"
సన్నిహిత మిత్రులకూ, సమీప బంధువులకూ శుభాకాంక్షలు చాలా మంది చెప్తారు. కానీ అమ్మ వెరైటీగా పక్కింట్లో ఖాళీచేసి వేరే ఊరు వెళ్ళిపోయిన వాళ్ల అడ్రసు కనుక్కుని "వదినగారూ మీ రెండోవాడి పుట్టినరోజు రేపు. మా అందరి విషెస్చెప్పండి..." అంటూ కార్డ్ రాసి పోస్ట్ చేసేది. ఇది విజయవాడలో మా పక్కన ఉండి వెళ్ళిపోయినవాళ్ళ సంగతి మాత్రమే. కాకినాడలో మా పై ఇంట్లో అద్దెకు ఉండి వెళ్ళిపోయిన వాళ్ల అడ్రసు కనుక్కుని కూడా శుభాకాంక్షలు తెలపటం మాకునవ్వు తెప్పించేది. ఒకళ్ళు బ్యాంక్లో చేసేవారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలీలేదు. విజయవాడలో మాకు తెలిసినవాళ్లఅబ్బాయి పెళ్ళి కుదిరితే, ఆ పెళ్ళికూతురు కూడా అదే బ్యాంక్ అని తెలిసి, అమ్మ వాళ్ల బ్యాంక్ కు వెళ్ళి ఆ అమ్మాయినిపరిచయం చేసుకుని ఫలానావాళ్ళు తెలుసా? ఫలానా సంవత్సరంలో ఫలానా ఊళ్ళో చేసారు.. అంటూ వివరాలు చెప్పి ఆపెళ్ళికూతురు ద్వారా మొత్తానికి వాళ్ల అడ్రసు సంపాదించింది. చిన్నప్పుడు వేళాకోళం చేసినా పెద్దయ్యాకా నాకూ ఈ పిచ్చిఅంటుకుంది. చాలా ఏళ్ళపాటు బంధుమిత్రులందరికీ స్వయంగా గ్రీటింగ్స్ తయారు చేసి మరీ పంపేదాన్ని. ఈమధ్యఈమధ్యనే విసుగెత్తి చాలావరకూ పంపటం మానేసాను. అతిమంచితనానికి పోయి విషేస్ చెప్తే జవాబివ్వనివారుకొందరైతే, ఏదో అవసరం ఉండి ఈ వంకతో పలకరిస్తున్నాననుకుని అపార్ధాలు చేసుకునేవారు కొందరు. అమ్మ మాత్రంఇప్పటికీ అక్కచెళ్ళెళ్ళ,అన్నయ్యల పిల్లలవీ, వాళ్ళ మనవలవీ, సన్నిహిత మిత్రులందరివీ పుట్టినరోజులన్నీ గుర్తుఉంచుకుని అందరికీ ఫోన్ చేసి విషెస్ చెప్తుంటుంది.
ఊళ్ళోవాళ్ళ సంగతి ఇలా ఉంటే ఇక ఇక ఇంట్లో వాళ్ళ పుట్టినరోజులు అమ్మ ఎలా చేస్తుంది? మా అందరికీ డేట్స్ ప్రకారం, తిథుల ప్రకారం రెండు పుట్టినరోజులూ జరిపేది. అలా ఏటా మాకు రెండుపుట్టినరోజులు చేసుకోవటం అలవాటేపోయింది. అంతేకాక నాకూ, నాన్నకూ స్పెషల్గా మూడు పుట్టినరోజులు ఉన్నాయి. ఎలాగంటే ఓసారి ఒకాయన మాఇంట్లోవాళ్లజాతకాలన్నీ వేసి, నాన్న పుట్టినరోజు ఎప్పుడూ చేసుకునే రోజు కాదనీ, ఆయన పుట్టిన సంవత్సరంలో ఫలానానెలలో ఫలానాతారీఖనీ చెప్పారు. కానీ అప్పటికి నలభైఏళ్లపైగా పుట్టినరోజు జరుపుకుంటూ వస్తున్న తారీఖునిమార్చలేక అదీ, కొత్తగా తెలిసిన తారీఖుదీ, తిథుల ప్రకారం కలిపి నాన్నకు మూడు పుట్టినరోజులూ చేసేయటంమొదలెట్టింది అమ్మ. ఇక నేనేమో అసలు అధికమాసంలో పుట్టానుట. కానీ అధికమాసం అస్తమానం రాదుకదా...వచ్చినప్పుడు మూడూ చేసేసేది అమ్మ. అందుకని నావీ మూడు పుట్టినరోజులే!
ఈ విధంగా రెండేసి,మూడేసి పుట్టినరోజులు జరుపుకునే సరదాని మా అందరి నరనరాల్లో జీర్ణింపచేసింది మా అమ్మ. నాపెళ్ళి కుదిరిన తర్వాత జాతకాల నిమిత్తం అబ్బాయి జాతకం పంపారు పెళ్ళివారు. మరో వారంలో అబ్బాయి పుట్టినరోజనిఆ కాయితంలో చూసి అందరం హడావిడి పడిపోయాం. నేనేమో కష్టపడి నాన్న కేసెట్లన్నీ వెతికి వివాల్డీ, మొజార్ట్ దగ్గరనుండీ ఎల్.సుబ్రహ్మణ్యం వరకూ నానారకాల సంగీతాలతో ఒక సీడీ తయారుచేసి అబ్బాయికి పంపించాను. ఏంఅంటాడో అని ఆత్రంగా ఎదురుచూస్తూంటే అబ్బాయి ఫోన్ వచ్చింది... "సీడీ విన్నాను..బాగుంది. కానీ నాకు పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకునే అలవాటు లేదు..." అన్నాడు. దాందేముంది పెళ్లయాకా మాకులాగానే రెండుకాకపోయినా ఒక్క పుట్టినరోజన్నా చేద్దాంలే అనుకున్నా నేను. తీరా పెళ్లయ్యాకా చూస్తే సెలబ్రేషన్ సంగతటుంచి అసలుపుట్టినరోజుకి అయ్యగారు కొత్త బట్టలు కూడా కొనుక్కోరని తెలిసి అవాక్కయ్యాను. 'రేపు మీ పుట్టినరోజండి..' అని నేనేగుర్తుచేసాను. అంతలో మరో కొత్త విషయం చెప్పి నా గుండెల్లో బాంబు పేల్చారు..
తన డేట్ ఆఫ్ బర్త్ విషయంలో డౌట్ ఉందని చెప్పేసరికీ ముచ్చెమటలు పోసాయి నాకు. పుట్టినరోజు అంటే అదోఅద్భుతమైన రోజని నమ్ముతూ సంవత్సరం అంతా ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తాను నేను. ఊరందరికీపుట్టినరోజులు చేసేస్తుంది మా అమ్మ. అలాంటిది శ్రీవారి డేట్ ఆఫ్ బర్తే డౌటంటే... ఎలా? అని తెగ బాధ పడిపోయాను. అప్పుడిక లాభం లేదని విక్రమార్కుడి చెల్లెల్లు అవతారం ఎత్తేసాను. మా అత్తగారి ఊళ్ళో ఆయన ఏ హాస్పటల్లో పుట్టారోకనుక్కుని, అక్కడికి ఓ మనిషిని పంపి, నానా తంటాలు పడి మొత్తానికి ఓ నెలరోజుల్లో శ్రీవారి అసలైన పుట్టినరోజుకనుక్కున్నా. అదృష్టవశాత్తు పాత రిజిస్టర్లు ఇంకా హాస్పటల్లోవాళ్ల దగ్గర ఉండటం వల్ల అది సాధ్యమైంది. హమ్మయ్య! అనుకుని అప్పటినుండీ చక్కగా తన పుట్టినరోజు కూడా నేనే చేసేసుకుంటున్నా. అంటే పట్టుబట్టి సెలబ్రేట్ చేసేది నేనేకాబట్టి ఓ విధంగా ఇదీ నా పుట్టినరోజు క్రిందే లెఖ్ఖలోకి వస్తుందన్నమాట..:)
ఇంతకీ అసలు చెప్పొచ్చేదేమిటంటే ఇవాళ నా పుట్టినరోజు! ఇది అధికబాధ్రపదం కాబట్టి నా నిజమైన తిథులపుట్టినరోజుకూడా నిన్ననే అయ్యింది. ఇంకా ఎప్పుడూ చేసుకునే తిథులపుట్టిన్రోజు మళ్ళీ నెల్లో ఇంకోటి ఉంది :)