుర్యం వారి స్వార్జితమట.
ఇంతకీ వారెవరూ..... అంటే, మిత్రులతో రుక్కాయి, జలాలుద్దీన్ రూమీ, రుక్కుటేశ్వరుడు అని పిలిపించుకుంటూనే, జయంతి కుమార స్వామి, వెల్లటూరి సోమనాథం, చలికాలం మార్తాండరావు.. ఇలా లెఖ్ఖలేనన్ని మారుపేర్లు పెట్టుకున్న బహుముఖప్రజ్ఞాశాలి జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి ! పేరడీ శాస్త్రి, జరుక్ శాస్త్రి గా పేరొంది, సాహిత్యాభిమానుల అభిమానాన్ని దండిగా పొందిన మహా మనీషి! అయితే ఇన్ని మారుపేర్లతో రాయటం వల్లనే చాలా రచనలు వెలుగులోకి రాలేకపోయాయని అంటారు.
శ్రీశ్రీగారిలా అన్నారుట "నిజమైన పేరడి ఒరిజినల్ ను జ్ఞాపకం తెస్తుంది. మాతృకలాగనే ఉంటూ అర్థాన్ని లఘువు చేస్తూ అపహసిస్తూ తల్లివేలితో తల్లికన్నే పొడిచేలా రూపొందే రచనాపత్రికను 'పేరడీ' అనవచ్చు. అలా పేరడీలు రచించడంలో జలసూత్రం రుక్మిణీశానాథశాస్త్రి సిధ్ధహస్తుడు." అని.
తాను రాసిన పేరడీల వల్ల "పేరడీశాస్త్రి" అని పేరుపొందినా, జీవించిన ఏభైనాలుగేళ్ళలో ఎన్నో రకాల రచనలు చేసారు. కథలు, నాటికలూ, విమర్శలూ, కవిత్వం అన్నింటా వారి ప్రవేశం ఉంది. జరుక్ శాస్త్రి గారి కథల సంకలనమే "శరత్ పూర్ణిమ". 1981లో ప్రధమ ముద్రణ అయ్యింది .మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ జనవరిలో రెండవ ముద్రణ వెలువడింది.
1981లో "శరత్ పూర్ణిమ", 1982 లో "జరుక్ శాస్త్రి పేరడీలు" వచ్చాకా, వారి నాటికలు,వ్యాసాలు,వచన రచనలు,సమీక్షలు మూడవ సంపుటిగా వస్తే శాస్త్రి గారి పూర్ణవ్యక్తిత్వానికి సూర్యలోకం కలుగుతుందని రమణారెడ్డిగారు పేరడీలు పుస్తకం ముందుమాటలో అన్నారు. అదే పుస్తకంలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు రాసిన "జలసూత్రం అంతస్సూత్రం" లో జరుక్ శాస్త్రి గారి గురించి చెప్పిన విశేషాలు ఆసక్తికరంగా ఉంటాయి. జరుక్ గారు సంస్కృతం,తెలుగు,ఇంగ్లీషు సాహిత్యాలు కలగలిపి మాట్లాడేవారుట. ఆ సాహిత్య దాహానికి అంతులేదుట. సాహిత్యం మీద అంత ప్రాణం పెట్టే మనిషి కనిపించరట. ఇక కొన్ని వాక్యాలు ఇక్కడ యథాతథం దించకపోతే నాకు తోచదు..
"మంచి కథలు(కొంచమైనా) వ్రాశాడు.
కణకణాలాడే పేరడీలు చేశాడు.
చుర్రుమనే పద్యాలు పలికాడు.
గొప్ప వ్యాసాలు రాసాడు.
విశ్వనాథ మీద వ్యాసం అతడే వ్రాయగలడనిపించాడు. శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి 'అనుభవాలు-జ్ఞాపకాలు' చదివి చారిత్రాత్మకమైన ఉత్తరం వ్రాసాడు.
కంకంటి-తిక్కన ఉత్తర రామాయణాల గురించి చేసిన తులనాత్మక ప్రసంగం అతని విమర్శనా నైశిత్యానికి నిదర్శనం.
సాహిత్యమే తిండి అదే పాన్పు అదే పానీయము. కానీ దేని మీదా స్థిరంగా నిలబడక, ఏదీ సమృధ్ధిగా ఇవ్వక ఆకస్మికంగా తెర వెనుకకు వెళ్పోయాడు. చెప్పినంత వరకూ, వ్రాసినంత మేరకు తనది తనదిగా ముద్ర వేసి పోయాడు."
'సాహిత్యమే తిండి అదే పాన్పు అదే పానీయము.' అంటే, eat books-drink books-sleep books అన్నమాట :-))
హనుమచ్ఛాస్త్రి గారి వాక్యాలు, పేరడీలు పుస్తకంలో జరుక్ గారి జీవన విశేషాలు చదివాకా ఆయనంటే అపారమైన గౌరవాభిమానాలు కలుగుతాయి పాఠకులకు.
"జరుక్ శాస్త్రి పేరడీలు" పుస్తకం చిన్నప్పటి నుండీ ఇంట్లో చూస్తున్నదే. "శరత్ పూర్ణిమ" మాత్రం ఈ మధ్యనే కొన్నాను. మొత్తం ఇరవై కథలున్న ఈ పుస్తకం పూర్తయ్యేసరికీ జరుక్ గారికి అభిమానినైపోయాను. వీరి మిగతా రచనలు మూడవ సంపుటిగా వస్తే చాలా బాగుంటుంది కానీ వారి మారు పేర్ల సరదా వల్ల సాహిత్యాభిమానులకు అవి చేరలేవేమో! ఈ కథలే అతి కష్టం మీద సేకరించారుట నవోదయా పబ్లిషర్స్. ఇంత ప్రజ్ఞాశాలి రచనలు సాహితీలోకానికి సంపూర్ణంగా లభ్యం కాకపోవటం దురదృష్టకరమే!
'ఒక్క మెతుకు చూస్తే చాలు..' అన్నట్లు ఒక్క కథ చదవగానే వారి మేధస్సు ఎంతటిదో అర్థమైపోయింది. పుస్తకంలో నేను మొదట చదివిన కథ "ఒక్ఖ దణ్ణం". తర్వాత చివరి కథ "హోమగుండం" చదివాను. మనసంతా బరువెక్కిపోయింది. ఈ నరసమ్మ కథను దు:ఖ్ఖాంతం చెయ్యకుంటే బాగుండేది అని పదే పదే అనిపించింది. ఈ హాస్య వ్యంగ్య రచయితకు ఇంతటి ఆర్ద్రమైన కథలు రాసేంటటి మెత్తని మనసు ఉందని, ఆ మెత్తటి మనసు వెనకాల ఎంతటి బడబాగ్ని దాగి ఉండేదో కదా అనీ అనిపించింది ! అప్పట్లో స్త్రీలకు జరిగే అన్యాయాల పట్ల వారికెంతటి వ్యతిరేకత, సానుభూతి ఉండేవో అర్థం అయ్యింది. ఈ రెండు కథలూ పుస్తకంలో కెల్ల గొప్ప కథలు. అవి చదివాకా, స్త్రీ హృదయాన్ని ఈయన ఎంత బాగా అర్థం చేసుకున్నరో.. అనిపించక మానదు.
కేవలం సంభాషణలతోనే కథంతా నడిచే "పెంకిపిల్ల" ఒక ప్రయోగమయితే, చక్కని అందమైన సంసారానికి ప్రతీక "శరత్ పూర్ణిమ". "యశోద" కథ తల్లి హృదయాన్ని తెలియచెప్పే interior monologue ! కవీంద్రుడు "రవీంద్రుడు" చనిపోయాకా రాసిన "నాలో నేను" డైరీలో ఒక పేజీలా ఉంది. టాగూర్ పట్ల ఆయనకెంత ప్రేమాభిమానాలున్నాయో చెబ్తుంది. టాగూరు
"Do not go, my love, without asking my leave.
i have watched all night, and now my eyes heavy with sleep" అంటే,
"ఏను నిద్దుర వోదునో, యేమొ, కరుణ
సెలవు గై కొనకేగగా వలదు; ఇన్ని
నాళ్ల యెడలేని యెడబాటు నా నిరీక్ష
ణమ్ము బరువులు బరువిలై నయన యుగళ
మయ్యొ దిగలాగు నిద్దర మరపులకును"
అని కృష్ణశాస్త్రి అన్నారుట.
ఇంకా.. బీదరికం, అనుమానం, స్వోత్కష, ప్రేమ, అహంకారం, దురాభిమానం, వ్యంగ్యం.. ఒకటేమిటి అన్ని రకాల సామాజిక, మానసిక అంశాలూ జరుక్ గారి కథాంశాలే ! ఒకో కథా ఒకో జీవితాంశాన్ని స్పృశిస్తుంది. ఆంగ్ల సాహిత్యంలో వీరికి ఉన్న అనుబంధ గాఢత కొన్ని కథల్లో మనకు కనిపిస్తుంది. ఈ కథల్లోని సరళమైన తెలుగు, సులువైన మాటలు, సూటైన వాక్యాలు, అక్షర సత్యాలు పాఠకహృదయాల్లో నిలిచిపోయాయి అనటం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
ఈ కథల్లో నాకు బాగా నచ్చిన కొన్ని వాక్యాలు...
* ఈ ఆడపిల్లలది మరీ విచిత్రం. నీ దగ్గర నువ్వు అరచేతిలో ఆడిస్తూ, తల్లో పువ్వులాగ చూశినా సరే, ఎంత సొతంత్రo ఇచ్చినా సరే. పంజరంలో చిలకలగా ఉంటారు. పుట్టింటికంటూ వెళ్లారో - నీటిలో చేపల్లాగా తిరుగుతారు.
* వీరుడంటే..?
కత్తి పుచ్చుకుని కదనకుతూహల రాగం రైట్,లెఫ్ట్ చిందుల్లో రంగరిస్తు యుధ్ధరంగానికి పోయిన మగాడు...... పనిలోకి వెళ్ళిన వాడల్లా వీరుడే కత్తి పుచ్చుకోకపోయినా - గరితటెను గాండీవంలాగు పుచ్చుకున్నవాడూ? వీరుడే.
* ఈ కాస్త సుఖం గూడా భగవంతుడు దక్కనీడు. నాకు తెలుసు. చూస్తున్నాగా. ఏది తలపెట్టు - భగవంతుడూ ఎగస్పార్టీ?
* అడ్రస్ దొరుకుతుందేమో అని సూట్కేస్ అంతా గాలించాడు....అన్నీ తీశాడు. అవన్నీ మల్లెపూలలాగ పరిమళించడమే గాని, ఏమీ చెప్పవు. మల్లెపూలైనా మేలే - తర్వాత కథ చెబ్తే.
* స్వార్థం వల్లనేనేమో "లోకాస్సమస్తా స్సుఖినోభవంతు" అని నిత్యం కోరుకోటం...గడియారంలో ఈ చక్రం సరిగా తిరగాలంటే అవతలి అన్ని చక్రాలూ, అన్ని పళ్ళూ ఉండి సమంగా తిరిగితేనే గదా ఇది తిరగడం. మన తిప్పట కోసమే, మన సుఖం కోసమే, అందరినీ సుఖపడామంటున్నామేమో..
*తనలాగే అందరూ అనుకోవడం మానవస్వభావం. ఇది అమాయకత్వపు చిహ్నం. అమాయకత్వం యింకా ఎంత ప్రక్షాళన కాదో అంత సూటిదనం ఉంటుంది. పసిపిల్లల్లో ఇది మరీనూ.
*పేచీ వస్తుందనుకున్న చోట పేచీ రాకపోవటం ఎంతో నిరాశను కలగిస్తుంది. ఎంతో ప్రేమైనా ఉండాలి; కావలసినంత అసహ్యం అన్నా వుండాలి పేచీ రాకపోవటానికి.
*వెలుతురూ,చీకటీ పోట్లాడుకుంటున్నై. బొద్దింకలు తప్పుకు పారిపోతున్నాయి, పొయ్యిలో మంతలు గమ్మత్తుగా లేస్తున్నై. అగ్నిహోత్రుడికీ, ఆలోచనలకీ సయోధ్యల్లేవుంది. జ్వాలలు ఆదుతున్న కొద్ది ఆలొచనలు ఆడుతై.
*ప్రేమ ఉంటే ఏమైనా అనవచ్చు. పడవచ్చు గానీ, ప్రేమ కరువైన చోట 'ఆc' అంటం అన్యాయం. 'నారాయణా' బూతుమాటే !
* కొన్ని ప్రాణాలు సంతోషించటానికీ, సుఖపడటానికీ పుట్తవు. సంఘానికై వెంపరలాడతాయి గానీ, సుఖమ్ అనేది దక్కదు. ఆరాటమే మిగుల్తుంది.
*సాటి మనిషిని హింసించి, హింసించి చంపి, ఎన్ని యజ్ఞాలు చేస్తే ఏం...
*ఆకాశానా, యింట్లో, మాలో. మృతమౌనం! సప్తమహర్షులు పక్కన. సీరియస్ నాలోలాగా నిమిషనిమిషం రంగులు మారుస్తోంది. దూరాన కుజుడు మునిగోఇంట పువ్వులాగ.
*ఈ ఋషులు మౌనంగా ఉంటారు గానీ, ఎలా ఉంటారో... రాళ్ళలాగ, చెట్లలాగా.
* మన ఆశయాలు, అభిరుచులు ఎంత ఉన్నతాలైనా సరే - చేతిలో దబ్బులేకపోతే మనం ఏమీ సాధించలేం.
* నీ ప్రేమ ఎంత మధురమైనదో, నీ జాలి అంత బాధాకరం..
*"ఇదిగో బాయ్..అండీ గిండీ జాంతా నై. మనం భాయీ అంటే..భాయీ. లౌకిక మర్యాదలు వొద్దు. శుష్క ప్రియాలు వొద్దు. హృదయాలు విప్పి మాట్లాడుకుందాం."
నాకు వికరంతో కూడిన నవ్వు వచ్చింది. ఇలా లోగడ నేను చవకగా హృదయం విప్పి, విప్పమనీ అన్నప్పుడల్లా ఎందరు నవ్వుకున్నారో?
*పళ్ళాల చప్పుడులోనూ, మాలాంటివాళ్ళ బాతాఖానీ మహాభాష్యపురొదలో కళకళాలాడుతున్న వెయ్యి సంతర్పణల గలాభాలో అక్కడక్కడ వినబడుతోంది.
*ప్రేమా - సింగినాదం జీలకర్రాను; తోటి మనుష్యులా?జలగలు! తెలీకుండా నెత్తురు పిలుస్తారు! స్వేచ్ఛా..? ఆఘప్రసూనాలు తలలో తురుముకోడం; ఆశా? - కన్నీటిబొట్టుపైని సూర్యకిరణం తెప్పించే ఇంద్రధనువు! ఎందుకులెండి ఇప్పుడు వాటి స్మరణ - మీ పనేదో మీరు చూసుకోండి!!
* వెధవ నాగరికత. ఉన్నదున్నట్లు అని బతకలేమాయె.
*లోని నిజం పైకి చెబితే - విషం కాదా?
* ...నవ్వాను. ఆ ఒక్కనవ్వూ నా జీవితాన్నంతనూ పట్టి ఇవ్వవచ్చు.
* "దాందుంపతెగా - కళ్లకనపట్టం భయమాయె. తే. తే. ఎక్కణ్ణుంచి తెస్తారు? కుప్పలు పోసుక్కూర్చున్నారా? ఇలా సతాయించే బదులు ఏ అచ్చాఫీసులోనైన్నా పని కుదుర్చుకోరాదు? దేశబాధ తప్పుతుందీ. ధనుకులు, ధనికులు! వీళ్ల దుంపతెగా - పని చూపించి తిండి పెట్టే బదులు, కోర్తి కోసం - బిచ్చం వేసి - పొమ్మంటారు. ఈ దోపిడీగాళ్ళు జట్టుని తయారుచేసింది మహాదాతలే."
*మనసుకు నొప్పి కలక్కపోతే - మనం ముందుకు పోం. చలిమిడి సుద్దగా ఉన్నట్టుగానే ఉంటాం: మానవ మానసికవేదనకు ఖరీదు లేదు, నిజం. తల్లీ, తండ్రీ, భార్య, స్నేహితులు, సంఘం కట్టుకట్టి పోరి మొహాన వుమ్మేసి గెంటకపోతే, మానవమాత్రుడు సంపాదనకు దిగడు. సోమరిపోతు ఔతాడు నిజం.
* "మార్పు లేని మజా లేని, విశ్రాంతి గృహం ఆ స్వర్గం! నేను అనేది సమృధ్ధిగా వుండి ఏదో సాధించడానికి వీలైన స్థలo వొదులుతావు, ఎంత పిచ్చివాడవయ్యా నాయనా !"