సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, January 6, 2013

జంటగా చూసితీరాల్సిన "మిథునం" !





పదిహేనేళ్ళ క్రితం రాయబడిన ఒక కథ.. కథాజగత్తునే ఒక్క ఊపు ఊపింది. ఎంతోమంది సాహితీప్రియుల ఆత్మీయతనీ, ఆదరణనీ, అభిమానాన్ని సంపాదించుకుంది. నాటక రూపంలో రేడియోలోనూ, రంగస్థలం పైనా చోటు సంపాదించుకుంది. ఆంగ్లానువాదం అయి మళయాళ చలనచిత్రంగా  కూడా రూపుదిద్దుకుంది. బాపూ అందమైన చేతివ్రాతలో దస్తూరీ తిలకమై నిలిచింది. ఎందరో సాహితీమిత్రుల శుభకార్యాల్లో, శుభ సందర్భాల్లో వారివారి బంధుమిత్రులకు అందించే అపురూపమైన కానుకైపోయింది కూడా. అటువంటి బహుళప్రాచుర్యం పొందిన కథను తెరపైకెక్కించే ప్రయోగం చేసారు శ్రీ తనికెళ్ల భరణి గారు. 


ఒక భాష నుండి మరో భాషకు చేసే సాహిత్యానువాదాన్ని అనువాదం అనరు.. "ప్రతిసృష్టి" అంటారు. అసలు రచనలోని సారన్ని మార్చకుండానే తనదైన శైలిలో ఎంతో నేర్పుతో అనువదిస్తాడు అనువాదకుడు. అందువల్ల అది "ప్రతిసృష్టి" అవుతుంది. ఆ విధంగా "మిథునం" సినిమా కూడా భరణి గారి ప్రతిసృష్టి అని చెప్పాలి. కాలానుగుణంగా ఉండటానికి శ్రీరమణ గారి కథ కు కాసిన్ని మార్పులు చేసినా కూడా అసలు కథలోని సారానికి ఏమాత్రం లోటు రానీయలేదు ఆయన. జీవితపు బరువు బాధ్యతలు దింపుకున్న ఓ వృధ్ధ జంట, పల్లెటూరిలోని తమ సొంత ఇంటిలో చివరి రోజులు గడపటం ప్రధాన సారాంశం. వాళ్ల వానప్రస్థం అన్నమాట. ఒక జంట అన్యోన్యంగా ఉంటే ఎలా ఉంటుందో అక్షరరూపంలో చూపెట్టారు శ్రీరమణ గారు. అది దృశ్యరూపంలో ఇంకెంత బావుంటుందో కన్నులపండుగగా చూపెట్టారు భరణి గారు.



ఈ కథను సినిమాగా తీస్తున్నారనగానే నన్ను భయపెట్టినవి రెండే విషయాలు. ఒకటి నటీనటులు, రెండోది ఇల్లు. ఆ పాత్రలు ఎవరు చేస్తారో..ఎలా చేస్తారో అనీ;  అసలలాంటి తోట, పెరడు ఉన్న ఇల్లు దొరుకుతుందా అనీనూ! కానీ బాలూ, లక్ష్మి ఇద్దరూ కూడా తమ పరిధుల్లో ఎక్కడా కూడా వారి నిజరూపాల్లో కనబడక, కథలోలాగ ఎనభైల వయసులో లేకపోయినా, కేవలం అప్పదాసు,బుచ్చిలక్ష్మి లాగానే కనబడటం దర్శకుడి ప్రతిభే ! ఇంక అలాంటి తోట, పెరడు, చెట్లు, పాదులు అన్నీ ఉన్న ఇల్లెక్కడ దొరుకుతుందా అని బెంగపెట్టుకున్నాను నేను. అలాంటిది శ్రీకాకుళంలో దొరికిందిట.. ప్రొడ్యూసర్ ఇల్లేనట అని తెలిసి ఆనందించినదాని కంటే సినిమాలో ఆ ఇల్లు చూశాకా ఇంకా ఎక్కువ సంబరపడ్డాను. "ఆ ఇంట్లో నా కూతురి పెళ్ళి చేసాను. సినిమాకి డబ్బులు రాకపోతే ఇంకో కూతురు పెళ్ళి చేసాననుకుంటాను.." అన్నారట ప్రొడ్యూసర్. అలాంటి పెరడు, చెట్లు, ఇల్లే ఉంటే అప్పదాసేమిటి, ప్రపంచాన్ని వదిలేసి నేనే అక్కడ ఉండిపోతాను..:) ఎన్ని లక్షలు, కోట్లు సంపాదించినా అటువంటి ప్రశాంతమైన జీవితం గడపగలమా?





సినిమా గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మరోటుంది.. ఫోటోగ్రఫీ. భరణి గారి అన్నగారి కుమారుడే ఫోటోగ్రఫీ చేసాడుట. యూనిట్ అంతా కూడా అంతకు ముందు భరణితో పనిచేసిఉన్నవారవటం తనకు ఉపయోగపడిందని ఓ ఇంటర్వ్యులో భరణి చెప్పారు. మొదటి చిత్రమే ప్రయోగాత్మకంగా, రెండే పాత్రలతో ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా నడిపించగలగటం ఎంతో సాహసం. దర్శకత్వంలో కొద్దిపాటి లోటుపట్లు కనబడినా చెప్పదలిచిన విషయాన్ని సమర్థవంతంగానే తెలియజేసారు భరణి. సినిమాలో నాకు బాగా నచ్చినది రేడియో ! పొద్దున్న 'శుభోదయం' నుంచీ రాత్రి 'జైహింద్' అనేదాకా రేడియో కార్యక్రమాల టైం ప్రకారం తమ పనులు కూడా చేసుకునేవాళ్ళు అదివరకూ రేడియో శ్రోతలు. మళ్ళీ ఆ సిగ్నేచర్ ట్యూన్స్ వింటుంటే పాతరోజులు గుర్తుకువచ్చాయి..


అమెరికా పిల్లల కబుర్లు వచ్చినప్పుడు హాలులో నవ్వులు, చివర్లో నిట్టూర్పులూ, ముక్కు చీదిన బరబరలు.. ప్రేక్షకులు ఎంతగా లినమయ్యారో చెప్పాయి. మేం కూడా సినిమా అయ్యాకా కాసేపు అలా కూచుండిపోయాం. బయటకు వచ్చాక కూడా చాలా సేపు మట్లాడుకోలేకపోయాం..! మనసు భారం చేసేసావయ్యా భరణీ అని బాధగా మూల్గినా, అదే సత్యం కదా అని గ్రహించుకుని.. నెమ్మదిగా తేరుకున్నాను. అయితే హాలులో నెంబరింగ్ లేకపోవటం, అతితక్కువ హాల్సు లో విడుదల చేయటం, శనివారం అయినా హాలు నిండకపోవటం కలుక్కుమనిపించాయి. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి ఎదుగుతారో.. ఎప్పటికి చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతుందో.. అన్న ప్రశ్నలు ఇంకా వెంటాడుతున్నాయి నన్ను. 



మూలకథలో లేని మార్పులు చేసినా కూడా వృధ్ధజంట అన్యోన్యత, చిలిపి తగదాలు, పరస్పరాఅనురాగం చూసి నేటి తరం జంటలు నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది సినిమాలో అనుకున్నా.. అందుకే నాకనిపించింది ఏమిటంటే ప్రతి జంటా జంటగా చూసితీరాల్సిన చిత్రం "మిథునం" అని !