తమిళ సాహిత్యాభివృధ్ధికి తమ వంతు కృషికి గానూ ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్ పురస్కారాలను అందుకున్న ఇద్దరు తమిళ రచయితలు అఖిలన్ గారూ, జయకాంతన్ గారూ. అఖిలన్ గారి గురించీ, ఆయన రాసిన "చిత్తిరప్పావై"(చిత్రసుందరి) , "స్నేహితి"(మనస్విని) నవలానువాదాల గురించీ గతంలో రెండు టపాలు రాసాను. ఆయన లానే ఎన్నో నవలలు, కథలూ రాసి మరిన్ని పురస్కార సత్కారాలను పొందిన మరో ప్రముఖ తమిళ రచయిత శ్రీ డి.జయకాంతన్ గారు. వారి నవల "Sila nerangalil Sila manithargal" 1972లో సాహిత్య అకాడమీ అవార్డ్ ను అందుకుంది. ఈ నవలను ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ గారు "కొన్ని సమయాలలో కొందరు మనుషులు" పేరున తెలుగులోకి అనువదించారు. ఇది నేషనల్ బుక్ ట్రస్ట్ వారి ముద్రణ.
ఈ నవల ఆధారంగా తీసిన తమిళ సినిమా పేరు కూడా "Sila nerangalil Sila manithargal" యే. చిత్రానికి సంభాషణలు కూడా జయకాంతన్ గారే రాసినట్లున్నారు. నటి లక్ష్మికి ఈ సినిమా జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఆవిడ కెరీర్ లోని ఉత్తమ పాత్రల్లో ఈ చిత్రంలోని పాత్ర ఒకటి అనటం అతిశయోక్తి కాదు. అంత అద్భుతమైన నటన కనబరిచింది ఆమె ఈ చిత్రంలో. ఎమ్మెస్ విశ్వనాథన్ అందించిన సంగీతం కూడా మన్ననలు పొందింది. మనిషిలోని సున్నితమైన భావాలను తట్టి లేపి, మృగం లాంటి మనిషిలో కూడా పరివర్తన తేగల అద్భుతశక్తి, ఉత్తమ సంస్కారవంతమైన గుణాన్ని కూడా అధోగతి పాలు చేసే దుష్టశక్తి...రెండూ ప్రేమకు ఉన్నాయని ఈ నవల కథనం తెలుపుతుంది.
డభ్భైల కాలంలో సమాజపు కట్టుబాట్లకు ఎదురుతిరిగే బలమైన స్త్రీ పాత్రను సృష్టించటం సులువైన విషయమేమీ కాదు. అటువంటి పాత్రనే కాక, మనుషుల చిత్తప్రవృత్తులు సందర్భానుసారంగా ఎలా మారిపోతాయో తెలిపే కథ ఇది. టైటిల్ జస్టిఫికేషన్ ఇక్కడ జరిగిపోతుంది. నవలలో ముఖ్యంగా నన్ను ఆకట్టుకున్నది పాత్రల మానసిక విశ్లేషణ. ఏ పాత్రనూ తక్కువ చేయకుండా, కథానాయిక పాత్ర ఎక్కువ భాగ మున్నా సరే, మిగిలిన పాత్రలను తక్కువ చేయకుండా వారి వారి కోణాల్లోంచి వారిని సమర్ధించుకుంటూ చేసిన జయచంద్రన్ గారి రచనాశైలి నిజంగా మెచ్చదగ్గది. మాలతీ చందూర్ గారి అనువాదం కూడా అందుకు అనుకూలంగా చక్కగా కుదిరింది.
కథ లోని వస్తే, కథానాయిక గంగ కాలేజీ విద్యార్ధినిగా ఉన్నప్పుడు ఒకానొక వర్షాకాలపు సాయంత్రం.. తన కారులోలిఫ్ట్ ఇచ్చిన ఒక విలాసవంతుడి చేతిలో శీలాన్ని కోల్పోతుంది. అన్నగారితో గెంటివేయబడిన గంగను మేనమామ తీసుకువెళ్ళి చదివించి, ఉద్యోగస్థురాలయ్యేదాకా సహాయపడతాడు. తన కాళ్ళపై తాను నిలబడి, ఉత్తమ వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్న గంగకు తల్లి తోడుగా నిలుస్తుంది . కొన్ని విచిత్ర పరిస్థితుల్లో గంగ తన పతనానికి కారణమైన వ్యక్తిని వెతికి, అతనిని కలుస్తుంది. అనుకోని విధంగా వారిద్దరి మధ్యనా ప్రగాఢానురాగం చిగురిస్తుంది. పాఠకులను వారిద్దరి నిష్కల్మషమైన అనురాగానికి ఆర్తులను చేయటం రచయిత గొప్పదనం. అయితే ఆ అనుకోని పరిచయం వారిద్దరి జీవితాలనూ ఏ దరికి చేర్చింది అన్నది మిగిలిన కథ.
మూడొంతులు కథ అయ్యాకా నవల మరింత ఆసక్తికరంగా మారుతుంది. కానీ ముగింపు మాత్రం నాకు వేదనను మిగిల్చింది. కొన్ని కథలు ఇంతే అనుకోవాలో...మరి ఈ నవల పేరును సార్థకం చేసుకోవటం మాత్రమే కథలోని అంతరార్థమో తెలీలేదు. ప్రతి కథకూ సుఖాంతమే ఉండాలని నియమమేమీ లేదు కానీ గంగ జీవితవిధానాన్ని దిగజార్చేయటమెందుకో బోధపడలేదు. అయినా సరే పుస్తకం మూసిన తరువాత రచయితపై కోపం రాదు. కథలోని పాత్రల స్వభావాలను, అంతరంగాలనూ సవిస్తరంగా ఆయన చిత్రించిన విధానం గుర్తుండిపోతుంది.