సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, May 26, 2011

నూరుపాళ్ళ నాన్సెన్స్ !


డిగ్రీలో ఉండగా ఓ శెలవురోజున ఓ ఫ్రెండ్ తో సినిమాకు వెళ్ళివచ్చాకా, సినిమా పేరు అడిగారు నాన్న. విని నా వైపు అదో మాదిరిగా చూశారు. ఎందుకెళ్ళావు ఆ సినిమాకి? అనడిగారు. "కొత్త సినిమా కదా వెళ్దాం అంది తను.. అందుకని" అని నసిగా. "ఏదన్నా సినిమ చూస్తే అందులో ఏదో ఒక స్పెషాలిటి ఉండాలి. మంచి దర్శకుడో, మంచి కథ అనో, కామిడీ బావుందనో, మంచి విజువల్స్ ఉన్నాయనో, ఇష్టమైన హీరో లేక హీరోయిన్ ఉన్నారనో కూడా చూడచ్చు, కానీ ఏదో ఒకటి కొత్త సినిమా కదా అని అడ్డమైన సినిమాకీ వెళ్పోకూడదు.." అని క్లాసు ఇచ్చారు. ఆ తర్వాతఎప్పుడూ నాన్నకి అలా క్లాసిచ్చే అవకాశం నేను ఇవ్వలే.

కానీ నాల్రోజుల క్రితం చూసిన ఓ కొత్త సినిమా నాన్న మాటల్ని గుర్తు చేసింది. చూసిన నాల్రోజులకి కాస్తంత తేరుకుని ఇలా ఓ నాల్గు లైన్లు రాయగల్గుతున్నా !!

కొన్ని నూరుపాళ్ళ ప్రేమ సూత్రాలు:
* శనివారం (అదికూడా పన్నేండు గంటలు కొట్టేవరకే) మినహా ముప్పొద్దులా ఆబగా చికెన్ తినటమే ఓ అమ్మాయి జీవిత ధ్యేయంట.

* ఏ చెడు అలవాటు లేదు కాబట్టి ఫస్ట్ ర్యాంక్ వస్తోందని అంతా అనుకుంటారని సిగరెట్టు కాల్చాలిట !

* ఏం చెయ్యాలో తెలీని అయోమయంలో ఉంటే అబ్బాయిలు బార్లో మందు తాగటమే సరయిన మందట !

* బాగా చదివేవాడి కాన్సన్ట్రేషన్ చెడగొట్టాలి అంటే ప్రేమ నాటకం ఆడాలిట.

* వయసొచ్చిన ఆడపిల్ల వరసైన వారితో ఎన్ని గెంతులేసినా చిన్నపిల్లలు కదా అని వదిలేయాలిట.

* సదరు చిన్నపిల్లలైన వయసొచ్చిన ఆడపిల్లలు అస్తవ్యస్తంగా ఇంటి హాల్లో నిద్రోతారుట.

* ముట్టుకుంటేనే ఏదో అయిపోవటమంటేనే అసలైన,నిజమైన ప్రేమట !

* ఇరవైఏళ్ళపిల్లలకు అర్ధం కాని విషయాలు పదేళ్ళు దాటని చిన్న పిల్లలకు అర్ధమైపోతాయిట.

* కాసిని రోజులు తిండి,నిద్ర మానేసి కష్టపడిపోతే (సినిమాలో మాత్రమే) సక్సెస్ వరించేస్తుందిట.

* అర్నెలల్లో మనిషిని గుర్తు పట్టడమే కష్టమైపోతుంటే, ఏళ్ళు గడిచినా మనుషుల రూపాల్లో (ఆహార్యాల్లో) మార్పు ఉండదుట.


ఈ సినిమ చూడటమే ఒక బుధ్ధిలేని పని.
టపా రాయటం మరో వ్యర్ధమైన పని.
ఇంతకన్నా ఎక్కువ రాయటం అనవసరమైన పని .
మీరిది చదవటం ఉపయోగం లేని పని.


నాల్రోజుల క్రితం 100 % నాన్సెన్స్ అనే సినిమా చూసి మూర్ఛబోయి...వెంఠనే నెక్స్ట్ షో కి పక్క హాల్లోని 'మిస్ పర్ఫెక్ట్ ' సినిమా రెండోసారి చూసి సేదతీరాం !!