శ్రీ దువ్వూరి వేంకటరమణశాస్త్రి గారి రచన "జానకితో జనాంతికం" ఒక అద్భుతమైన వాక్ చిత్రం. 1975లో ఆయనే సొంతంగా చదవగా విజయవాడ ఆకాశవాణి ద్వారా ప్రసారమైంది. ఒకసారి దువ్వూరివారు విజయవాడ రేడియోస్టేషన్ కి విచ్చేసిన సందర్భంలో ఏదైనా మాట్లాడవలసిందిగా వెంకటరమణశాస్త్రిగారిని కోరితే, ఏ ముందస్తు తయారి లేకపోయినా అప్పటికప్పుడు ఈ "జానకితో జనాంతికం" స్క్రిప్ట్ చదివారిట వారు. రికార్డింగ్ సదుపాయాలు సరిగ్గాలేని అప్పటి పాత విజయవాడ ఆకాశవాణి స్టూడియోలో ఈ రికార్డింగ్ జరిగిందిట.
అప్పటికే పెద్ద వయసు అయినా, ఇందులో దువ్వూరి వారు తన స్వరంలో కనబరిచిన ఆర్ద్రత, సీతమ్మవారిపై కనబరిచిన గౌరవాభిమానాలు, వాయిస్ మాడ్యులేషన్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఒక వాక్యాన్ని ఎలా పలకాలి, మైక్ ముందర ఎలా మాట్లాడాలి అని కొత్తగా ఆకాశవాణిలో చేరినవారికి చెప్పటానికి ఈ టేపుని వినిపిస్తూ ఉండేవారుట.
రేపటి శ్రీరామనవమి సందర్భంగా దువ్వూరివారి స్వరంలో ఉన్న ఈ వాక్ చిత్రాన్ని ఈ టపాలో అందించాలని ప్రయత్నం. చాలా పాత రికార్డింగ్ అవటం వల్ల స్పష్టత కాస్త తక్కువైంది.. ! దువ్వూరివారి స్వరంలో ఉన్న ఈ పాత రికార్డింగ్ క్రింద లింక్లో వినవచ్చు.పదిహేనేళ్ల క్రితం ఒక శ్రీరామనవమి సందర్భంలో ఆంధ్రప్రభ పత్రిక వారు ఈ వాక్ చిత్రాన్ని అక్షరరూపంలో ప్రచురించారు. ఆ కాపీ ఇక్కడ చూడవచ్చు.
దువ్వూరి వారి స్వీయ చరిత్ర ( కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర ) గురించి పుస్తకం.నెట్ లో ప్రచురితమైన 'మెహెర్'గారి వ్యాసం ఇక్కడ చూడవచ్చు.