1999 తానా - స్వాతి నవలల పోటీలో లక్షరూపాయిల బహుమతి పొందిన సృజనాత్మక నవల "తపన". కాశీభట్ల వేణుగోపాల్ గారి రెండవ నవల. ఇప్పటిదాకా నేను ఇలాంటి పుస్తకం చదవలేదు. ముఖ్యంగా తెలుగులో. చాలా రోజుల తరువాత పనులు చేస్కుంటూ, బస్సులో వెళ్తూ, అన్నంతింటూ, కూచుని, పడుకుని...ఒక్కరోజులోనే చదవటం పూర్తి చేసాను. చివరికెలా ముగిస్తారో చూడాలని ఆసక్తి....రచయిత వాడిన రూపకాలంకారాలపై మక్కువ...రచనలోని ఓ మనసు ఆవిష్కరిస్తున్న స్వేచ్ఛపై విభ్రాంతి...రచనలోని నైరూప్య చిత్రణల పట్ల ఆశ్చర్యం...Stream of conciousness technique(చైతన్య స్రవంతి పధ్ధతి) ని వాడిన విధనం...మధ్య మధ్య surrealistic touch(కూడా ఉందనే అనిపించింది)...అన్నీ...అన్నీ నన్ను అలా చదివేలా చేసాయి. ఒక్కమాటలో చెప్పలంటే ఇలాటి ఒక ప్రయోగాత్మక నవల తెలుగులో వచ్చినట్లు నాకయితే తెలీదు.
ఈ పుస్తకం గురించి జయప్రభగారి మాటలు...(నవలలో ఒన్ని ఒన్ని ఒన్ని)
* ఈ నవల్లో సుఖాన్నీ...శాంతినీ చూపించే హామీలేం లేవు. మగతకి, మెలకువకీ మధ్య మనిషిలో కల్లోల కథనం తప్ప !!"
* " 'తపన' నన్ను చిరాకు పెట్టింది. భయపెట్టింది. బాధపెట్టింది. విభ్రమ పెట్టింది. నా మనసుని కలత పెట్టింది."
* "మంచి నవలను ఎంచి మరీ అందించిన డాక్టర్ జంపాలని ఎంతైనా అభినందించవలసిందే.తపన నవల చదివిన వెంఠనే అత్యుత్కంఠతతో 'నేనూ-చీకటి' చదివేదాకా మరి నేను ఆగలేకపోయాను."
ఈ పుస్తకం మధ్యలో ఆపి మళ్ళీ తెరిచేదాకా మనసు నిలవదు. ఆ అక్షరాల్లోని శక్తి, వాటిల్లో కనబడే abstract picture అలాంటిది. వేణుగోపాల్ గారి భాష కాస్త ఇబ్బందిపెట్టిందనే చెప్పాలి. తెలుగులో ఇంగ్లీషు చదవటం మహా చిరాకైన పని. ఒకోచోట చదువుతున్నది తెలుగే అయినా మళ్ళి మళ్ళీ రెండు మూడుసార్లు చదివితే కానీ అర్ధం కాలేదు. ఒకోసారి తెలుగు తెలుగే అయినా కూడా అర్ధం కాదన్నమాట..అనుకున్నా! రచయిత తెలిపే భావం లోని లోతు అటువంటిది. ఇక చాలామార్లు కనబడే నాన్వెజ్, మందు కబుర్లయితే చదవటానికి ఇబ్బంది కలిగించాయి. ఆ రెంటిపై నాకున్న ఏహ్యభావం అలాంటిది. కానీ అవన్నీ ఒక మనిషి తాలూకూ చీకటి కోణాలను, కనబడని మనిషి లోపలి మనిషి తాలూకూ అనావిష్కృత పార్శ్వాలను చూపెట్టడానికి రచయిత చేసిన ప్రయత్నాలు కావచ్చు అనిపించింది. ఇంత స్వేచ్ఛగా, అవలీలగా, సులువుగా మనిషిలోని వ్యతిరేక అంతర్భగాన్ని(negative part) ఆవిష్కరించటమనేది తేలికైన పనేమీ కాదు.
నవల వెనుకవైపు అచ్చైన నవల గురించిన "మో"(వెగుంట మోహనప్రసాద్ గారి) కవిత:
"యే జ్ఞాపకమూ శాంతినివ్వదు. ఎప్పటి ఆనందాలో అన్నీ గాయాలై చురుక్కుమంటాయి. వాడిపోయిన మల్లెపూల పరిమళాంలా గతం హింసిస్తుంది. నిన్నటి వెన్నెల ఈరోజు తాజగా లేదేమని పిచ్చి ప్రశ్న మొలుస్తుంది. బొమ్మజెముడులాగ...!"
"శరోరంలో జరిగే రసాయన చర్యలకు ప్రతిచర్యలుగా మన జీవితం గడిచిపోతూంటుంది. ఈ భౌతిక రసాయన జీవితానికి అతీతంగా తీఅని దాహంతో నాలుక చాపుకుని ఓ నిస్పృహ ఎప్పుడూ తచ్చాడుతూ ఉంటుంది....ఆలోచన ఉన్న ప్రతి మనిషి వెనుక ఈ నిస్పృహ తప్పదని నా నమ్మకం..."
"ఓ మనిషి 'సంస్కారవంతుడూ' అంటే తనలో మొలిచిన ప్రతిభ్రష్ఠ ఆలోచనలన్నీ ఆచరణలో పెట్టనివాడు అని మాత్రమే. అంతేకాని వాడిలో భ్రష్ఠ ఆలోచనలు పుట్టవు అన్న గ్యారంటీ లేదు..."
"కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాకే పరిచయం లేని నా ప్రపంచపు అద్భుత నగరాల వీధుల్లో వసంతాలాడే, పువ్వులు చల్లే...పన్నీరు చిలికే...అపరిచిత ముఖ సహస్రాల్లో...ఎవర్దో తెలీని ఓ చిగురు దరహాసం మొలిచిన చైత్రముఖాన్ని వెదుకుతూ ఆ కేరింతల మధ్య ఆ అరుపుల్లో, అల్లర్లలో నా చెవికి మాత్రం వినిపించే నిట్టూర్పు కోసం...ఓ గాలి పిలుపు కోసం వెంపర్లాడుతున్న నేను.....తపిస్తూ నేను....."
"ఎందుకీ అసహనం? ఎన్ని అనుభవాల నాలుకల్తో నాకినా ఈ జీవితం రుచి తెలీటం లేదెందుకని? అదేనేమో...బహుశా నా తపనంతా !"
"మనిషి..మనిషికీ మధ్య గోడ ఎండుకు మొలుస్తుందో తెలీదు. లేచిన గోడెందుకు పడిపోతుందో తెలియదు. మనిషి నుంచి మనిషి ఎందుకు దాక్కుంటాడో తెలియదు..."
"జీవితం అన్ని పార్శ్వాల్లోనూ ఆనందాన్నే వెతకడమంత అవివేకం మరోటుండదేమో ! నిజం నిజం! ప్రతి ముఖమూ ప్రమోదమైతే, జీవితం అసలు ముఖాన్ని కోల్పోయి..డ్రామా కంపెనిల డప్పైపోతుంది....నేడే చూడండి నేడే చూడండనే బాకాల్తో...ప్రతిరోజూ ఆడే సరికొత్త డొక్కు నాటకం..."
"స్మృతి లోంచీ విస్మృతిలోకీ విస్మృతిలోంచీ చేతనలోకీ చేతనలోంచీ యాంత్రిక దుర్భరత్వంలోకీ దొళ్ళి దొళ్ళి మళ్ళీ ధనాలున పడిపోయా."
ఇలా రాసుకుపోతే ఎన్నున్నాయో...! అద్భుత రూపకాలంకారాలు....అస్పష్ట నైరూప్య చిత్రాలు...సృజనాత్మక భాషా ప్రయోగాలు...ఎన్నో చదవరులను అబ్బురపరుస్తాయి. తికమకపెడతాయి. కలవరపరుస్తాయి. చదివాకా చాలా సేపు ఆలోచింపజేస్తాయి. ముందుమాటలోని జంపాల చౌదరి గారి మాటల్లో "చాలా కాలంగా స్తబ్ధంగా ఉన్న తెలుగు నవలా కాసారంలో ఉన్నట్లుండి విరుచుకుపడుతున్న ఉత్తుంగతరంగాలు ఇతని నవలలు. ఈ చైతన్యం మిగతా రచయితలను కూడా కదిలిస్తుందని ఆశించటంలో అనౌచిత్యం లేదు." నేనీ పుస్తకం చదివిన మర్నాడే పుస్తకం.నెట్లో కాశీభట్ల వేణుగోపాల్ గారి మొదటి నవల 'నేనూ-చీకటి' గురించి సౌమ్యగారి పరిచయం కనబడటం నాకు విచిత్రంగా, సంతోషంగా అనిపించింది.