ఆహారం మరియు పౌష్ఠికాహారం బోర్డ్-భారత ప్రభుత్వం వారు, ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికర్చరల్ యూనివర్సిటీ(ANGRAU) సహకారంతో నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో మూడు రోజులపాటు జరిగే "Millet Fest - 2013" ను నిన్న ప్రారంభించారు. ప్రజలు ఫాస్ట్ ఫుడ్స్ కి, ఇన్స్టెంట్ ఫుడ్స్ కి అలవాటు పడ్డం వల్ల చిరుధాన్యాలను కొనటం తగ్గిందని, అందువల్ల వాటి ఉత్పత్తి శాతం బాగా తగ్గిపోయిందట. రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు,సాములు మొదలైన చిరుధాన్యాలపై ప్రజల్లో తగ్గుతున్న ఆసక్తిని పెంచేందుకు, ఈ చిరుధాన్యాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన, ఉపయోగాలూ తెలిపేందుకు ఈ ప్రదర్శనను క్రిందటేడు నుండీ నిర్వహిస్తున్నారుట.
యూనివర్సిటీ వాళ్ళు పరిశోధనల్లో భాగంగా చిరుధాన్యాలతో తయారు చేసిన పదార్థాలు, బిస్కెట్లు, మురుకులు మొదలైనవి ప్రదర్శనలో ఉంచారు. అవి ఇంకా కావాలంటే యూనివర్సిటీ స్టోర్స్ లో లభ్యమౌతాయని కూడా చెప్పారు. ఇవే కాక వివిధ సంస్థలు(NGOs) చిరుధాన్యాలతో తయారు చేసిన రకరకాల పదార్థాలూ, వారు పండించిన ఆర్గానిక్ చిరుధాన్యాలు మొదలైనవి అమ్మకానికి పెట్టారు. నేటితరం మగ్గు చూపుతున్న పీజాలు,బర్గర్లు మొదలైన ఫాస్ట్ ఫుడ్స్ ఆరోగ్యానికి ఎంత హానికరమో, మన పూర్వీకులు ఎంతగానో ఆస్వాదించిన ఈ చిరుధాన్యాలు, వాటితో ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చునో కూడా ప్రదర్శనలో తెలుపుతున్నారు. నిజానికి ఆరోగ్యానికి హాని చేసే శనగపిండితో చేసిన పదార్థాలకన్నా ఆరోగ్యానికి మేలు చేసే జొన్న పిండి, రాగి పిండి మొదలైనవాటితో చేసిన పదార్థాలు ఎంతో మంచివి. ఎందుకంటే పిల్లలకు కావాల్సిన కేల్షియం, ఇనుము మొదలైనవి చిరుధాన్యాలలోనే ఎక్కువగా లభిస్తాయి.
మరోవైపున చిరుధాన్యాలతో చెసిన జొన్న రొట్టెలు, రగి రొట్టెలు మొదలైన వంటకాలను అమ్మకానికి పెడుతున్నారు. ఇంకా వంటకాలు తయారవుతున్నాయి. అవి సాయంత్రమే తింటానికి పెడతారుట.
న్యూస్ పేపర్లో ప్రకటన అయితే వేసారు కానీ ప్రదర్శన సమయం రాయలేదు. మేము నిన్న మధ్యాహ్నం వెళ్ళాము. "స్టాల్స్ చూడండి కానీ అమ్మకాలు సాయంత్రమే" అన్నారు. మళ్ళీ పాతిక కిలోమీటర్లు రాలేము అని రిక్వెస్ట్ చేస్టే కొన్ని స్టాల్స్ లో పదార్థాలు కొనుక్కోనిచ్చారు. ఇటువంటి ఉపయోగకరమైన ప్రదర్శనలు నిర్వహించేప్పుడు సరైన సమయం, ఎన్నాళ్ళు ఉండేది, ఇలాంటి ప్రదర్శనకు వెళ్ళటం వల్ల ఉపయోగాలు మొదలైనవాటి ప్రచారం సమంగా జరిపితే ప్రదర్శకుల శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. హోమ్ సైన్స్ స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహవంతంగా తమతమ ప్రయోగాలను గురించిన వివరాలు తెలియజేసారు.
ప్రదర్శన తాలుకూ ఫోటోలు:
murukus with jowar |
like khakhras |
recipe books |