సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, March 16, 2013

పనసచెట్టు - పనస పొట్టు




అనగనగా మా ఊరు. మా ఊరి పెరటితోటలో పెద్ద పనసచెట్టు. దాని నిండా ఎప్పుడూ గంపెడు పనసకాయలు ఉండేవి. పైన ఫోటోలో ఉన్నట్లు బుజ్జి బుజ్జి కాయలు కూర కు వాడేవారు. శెలవులయిపోయి బెజవాడ వెళ్పోయేప్పుడు మా సామానుతో పాటు ఓ గోనె బస్తా.. దాన్నిండా బుజ్జి బుజ్జి పనసకాయలు, ఓ పెద్ద పనసకాయ ఉండేవి. చిన్నవి కూర కాయలని ఇరుగుపొరుగులకి పంచేసి, పెద్ద కాయ మాత్రం అమ్మ కోసి తొనలు పంచేది.


మా చెట్టు పనసకాయలో అరవై డభ్భై దాకా తొనలు ఉండేవి. కొన్ని కాయల్లో వందా దాకా తొనలు ఉండేవి. మహా తియ్యగా ఉంటాయని అందరూ చెప్పుకునేవారు. అలా ఎందుకు అంటున్నానంటే నేనెప్పుడూ పనసకాయ తిని ఎరుగను ! నాకా వాసనే గిట్టదు..:( ముక్కు మూసేసుకుంటాను. మా అన్నయ్య నాతో ఒక్క పనస తొన అయినా తినిపించాలని పనసతొనలు పట్టుకుని నా వెనకాల తిరిగేవాడు.. ముక్కు మూసుకుని ఇల్లంతా పరిగెట్టించేదాన్ని తప్ప ఒక్కనాడు రుచి చూడలేదు. అందుకే అన్నారు "ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి.." అని గేలి చేసినా సరే! పనసకాయ కోసే దరిదాపులకి కూడా వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు నా కూతురు వాళ్ల నాన్నతో కలిసి నన్ను ఆటపట్టిస్తూ పనసతొనలు తింటుంది. బజార్లో కూర కోసం పనసపొట్టు, పాప కోసం పనస తొనలు కొంటుంటే నాకు మా పెరట్లోని చెట్టు గుర్తుకు వస్తుంది.. ఎంత పెద్ద చెట్టో ఎన్ని కాయలు కాసేదో.. ! కాలజాలంలో ఇల్లు, పెరడు అన్నీ మాయమైపోయాయి. ఇప్పుడిలా కొనుక్కుని తింటున్నాం కదా అని మనసు చివుక్కు మంటుంది..:( నువ్వు ఒక్క పనసచెట్టు గురించి ఇంతగా అనుకుంటున్నావా..? మాకు పనస తోట ఉండేది.. తెల్సా అన్నారు నాన్న!


 పనసతొనలు తినను కానీ పనస పొట్టు కూర మాత్రం చక్కగా చేస్తాను, తింటాను. ఇంతకీ ఇప్పుడు సంగతేంటంటే మా అన్నాయ్ మాంగారూ ఊర్నుండి కూర పనసకాయ తెచ్చిచ్చారు. వద్దనలేను కదా.. తెచ్చేసా ! 
కానీ ఎట్టా పొట్టు చెయ్యాలి? నా దగ్గర కత్తి లేదు కత్తిపీటా లేదు :(
"చాకుతో పనసపొట్టు తీసే మొహం నేనూను..:( " అనేస్కుని.. 
మొత్తానికి సక్సెస్ఫుల్ గా పొట్టు తీసి, ముక్కలు చేసి గ్రైండర్ లో వేసి పొట్టు చేసేసానోచ్ !!! 












తీరా పావు వంతు కాయ కొడితేనే బోలెడు పొట్టు వచ్చింది.. నే కూరకి కాస్త తీసి, మిగిలింది ఎవరికి దానం చెయ్యాలా అని ఆలోచన..?! ఎక్కడ తెలుగువాళ్ళే తక్కువ..పనసపొట్టు కావాలా అని ఎవర్ని అడుగుతాం?
ఇంకా ముప్పాతిక కాయ ఉంది ! అంచేత నే చెప్పొచ్చేదేమిటంటే, పనసపొట్టు ఎవరిక్కావాలో చెప్పండి బాబు చెప్పండి...


***    ***    ***

పనసపొట్టు కూర గురించి ఇక్కడ రాసా..  
http://ruchi-thetemptation.blogspot.in/2011/11/blog-post_23.html