(కొత్త పుస్తకాలకింకా ఫోటో తియ్యలే..ఇది పాత ఫోటోనే) |
అప్పుడప్పుడు దాచుకున్న కాయితం ముక్కలతో పర్సు నిండగానే మనసు పుస్తకాల షాపు వైపు పరుగులు తీస్తుంది. గత ఏడాది మూడు దఫాలుగా కొన్న పుస్తకాలన్నీ చదవటం అవ్వనేలేదు.. మళ్ళీ కొనటం ఎందుకని కాస్త ఆగాను. పది పదిహేను రోజుల క్రితం ఒక కొత్త పుస్తకం గురించి విన్నాకా శ్రీవారికి ఫోన్ చేసి అడిగితే, పాపం ఆఫీసు నుండి రెండు ప్రముఖ షాపులకూ వెళ్ళి ఇంకా రాలేదన్నారని వచ్చేసారు. కాస్తాగి మళ్ళీ ఇవాళ చేస్తే నవోదయాలో ఉందని చెప్పారు. సరే పదమని శ్రీవారిని బయల్దేరదీసా. " ఆ పుస్తకమేదో మొన్ననే దొరికి ఉంటే బావుండేది... నువ్వు బయల్దేరితే..." అని పాపం భయపడ్డారు. "అబ్బే మీ జేబుకేం భయంలేదు.. నా పర్సు ఈమధ్యన కాస్త బరువెక్కిందిలెండి" అని అభయమిచ్చాను :)
ఎవరెంత దూరంలో ఉండాలో దేవుడంతే దూరంలో ఉంచుతాడుట. అందుకేనేమో పుస్తకాల షాపులకీ నాకూ మధ్యన మైళ్ళు బాగా ఎక్కువైపోయాయి. అంచేత బండి పక్కనబెట్టి బస్సు మార్గాన్నేఎంచుకున్నాం. ఎర్రని ఎండలో రెండు బస్సులు మారి గమ్యం చేరాం. పుస్తక ప్రదర్శన తర్వత మీరు మళ్ళీ రాలేదేం అని ఆప్యాయంగా పలుకరించారు షాపులో ఆయన. "మొన్న మిమ్మల్ని ఖాళీ చేతులతో పంపించామని మేము బాగా ఫీలయ్యామండీ.." అంటూ మావారి చేతిలో నాక్కావాల్సిన పుస్తకాన్ని పెట్టారు ఆయన. "అక్కడివ్వండి.. ఈసారి ఆవిడదే బిల్లు.." అంటూ దొరికిందే ఛాన్సని మరో నాలుగు ఛలోక్తులు విసిరారు అయ్యగారు. "అబ్బే ఆవిడ ఖచ్చితంగా అలా అని ఉండరు.." అని షాపాయన నాకు సపోర్టందించారు. నేను తీసుకున్న పుస్తకాలు కాక మరో ఐదారు పుస్తకాలు బిల్లు జాబితాలో చేర్పించాకా "ఈ కథలు కూడా బావుంటాయి చూడండి.." అని మరో పుస్తకాన్ని అందించారు. వద్దు మహాప్రభో...ఇక చాలన్నాను. ఆయన వెంఠనే పుస్తకాన్ని తెరిచి ఓ కథ చూపెట్టి, "ఈ కథ చదవండి. నచ్చకపోతే పుస్తకం వెనక్కి తెచ్చి ఇచ్చేయండి. ఈ ఒక్క కథ కోసం ఈ పుస్తకం కొనచ్చు" అన్నారు. ఇహ అది కూడా కలిపి ఓ పదిపదిహేను పుస్తకాలు రెండు క్లాత్ కవర్లల్లో నింపుకుని, తృప్తిగా మిగతా పనులు ముగించుకుని ఇల్లు చేరేసరికీ రాత్రి భోజనసమయం దాటిపోయింది.
ఇంటికొచ్చి గబగబా వంటచేసి, తిని, పిల్లని పడుకోబెట్టి, అన్ని పనులూ పూర్తి చేసుకునేసరికీ గడియారం ముల్లు ఇవాళ్టి తేదీ చూపించేసింది. కొత్తగా కొన్నపుస్తకాలు ఇంటికొచ్చాకా ఓసారి మళ్ళీ అన్నీ తిరగేసి, అన్నింటిపై కొన్నతేదీ వేసి, సంతకం పెట్టుకోవటం నాకు అలవాటు. రేపు ఆదివారమే కదా అందుకని లేటయినా తీరుబడిగా అన్నీ ఓసారి తిరగేసి, షాపాయన బాగుంటుందన్న కథ చదువుతూ లోకం మర్చిపోయినా, మధ్యలో ఓసారి తలెత్తి 'నాకు లేటవుతుంది.. మీరు నిద్రోండి..' అని చెప్పేసా! మనసు బరువైపోయినా వెంఠనే రెండవసారి మళ్ళీ చదివా! కథయ్యేసరికీ ఈ సమయమైంది. అసలు ఆ కథ గురించి రాద్దామని బ్లాగు తెరిచా.. కానీ ఈ కథంతా రాయాలనిపించి రాసేసా :) ఎందుకనో ఈసారి కొన్న పుస్తకాలన్నీ చాలా ఆనందాన్నీ, మంచి పుస్తకాలు కొన్నానన్న తృప్తినీ కలిగించాయి. వీటిల్లో ఎన్నింటి గురించి టపాలు రాయగలనో... చూడాలి మరి !
వచ్చేప్పుడు దారిలో నాన్న డాక్టరు దగ్గరకు వెళ్తే, పుస్తకాలు చూపించచ్చు అని అక్కడికి వెళ్ళా. నాన్న అన్నీ చూసి "బావున్నాయే.." అని "మరి చిరిగిన చొక్కా ఏదీ.." అన్నరు :-)