సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, February 10, 2012

Timepass movie !


ఏళ్ల తరువాత.. First day First show చూసా!! సాధారణంగా ఏ ప్రత్యేకతా లేనిదే సినిమాలకు వెళ్ళను నేను. అంటే...అవార్డ్ మూవీ అనో..మంచి డైరెక్టర్ అనో, హీరోహీరోయిన్ల కోసమో, పాటలు నచ్చాయనో...అన్నమాట. అలా కొన్ని మంచిసినిమాల కోసం ఎదురుచూసీ కూడా చూడటం కుదరని రోజులున్నాయి. అయితే ఒకోసారి కేవలం ఉల్లాసం కోసం, బిజీ రొటీన్ నుంచి బ్రేక్ కోసం ఏదన్న సినిమా చూడాలనిపిస్తుంది. అలా ఏ ఎదురుచూపూ లేకున్నా ఏదన్నా చూడాలి అనుకుంటూంటే ఇవాళ రిలీజయిన "Ek Main Aur Ekk Tu" సినిమా కనబడింది. మొత్తానికి చూసేసా ! ఇందులో నటీనటులు,దర్శకుడు ఎవరి పట్లా నాకు ఆసక్తి లేదు. గొప్ప సినిమా కాకపోయినా నా మూడ్ ని రిఫ్రెష్ చేసిందీ సినిమా. aimless timepass movie అన్నమాట.


ఏడుపులు,పెడబొబ్బలు, ఢిషుం ఢిషుంలూ, కక్షలు, ప్రతీకారాలూ లేకుండా సాదా సీదాగా రెండుగంటల కాలం కులాసాగా గడిచిపోయేలా చేసిందీ సినిమా. కథ గురించి పెద్దగా చెప్పేందుకు ఏమీ లేదు. మన తెలుగు "బొమ్మరిల్లు" సినీకథను కాస్త అటు ఇటు చేసారు. స్నేహం-ప్రేమ, స్నేహితులు ప్రేమికులు కాలేరు, ప్రేమికులు-స్నేహితులు ఒకటి కాదు అంటూ ప్రేక్షకులకు ప్రైవేటు చెప్పే సినిమాల నుంచి కూడా కాస్తంత కాన్సెప్ట్ తీసుకుని ఒక కిచిడీ కథను తయారు చేసారు. చివరికి ఏదో ఒక స్టేట్మెంట్ పై ఖరారుగా నిలబడి ఉంటే, కనీసం 'దర్శకుడు చెప్పదలుచుకున్న విషయం ఇది' అని క్లారిటీ ఉండేది. కథలో బలం లేకపోవటం వల్ల ఉన్న సన్నివేశాలనే సాగదీసి, చివరికి ఎటూ కాకుండా కథను గాలికి వదిలేసారు. దర్శకుడు చెప్పదలుచుకున్న సందేశం ఏమీ లేదు. కథాబలం ఉండుంటే తప్పకుండా గుర్తుంచుకోదగ్గ సినిమా అయిఉండేది. కొన్ని సన్నివేశాలు మాత్రం మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.


రత్నా పాఠక్ షా(Naseeruddin Shah భార్య) లాంటి అనుభవజ్ఞురాలైన నటి ఇలాంటి చోద్యమైన పాత్ర వేసిందేమిటి అనిపించింది. ఈ పాత్ర కన్నా ఇంకా 'Jaane Tu Ya Jaane Na' సినిమాలో తల్లి పాత్ర సరదాగా బావుంది . డబ్బు పెట్టి చూసే ప్రేక్షకులకే తప్ప డబ్బు తీసుకుని నటించే నటులకు ఇలాంటి పట్టింపులు ఉండవేమో మరి ! కరీనా కపూర్ మొహం నాకు అస్సలు నచ్చకపోయినా ఆమె అభినయంలో వంక ఎప్పుడూ ఉండదు. ఇమ్రాన్ కూడా బాగా చేసాడు కానీ బలంలేని కథనంతో వీరిద్దరి నటనా వృధా అయినట్లు అనిపించింది నాకు. కరీనా ఇమ్రాన్ కన్నా పెద్దగా కనబడింది అనకుండా ఉండటానికీ ఆమె వయసులో కాస్త పెద్ద అని ఓ డైలాగ్ చెప్పించేసారు.


టైటిల్స్ లో వచ్చిన పాట బావుంది కానీ అది ఆడియోల్లో ఎక్కడా కనబడలేదు. బాలీవుడ్ లో కొత్తతరం గీతరచయితలూ, సంగీత దర్శకులు బలమైన స్థానాన్నే సంపాదించుకుంటున్నరనటానికి ఈ ఆడియో సక్సెస్సే సమధానం. 'అగ్నిపథ్' లో పాటలకు సాహిత్యాన్ని అందించిన "అమితాబ్ భట్టాచార్య" ఆ చిత్రానికి కూడా విలువైన సాహిత్యాన్ని అందించారు. అతని సాహిత్యానికి నేను అభిమానిని అయిపోయానేమో కూడా. "దేవ్ డి" తో జాతీయపురస్కారాన్ని అందుకున్న "అమిత్ త్రివేది" కూడా నిరుత్సాహపరచలేదు. "ఆహటే.." పాట మాత్రం నాకు విన్నప్పుడే బాగా నచ్చింది. కార్తీక్ చాలా బాగా పాడాడు కానీ శిల్పా రావు వాయిస్ మాత్రం పాటకు నప్పలేదు. వేరెవరితోనయినా పాడిస్తే బావుండేది.




రెండుగంటలు సమయం ఉండీ, లేక ఏమీ తోచక టైం పాస్ చెయ్యాలనిపిస్తే ఈ సినిమా చూడచ్చు.