సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, March 18, 2012

KAHAANi - It's a one-woman show !





రిలీజైన పది రోజుల తర్వాత, బాగుందన్న టాక్ విన్నాకా నిన్న విద్యాబాలన్ నటించిన "కహానీ"(హిందీ) సినిమా చూశాం. హీరో డామినేషన్ ఎక్కువ ఉన్న భారతీయ సినిమాల్లో నాయికకు పెద్ద పాత్ర ఉండటం అరుదుగా కనబడుతూ ఉంటుంది. అలాంటిది తన ఒక్క పాత్రతోనే సినిమా మొత్తం నడిపించగల సత్తా తనకు ఉంది అని మరోసారి విద్యాబాలన్ నిరూపించింది. It's a one-woman show !



"పరిణీత" లో ప్రముఖ బెంగాలీ రచయిత శరత్చంద్ర నాయిక లలితగా ఒదిగిపోయినా, "గురు" సినిమాలో చక్రాల కుర్చీ లోంచి లేవలేని అంగవైకల్యం ఉన్న అమ్మాయిలా కంట తడిపెట్టించినా, "పా" లో సింగిల్ మదర్ గా జీవించినా, "భూల్ భులయ్య" (మన చంద్రముఖి సినిమా రీమేక్)" లో మానసిక రుగ్మత ఉన్న పాత్రలో మెప్పించినా, "డర్టీ పిక్చర్" లో స్టార్ హోదా నుంచి అపజయంపాలైన నటిగా మారిపోయినా... అది విద్య కే చెల్లింది. ఆమెకు ప్రశంసలు తెచ్చిపెట్టిన "ఇష్కియా", "హూ కిల్డ్ జెస్సికా" నేను మిస్సాయా.

తాజాగా ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్నీ, ఉత్తమ నటిగానే మరికొన్ని పురస్కారాలను అందుకున్న విద్యాబలన్ "కహానీ" సినిమాలో హీరోయిన్ ఇమేజ్ కు భిన్నమైన ప్రెగ్నెంట్ లేడీ పాత్ర పోషించింది. విభిన్నమైన పాత్రలు పోషించటంలో తనదంటూ ఒక ప్రత్యేక పంథా సృష్టించుకున్నవిధ్యాబాలన్ ఈ సినిమాలో కూడా అసామాన్య ప్రతిభను కనబరిచి ప్రేక్షకులను ముగ్ధులను చేస్తుంది. లండన్ నుంచి భర్తను వెతుక్కుంటూ వచ్చిన "విద్యా బాగ్చీ" అనే ప్రెగ్నెంట్ పాత్ర చుట్టూ మొత్తం సినిమా అల్లుకుపోయి ఉంటుంది. విద్య చెప్పే డైలాగ్స్ కన్నా ఆమె కళ్ళే ఎక్కువ సందేశాన్ని అందిస్తాయి. ఇక ఆమె నవ్వు వెన్నెలలు కురిపిస్తుంది అనటం అతిశయోక్తి కాదు. ఆందోళననూ, అమాయకత్వాన్నీ, కోపాన్నీ, హాస్యాన్నీ, ధైర్యాన్నీ, తెగింపునూ సమపాళ్లలో నింపుకున్న ఈ మహిళ చిట్టచివరిదాకా భర్త కోసం జరిపే వెతుకులాటలో మనమూ భాగమైపోతాం.


మెయిన్ స్ట్రీం మసాలా సినిమాలకు భిన్నంగా తయారైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కు దర్శకుడైన Sujoy Ghosh సహనిర్మాత కూడా. టైటిల్స్ మొదలుకుని చివరి దాకా ఎక్కడా కూడా చూసేవారికి విసుగు రాకుండా స్క్రీన్ ప్లే ను తయారుచేసుకోవటం ఈ దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. సినిమాలోని ఆఖరి సీన్ మంచి ట్విస్ట్ ను అందించింది. ఆ సీన్ లో విద్య నటన కూడా నాకు బాగా నచ్చింది. కాకపోతే నెల క్రితం ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే నేను ఈ సినిమా క్లైమాక్స్ ఊహించాను. నేను ఊహించిన రెండు గెస్ లూ నిజమయ్యాయి.


సబ్ ఇన్స్పెక్టర్ రాణా/సాత్యకి పాత్రలో బెంగాలీ నటుడు Parambrata Chattopadhyay చాలా బాగా ఇమిడిపోయాడు. విద్యా బాగ్చీ పాత్ర తరువాత నాకు బాగా నచ్చేసిన పాత్ర ఇది. సాత్యకి పేరుని ఈ పాత్రకు పెట్టడం సింబాలిక్ గా బాగుంది. ఇతను విద్యాబాలన్ కెరీర్ మొదట్లో ఆమెతో కలిసి ఒకటి రెండు సినిమాలు వేసాడుట. క్లర్క్ + కాంట్రాక్ట్ కిల్లర్ గా చూపెట్టిన మనిషి ఫన్నీగా, ఇలా కూడా ఉంటారన్న మాట అనిపించేలా ఉన్నాడు. విశాల్-శేఖర్ అందించిన నేపధ్యసంగీతం ఆకట్టుకుంది. చివర్లో నాకు చాలా ఇష్టమైన రవీంద్రుడి గీతం "ఏక్లా చలో" వినిపించటం చాలా బావుంది. అది అమితాబ్ పాడినట్లున్నాడు.


కలకత్తా నగరాన్ని సినిమా నేపథ్యంగా చేసుకోవటం బాగుంది. పురాతన నగరం, పండుగ వతావరణం, దుర్గ పూజ ఇవన్నీ చూపించిన విధానం సినిమాలోని సస్పెన్స్ వాతావరణానికి సమంగా సరిపోయాయి. ఈ సినిమా భవిష్యత్తులో మరిన్ని సస్పెన్స్ సినిమాలకు దారి చూపెడుతుందేమో అనిపించింది.