ప్రముఖ లలిత సంగీతదర్శకులు, గేయ రచయిత శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి మరణ వార్త యావత్ సంగీతలోకాన్నీ, వారి అభిమానులనూ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంగీతజ్ఞుడు స్వరపరిచిన లలితగీతాలబాణీలు తెలుగువారికి చిరస్మరణీయాలు. ముఖ్యంగా లలిత సంగీతానికి పాలగుమ్మివారు అందించిన సేవ అనంతం. ఆయన పాటలు చాలా వరకూ వారి వెబ్సైట్ 'http://palagummiviswanadham.com/’ లో వినటానికి, కొన్ని డౌన్లోడ్ కు కూడా విశ్వనాథంగారు ఉండగానే అందుబాటులో పెట్టడం హర్షించదగ్గ విషయం.
గత నవంబర్ లో దూరదర్శన్ వాళ్ళు ప్రసారం చేసిన ’మా ఊరు’ అనే కార్యక్రమంలో విశ్వనాథంగారు కూడా పాల్గొన్నారు. ఆయనపై అభిమానం కొద్దీ మా నాన్నగారు ఆ కార్యక్రమాన్ని బయట రికార్డ్ చేయించుకున్నారు. ఆయన ఇంటర్వ్యూ ఉన్న బిట్ వరకూ ఎడిట్ చేసి ఆ కార్యక్రమ్మాన్ని ఇక్కడ పెడుతున్నాను. విశ్వనాథం గారు పాడిన ’మా ఊరు ఒక్కసారి పోవాలి..’ పాట కూడా ఇందులో ఉంది. ఆ కార్యక్రమానికి సిగ్నేచర్ ట్యూన్ క్రింద ఈ పాటనే పెట్టుకున్నారు.
ఆయన పాడిన ఇతర లలిత గీతాల్లో "అమ్మదొంగ..’, "ఎన్నిసారులు అన్నదో..’ , "ఎంత సుందరమైనదో..’ మొదలైనవి నాకు ఇష్టమైన పాటలు.
1) శ్రీమతి బి.వరహాలుగారు పాడిన ’అమ్మదొంగ..నిన్ను చూడకుంటే..." క్రింద లింక్ లో వినవచ్చు:
http://samgeetapriyaa.blogspot.in/2012/10/blog-post_27.html
2) ఎన్నిసారులు అన్నదో ఎన్నెన్ని తీరులు విన్నదో..
http://www.palagummiviswanadham.com/music/bhava-geethaalu/sweeyarachanalu/ennissarulu.mp3
3) ఎంత సుందరమైనది భగవానుడొసగిన బహుమతి...
http://www.palagummiviswanadham.com/music/bhava-geethaalu/sweeyarachanalu/enthasundaramainadi-palgummi.mp3
గుడిపూడి శ్రీహరి గారు రచించిన "పాలగుమ్మి విశ్వనాథం గారి ఆత్మకథ" చాలా బావుంటుంది. ఆ పుస్తకం సి.పి.బ్రౌన్ అకాడమీ వాళ్ళు ప్రచురణ. అప్పట్లో పుస్తకం రిలీజైందని తెలిసిన వెంఠనే అన్నయ్యను సి.పి.బ్రౌన్ అకాడమీ వాళ్ల షాపుకి పంపి తెప్పించుకున్నాం. ఈ ఆత్మకథను చాలా ఆసక్తికరంగా రాసారు శ్రీహరి గారు. ముఖ్యంగా విశ్వనాథంగారి చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చూపిన తెగువ,ధైర్యం, వారు పడ్డ ఇక్కట్లు చదువుతూంటే కళ్ళు చెమరుస్తాయి.
సంగీతం పట్ల ఎంతో అంకితభావం ఉన్న ఇటువంటి కళాకారులు చాలా అరుదు, అవసరం అనే చెప్పాలి.