సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, March 21, 2012

బీరకాయ పీచు చుట్టరికం

చుట్టరికాలు రకరకాలు. మనం ముఖ్యంగా పరిగణించే అమ్మ తరఫువాళ్ళు, నాన్న తరఫువాళ్ళు కాక అమ్మమ్మ,తాతయ్య వైపు చుట్టాలు, నాన్నమ్మ,తాతయ్య వైపు వాళ్ల అన్నదమ్ముల తాలూకా, అక్కచెల్లెళ్ళ తాలూకా చుట్టాలుంటారు కదా వాళ్ళ చుట్టరికాలని బీరకాయ పీచు చుట్టరికం అంటారు. పూర్వకాలపు ఉమ్మడి కుటుంబాలున్నప్పుడు ఈ దూరపు చుట్టరికాలు కూడా అందరికీ తెలుస్తూ ఉండేవి. కానీ రానురానూ కుటుంబాలు చిన్నవి అయ్యే కొద్దీ బంధుత్వాలు, చూట్టరికాలు కూడా దూరంగానే జరిగిపోతున్నాయి. ఎప్పుడైనా అందరం కలిసినప్పుడు వీళ్ళు ఫలానా అని మన అమ్మమ్మలో, మావయ్యలో చెప్తే తప్ప మనకెవరూ తెలియదు. అలా అందరం కలిసే సందర్భాలు కూడా తక్కువైపోతున్నాయి రానురానూ.


గృహప్రవేశాలూ, ఇతర చిన్నపాటి వేడుకల్లో కన్నా పెళ్ళిళ్లలో మాత్రం చాలావరకు దూరపు బంధువులను మనం కలుస్తూ ఉంటాము. వేరే ఎక్కడా,ఎప్పుడు మనం వాళ్లను కలవకపోయినా కొన్ని ముఖ్యమైన పెళ్ళిళ్ళలో మాత్రం కొందరిని తప్పక కలుస్తూంటాము. హలో అంటే హలో అనుకోవటం, ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారని పలకరించుకోవటం మినహా పెద్దగా స్నేహబాంధవ్యాలు ఉండవు వీరితో. అమ్మ ద్వారానో, పిన్ని ద్వారానో వాళ్ల తాలుకూ కబుర్లు వింటుంటాం తప్ప వాళ్ల ఇళ్ళకు కూడా ఎప్పుడు వెళ్లం మనం. కానీ అలా అప్పుడప్పుడు కేవలం పెళ్ళిళ్ళలో మాత్రమే కలిసే కొందరు చుట్టాలు ఎందుకనో గుర్తుండిపోతారు మనకి. అలా నేను చిన్నప్పటి నుండీ చూస్తున్న/ఎరిగిన ఒక బీరకాయ పీచు బంధువు గురించి అమ్మ చెప్పిన వార్త విని ఈ టపా రాయాలనిపించింది.


ఆ బంధువు మా అమ్మమ్మ అక్కయ్యకు మనవడో ఏదో అవుతారు. నా చిన్నప్పటి నుంచీ మా ఇంట్లోని అన్ని ముఖ్యమైన పెళ్ళీళ్లకూ హాజరయ్యేవారు. ప్రతీ పెళ్ళి లోనూ ఎక్కడో ఆడుకుంటున్న నన్ను పిలిచి "ఏమే బావున్నావా? ఏం చదువుతున్నావు? " అని పలకరించేవారు. వాళ్ళావిడను పిలిచి "ఇదిగో ఈ అమ్మాయి గుర్తుందా..?" అని నేనెవరో చెప్పేవారు. ఎంత హడావుడి పెళ్ళిలోనైనా కనీసం భోజనాల సమయంలో అయినా సరే ఆయన పలకరింపు అలా అలవాటైపోయింది నాకు. కాస్త ఊహ వచ్చాకా ఏ పెళ్ళిలో అయినా ఆయన కనబడకపోతే "ఫలానావాళ్ళు ఈ పెళ్ళికి రాలేదా?" అని అమ్మని అడిగేంతగా నాకు ఆయన గుర్తుండిపోయారు. నాచిన్నప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు ఉండేవారు ఆయనకు.


నాపెళ్ళయాకా నేను కొన్ని ముఖ్యమైన పెళ్ళిళ్ళు మిస్సయ్యా. చాలారోజులతర్వాత ఒకసారి మాత్రం వాళ్ళను కలిసాను. "మీరిద్దరూ మా ఊరు రండి" అని ఆహ్వానించారు. ఓ పేరున్న హిల్ స్టేషన్లో ఉండేవారు వాళ్ళు. తర్వాత అమ్మ ద్వారా వాళ్ల అమ్మాయికి ఇంటర్ అవ్వగానే పెళ్ళి చేసేశారని విన్నాను. ఇప్పుడు మనవలు కూడాట. ఇక అబ్బాయికి ఇంజినీరింగ్ పూర్తయ్యి ఉద్యోగంలో చేరాడని విన్నాను. ఈమధ్యన ఆయన అమ్మకి ఫోన్ చేసారుట వాళ్ల అబ్బాయి పెళ్లి.. శుభలేఖ మిస్సయినా తప్పకుండా పెళ్ళికి రావాలి అని. మా పిల్లలందరిని పేరుపేరునా అడిగారుట. అమ్మ మళ్ళీ నాకీ సంగతి చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది. ఎక్కడో బీరకాయపీచు చుట్టరికం.. ఇంకా గుర్తుపెట్టుకుని పేరుపేరునా అడగటం, పెళ్ళికి అహ్వానించటం..! ఏళ్లపాటు బంధుత్వాలు నిలిచిఉన్న కొందరు చుట్టాల దగ్గరే సఖ్యత కనిపించదు. అలాంటిది ఇళ్ళకు వెళ్ళటాలు, ఉత్తరప్రత్యుత్తరాలు లేకపోయినా కేవలం పెళ్ళిళ్లలో కలిసిన పరిచయంతోనే ఇంతవరకూ ఈ బీరకాయ పీచు చుట్టరికం నిలిచి ఉండటం...నాకయితే విచిత్రంగానే తోస్తుంది. పైగా నే చిన్నప్పుడు చూసిన పాకే వయసుపిల్లలు ఇప్పుడు ఉద్యోగాల్లోకి వచ్చి పెళ్ళిళ్ళు అయ్యేంత పెద్దవారయిపోయారని విని ఆనందం, ఆశ్చర్యం రెండూ ఒకేసారి కలిగాయి !!