సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, February 20, 2012

కీసరగుట్ట


కీసరగుట్ట గుడి గోపురం

బయట నుంచి గుడి
 మొన్న కార్తీక మాసంలో ఓ రోజు " కీసరగుట్ట " వెళ్లాం. హైదరబాద్ సిటీకి సుమారు ముఫ్ఫై,నలభై కిలోమీటర్లు దూరంలో ఉంది కీసరగుట్ట. బస్సుల ఫ్రీక్వెన్సీ కూడా బాగానే ఉంటుంది. పొద్దుటే బయల్దేరి సాయంత్రానికి తిరిగి వచ్చేయచ్చు. మేము వెళ్లినప్పుడు జనం ఉన్నా, టికెట్ రేట్లను బట్టి నాలుగైదు క్యూ ల విభజన ఉండటం వల్ల దర్శనం తొందరగా జరిగింది మాకు. కొత్తరంగులతో అందంగా ఉంది గుడి. ఈమధ్యనే బాగుచేయించారుట. గుడిలో రాముడిచే ప్రతిష్ఠించబడిన "రామలింగేశ్వరస్వామి" దర్శనం చేసుకున్నాం. కార్తీకమాసం కావటంతో అందరూ ఒక చోట దీపాలుపెడుతుంటే, నాతో పట్టుకెళ్ళిన ఆవునెయ్యి,ప్రమిదలతో నేను కూడా దీపాలు వెలిగించాను. గుడి చుట్టూఆ చూస్తూంటే కొండ అంతా అక్కడక్కడ నేలలో పాతుకుపోయినట్లు, చెల్లాచెదురుగా కనబడ్డ బోలెడు శివలింగాలు ఆశ్చర్యం కలిగించాయి. అవేమిటని అడిగితే కీసరగుట్ట గుడికి సంబంధించిన ఓ చిన్న కథ చెప్పారు అక్కడివాళ్ళు ...

గర్భగుడిలోకి వెళ్ళే దారి

ఆ కొండపై శివలింగాన్ని ప్రతిష్ఠించదలచిన శ్రీరాముడు హనుమంతుడిని కాశీ నుంచి శివలింగాలను తెమ్మని పంపాడుట. సమయం మించిపోతున్నా హనుమంతుడు రానందువల్ల శ్రీరాముడు కోసమని శివుడే స్వయంగా ఒక శివలింగాన్ని ఇస్తే, రాముడు ఆ శివలింగాన్ని సరైన ముహుర్తానికి ప్రతిష్ఠించాడుట. ఆ తర్వాత శివలింగాలతో వచ్చిన హనుమంతుడు, తాను తెచ్చిన శివలింగాలు ఉపయోగపడలేదనే కోపంతో వాటిని తన తోకతో విసిరివేసాడుట. అవి కొండంతా చెల్లాచెదురుగా పడి అలా ఉండిపోయాయిట. అయితే రాముడు హనుమంతుడి కోపం చల్లార్చటానికి గుడి ముందర హనుమంతుడికి కూడా పుజలు జరిగేలా విగ్రహన్ని ఏర్పాటు చేసి, ఆ కొండకు "కేసరిగుట్ట" అని హనుమంతుడి పేరుని పెట్టాడుట. ఆ కేసరిగుట్ట పేరు రాను రాను కీసరగుట్ట అయ్యిందట.

గుడిబయట ఉన్న పేద్ద ఆంజనేయ విగ్రహం

ఆంజనేయ విగ్రహం

చుట్టుపక్కల ఉన్న శివలింగాల్లో పెద్దది..

హనుమవిగ్రహం వద్ద ఉన్న శివలింగం

చెల్లాచెదురుగా అక్కడక్కడా కనబడ్డ శివలింగాలు


గుడి చూసి క్రిందకు రాగానే మాకు కార్తీకమాస వనభోజనాలు సందడితో కిటకిటలాడిపోతున్న పార్క్ కనబడింది. మేము లోపలికి వెళ్ళి  ఓ చోట కూచుని పైన కొండపై కొన్న పులిహోర,లడ్డూ ప్రసాదాలు తినేసి మేమూ వనభోజనాలు కానిచ్చేసాం అని తృప్తిపడ్డాం. పెద్ద పెద్ద పొయ్యిలు కూడా పెట్టుకుని వంటలు కూడా వండుకుంటున్న కొన్ని గుంపులను చూస్తే చిన్నప్పుడెప్పుడో ఓసారి చాలామందితో కలిసివెళ్ళిన వనభోజనాలు గుర్తుకు వచ్చాయి. మా పాప కూడా కాసేపు పార్కులో ఆడుకున్నాకా తిరిగి ప్రయాణమయ్యాము.

పార్క్ లో దర్శనమిచ్చిన శివపార్వతుల కుటుంబం

వారి ఎదురుగా నందీశ్వరుడు

పార్క్ లో సందడి

అయితే గుడి బయట భోజనానికి సరైన హోటల్ గానీ తిఫిన్ తినటానికి చిన్నపాటి టిఫినసెంటర్ గానీ లేవు. అందువల్ల మనతో పాటుగా ఏవైనా తినిబండారాలు పట్టుకెళ్లటమే మార్గం. పర్వదినాల్లోనూ, పండుగల్లోనూ కాకుండా ఏ ఆదివారమో సరదాగా, ప్రశాంతంగా గడిపిరావటానికి అనువైన ప్రదేశం ఇది.