క్రితంవారం చేసిన పొరపాటు ఈవారం చెయ్యలేదు. దీని బదులు మరోటి చూసి బుక్కయిపోయాం. ఈసారి ఈ సినిమా చూసినవాళ్ళను అడిగి అడిగి వెళ్ళాం సినిమాకి. ట్రాఫిక్‌లో చిక్కుకు లేటయ్యేసరికీ షో మొదలైపోతుందని కంగారు నాకు. పేరు పడకముందు నుంచీ తెర పడేదాకా చూడకపోతే అసలు సినిమా చూసినట్లే ఉండదు. సరే గుమ్మంలోకి అడుగుపెట్టేసరికీ సిన్మా పేరు పడేసరికీ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా.
డైరెక్టరే సినిమాటోగ్రాఫర్ అయితే ఇంక చెప్పేదేముంది..కళ్ళకు పండగే. కాబట్టి ఈ సినిమా ముందుగా కళ్ళకు పండుగ. సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన సినిమాల్లో హిందీలో తీసిన "అశోకా" తప్ప మరేమో చూడలేదు నేను. అప్పట్లో ఆ సినిమా కూడా బాగా నచ్చింది నాకు.షారుఖ్,కరీనా ఇద్దరూ చాలా బాగా చేసారు. ఆ సిన్మా పాటలయితే ఇప్పటికీ వింటూంటా. అంతిష్టం. "ఉరుమి" సినిమా చూస్తూంటే ఇది స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ కానందుకు బెంగ వేసింది. డబ్బింగ్ అయినా మరీ అలా అనిపించనందుకు ఆనందం వేసింది. ముఖ్య పాత్రధారుల నటన ముచ్చట గొలిపింది. మరీ ముఖ్యంగా హీరో పాత్రధారి పృధ్వీరాజ్ పై అభిమానం కొండంత పెరిగిపోయింది. "శివపురం" సిన్మాలో వేసినతననుకుంటాను. మరెక్కడా చూసిన గుర్తు లేదు. అబ్బ..హీరో అంటే ఇలా ఉండాలి అనిపించింది. చాలాసార్లు అతని నటన మృగరాజు సింహాన్ని గుర్తుకుతెచ్చింది. జుట్టు వెనక్కు వెళ్ళేలా తల విదిల్చినప్పుడు రాజసం, నాయకుడుగా ఠీవీ, గంభీరమైన చూపులు ఆకట్టుకున్నాయి. ఇతన్ని హీరోగా పెట్టి చందమామ, బాలమిత్రల్లోని మంచి మంచి రాజుల కథలను సినిమాలు తీసేస్తే భలే ఉంటుంది అనిపించింది. ఈ సినిమా నిర్మాత అవతారమే కాక ఒక పాట పాడి గాయకుడి అవతారం కూడా ఎత్తాడితను.
అంతమంది పెద్ద పెద్ద నటీమణులను ఎందుకు పెట్టారో అని మాత్రం అనిపించింది. 'విద్యాబాలన్' కు రెండు మూడు సీన్స్ ఉన్నయి కానీ 'తబ్బు 'కు ఒక పాటలో మినహా పాత్రే లేదు. పైగా ఎప్పటి నిన్నే పెళ్ళాడాతాలోని తబ్బు..వయసు మీరిపోయింది..అనిపించింది. విద్యా కు పాట అనవసరం. సీరియస్ కథ నడుస్తూండగా ఎందుకు పెట్టారో తెలీలేదు. పైగా పాటలేమీ మళ్ళీ మళ్ళీ వినేలా లేనందువల్ల, డబ్బింగ్ అయినందువల్ల వినసొంపుగా లేవు. ఒక్క హీరో హీరోయిన్ల మధ్య పాట మాత్రం కాస్త బావుంది. మొదటిసారి జనీలియాను ఒక రీజనబుల్ రోల్ లో చూసాననిపించింది. కత్తి యుధ్ధాలు అవీ చాలా శ్రధ్ధగా చేసేసింది. 'నిత్యా మీనన్' ఓపినింగ్ సిన్ లో భయపడేలా కనబడింది కానీ తర్వాతి సినిమాలో బావుంది ముద్దుగా. ఈ అమ్మాయి ఏ మాత్రం లావయినా కెరీర్ దెబ్బతింటుంది. చిరక్కల్ రాజుగారి దగ్గర పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ కనబడ్డ జంటలో అమ్మాయి కూడా రంగు తక్కువైయినా బావుంది. వాన, వాతావరణం, పచ్చదనం అన్నీ కథకు అనుగుణంగా నప్పేసాయి. ఈ తరహా సినిమాకు ముఖ్యమైన సౌండ్ ఎఫెక్ట్స్, నేపథ్యసంగీతం చాలా బావున్నాయి.
ఈ సినిమాలో నచ్చనిదేదైనా ఉంటే అది ప్రభుదేవా. అందులోనూ 'నిత్య' పక్కన అస్సలు సరిపోలా. నటన బాగుంది కానీ ఆ పాత్రలో మరెవరైనా ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఇంకా యుధ్ధాలకోసం తీసుకొచ్చిన గుర్రాలకు పాపం దెబ్బలు తగులుతాయే అనిపించింది. మొత్తమ్మీద బాగుంది కానీ ఇంకా బాగుండొచ్చేమో అనిపించింది. హిస్టరీ స్టూడెంట్ ను కాబట్టి నాకు పౌరాణికాలు, చారిత్రాత్మకాలూ బాగా నచ్చేస్తాయి. అసలు నేను కూడా ఏ రాజులకాలంలోనో ఎప్పుడో పుట్టే ఉంటాను అనిపిస్తూంటుంది నాకు. సినిమా చూసి వస్తూంటే కూడా ఆ ఆడవి, గుర్రాలు కళ్ళ ముందే కదులుతూ ఉన్నాయి. ఒక మంచి ఫీల్ ఉంది సినిమాలో. తెలుగులో కూడా ఎవరైనా పూర్తి నిడివి చారిత్రాత్మక చిత్రాన్ని తీయకూడదా అని మరీ మరీ అనిపించింది. రొటీన్ కు భిన్నంగా చూడాలనుకునేవారికి బాగా నచ్చుతుంది ఈ సినిమా.