రివ్వున వీస్తున్న పవనాలు మనసుని చల్లబరుస్తాయి
పచ్చదనంతో మెరుస్తున్న పైర్లు తలలుపుతూ శుభోదయం చెప్తాయి
కరెంట్ తీగ మీద వాలిన నీలిరంగు పిట్ట నా అందం చూడమంటుంది
హడావుడిగా పరిగెడుతున్న తొండ తలఊపి హలో చెప్తుంది.
పువ్వుల చుట్టూ తిరగాడే రంగురంగుల సీతాకోకచిలుకలు..
నా కెమేరాకు అందకుండా కవ్విస్తాయి
మంచుతో తడిసిన గడ్డిపరకలు తళుక్కుమంటుంటాయి
మబ్బుల మధ్యనుండి తొంగి చూస్తున్న సూరీడు
అప్పుడే రానా.. వద్దా.. అని ఊగిసలాడుతూంటాడు
తోటలోని ఎర్రని,తెల్లని గులాబీలు విరగబూసి
నన్ను చూడు..నన్ను చూడు అంటూ గోముగా పిలుస్తూంటాయి
ఈ అందాలతో పనిలేదన్నట్లు ఆ పూరిపాకలోని పాప..
తనలోకంలో తాను కేరింతలు కొడుతుంటుంది
ఎర్రని చిగుర్లతో వేపచెట్లు నోరారా పలకరిస్తాయి కానీ
చేతులు చాచుకుని కూచున్న చింతచెట్లు ఎందుకో భయపెడతాయి!
ముళ్లచెట్టు మధ్యన నీలిపూలు మనోహరంగా కనబడతాయి
విరగబూసిన నందివర్థనాలు వెన్నెలని తలపిస్తాయి
నాకు తోడుగా చెవిలో కబుర్లాడుతున్న రేడియో జాకీ
కమ్మని పాటలతో నా ఆనందం పరవళ్ళుతొక్కుతుంది..
అలా.. ఈ ప్రకృతితో నేనూ మమేకమై పరవశించేవేళ
కుయ్యి మన్న రైలు కూతతో ఉలిక్కిపడతాను!
సందుచివర్లో కనబడుతున్న స్కూలు బస్సులు
ఇక చాలు ఈ లోకంలోకి వచ్చేయమని తొందరపెడతాయి
ప్రతి రాత్రీ రేపటి అనుభూతి గురించి కలలు కంటూ నిద్దరోతానా..
మళ్ళీ ఉదయానే నిన్నటి అనుభూతుల్ని వెతుక్కుంటూ నడచిపోతాను...