ఐదేళ్ళ వచ్చేదాకా మా అమ్మాయిని టివీ జోలికి వెళ్లకుండా కాపాడుకున్నా. రెండేళ్ల క్రితం మాత్రం మా తమ్ముడి పెళ్ళికి వచ్చిన బంధువుల పిల్లలు దానికి "పోగో టివి, కార్టూన్ నెట్వర్క్ " చూపెట్టారు. అప్పటి నుంచీ మొదలైంది పోగో టివి మా ఇంట్లో కూడా. కాకపోతే అదృష్టవశాత్తు మా అమ్మాయికి నచ్చినవి రెండే రెండు కార్టూన్ సిరీస్ లు. వేరే ఏమీ చూడదు. కృష్ణ, ఛోటా భీమ్. మాఇంట్లో రోజూ "ఛోటా భీమ్ " జపమే. కొత్తవైనా, వేసినవే వేసినవే వేసినా, ఎలాగున్నా సరే "ఛోటా భీమ్" సీరియల్ చూడాల్సిందే. టివీలోనే కాక ఈ "భీమ్" కి ఒక అఫీషియల్ వెబ్బ్సైట్ కూడా. అందులో గేమ్స్ , వీడియోలూ గట్రా ! ఇవాళ "ఛోటా భీమ్" తెలియని స్కూల్ పిల్లలు... ఆ భీమ్ పుస్తకాలూ, వీడియోలు కొనిపెట్టమని అమ్మానాన్నల్ని విసిగించని పిల్లలూ ఉండరంటే నమ్మకతప్పదు మరి..:) అంతగా మాయ చేసేసాడు ఛోటా భీమ్ !!
పోగో వెబ్సైట్లోని వివరాల్లోకి వెళ్తే, రెండువేల సంవత్సరాల క్రితం "ఢోలక్ పూర్" అనే పల్లెటూళ్ళో జరిగిన తొమ్మిదేళ్ల "భీమ్" అనే శక్తివంతుడైన కుర్రాడి కథ ఈ సీరియల్ అని చెప్తాడు. చుట్కీ, రాజూ, జగ్గు అనే కోతి, ఆ ఊరి రాజుగారి కూతురు ఇందుమతి వీళ్లంతా భీమ్ కి స్నేహితులు. ఆ ఊరిలోవారికి గానీ, ఎవరికైనా గానీ ఆపద వస్తే భీమ్ తక్షణం సహాయపడతాడు. భీమ్ విప్పలేని చిక్కుముడి ఉండదు, తప్పించుకోలేని ఆపద ఉండదు, ఓడించలేని శత్రువు ఉండడు. భీమ్ తినని లడ్డూ కూడా ఉండదు. అతనికి అత్యంత ఇష్టమైన లడ్డూ తినగానే అమితమైన శక్తి వచ్చేసి శత్రువుని చితగ్గొట్టేస్తుంటాడు భీమ్. అబ్బా..అలా తినగానే వెంఠనే బలం వచ్చేసే మందేదైనా ఉండకూడదు అన్ని పనులు చకచకలా చేసేసుకోవటానికీ అనుకుంటూ ఉంటాను నేను. తెలివి, చమత్కారం, బుధ్ధిబలం, కండబలం అన్నీ నిండుగా ఉన్న ఈ తొమ్మిదేళ్ళ కుర్రాడిని ప్రేమించకుండా నేను కూడా ఉండలేను !
ఇంతేకాక "కృష్ణ" సీరియల్లోంచి బుల్లి కృష్ణుడిని తీసుకువచ్చి, ఛోటా భీమ్ కి మిత్రుడిని చేసేసారు. ఇక ఇద్దరు కలిసి మరిన్ని విజయాలను చూస్తుంటారు. ముద్దొచ్చే బుల్లి కృష్ణుడిని, భీమ్ నీ ఒకే చోట చూడటం కూడా నయనానందమే. ఈ చోటా భీమ్ కి వాయిస్ ఇచ్చే కుర్రాడు ఎవరో గాని నాకు భలే నచ్చేస్తుంది ఆ గొంతు. స్వచ్చమైన మంచి హిందీ పలుకుతాడు అతను. కొన్ని సీరియల్స్ లో మరో వాయిస్ కూడా వాడుతుంటారు. ఇది కొద్దిగా వయసు పెద్ద ఉన్న కుర్రాడి వాయిస్. ఇతని కన్నా రెగులర్ గా డబ్బింగ్ చెప్పే వాయిస్ నాకు బాగా ఇష్టం. ఈ సీరియల్ డైరెక్టర్ కూడా తెలుగువాడేనేమో..."రాజీవ్ చిలకలపూడి" అని వస్తుంది టైటిల్స్ లో. ఒకోసారి "రాజీవ్ చిలకా" అనీ వస్తుంది. "భీమ్ భీమ్ భీమ్..చోటా భీమ్..చోటా భీమ్" అని వచ్చే టైటిల్ సాంగ్ కూడా నాకు భలే ఇష్టం.
ఈ యేనిమేషన్ విషయంలో నాకు ఒక చిన్న అసంతృప్తి.. ఎన్నో ఏళ్ల క్రితం పల్లెటూరు, ఓ రాజుగారూ అని చూపిస్తూ అందులో మళ్ళీ ఇంగ్లీషు ఎందుకు వాడతారో అర్ధం కాదు. క్రికెట్ అనీ, కాంపటీషన్ అనీ చాలా పదాలు వాడుతుంటారు. బహుశా పిల్లలు కథలతో బాగా కో-రిలేట్ అవ్వటానికే అయినా ఇంగ్లీషు వాడకుండా ఉంటే బాగుండేది కదా అనుకుంటూ ఉంటాను. కానీ ఏవో విదేశీ సీరియల్స్ డబ్బింగ్ చేసేసి చూపెట్టేయకుండా యావత్ దేశంలో పిల్లలూ ఇష్టపడే విధంగా ఒక గుర్తుండిపోయే పాత్రను సృష్టించిన వారు నిజంగా ప్రశంసాపాత్రులు. చోటా భీమ్ చూసే మా అమ్మాయి హిందీ నేర్చుకుంది అంటే అతిశయోక్తి కాదు. అంత మంచి శుధ్ధమైన హిందీ వాడతారు ఆ సీరియల్లో. నాతోనూ, వాళ్ల నాన్నతో కూడా హిందీలో మాట్లాడేంత భాష దానికి ఛోటా భీమ్ నేర్పినదే. అంతే కాదు.. గులాబ్ జామ్ తప్ప మరో స్వీట్ ఏదీ తినని మా అమ్మాయి భీమ్ ను చూసి " భీమ్ లడ్డూ" కావాలని అడిగి తెప్పించుకుని మరీ తింటోందంటే భీమ్ మాయే కదా మరి !!