సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Wednesday, May 25, 2011
Socha na tha(2005)
నాలుగైదేళ్ళ క్రితం ఒక లోకల్ టివీ చానల్ లో ఈ సినిమా చూసాను. నాకు చాలా నచ్చింది. ఈ మధ్యన ఒక షాప్ లో సిడీ దొరికింది. సినిమా పేరు " सॊचा ना था" అంటే "అనుకోలేదు" అని అర్ధం. సరైన టైటిల్, మంచి కథ, అంతకన్నా మించి పాత్రలను మలిచిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా డైరెక్టర్ 'ఇంతియాజ్ అలీ' . ఇది ఇతని మొదటి చిత్రం. ఎలా ఆడిందో తెలీదు కానీ దీని తర్వాత తీసిన "Jab we met" అఖండ విజయాన్ని, ఈ డైరెక్టర్ కి ఎంతో పేరునీ తెచ్చిపెట్టింది.
కథ లోకి వస్తే, వీరేన్(అభయ్ డియోల్) ఒక సంపన్న కుటుంబానికి చెందిన స్వతంత్ర్య భావాలు గల కుర్రాడు. అతనికి ఒక పెళ్లి సంబంధాన్ని చూస్తారు పెద్దలు. అదితి (ఆయేషా టాకియా)ని చూడటానికి వాళ్ళింటికి వెళ్ళిన వీరేన్ తనకు ఎరేంజ్డ్ మేరేజెస్ నచ్చవని, తానొకమ్మాయిని మూడేళ్ళుగా ప్రేమిస్తున్నానని అదితికి చెప్తాడు. మొదటి పరిచయంతోనే వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కుదురుతుంది. చిరకాల మిత్రుల్లా కబుర్లు చెప్పుకుంటున్నా వాళ్ళిద్దరినీ చూసి పెళ్ళి కుదిరిపోయినట్లే అని సంతోషిస్తుంది అదితి ఆంటి(రతీ అగ్నిహోత్రి). అదితి సలహా మేరకు ఇంటికి వెళ్ళాకా అమ్మాయి నచ్చలేదని చెప్తాడు వీరేన్. ఈ సంగతి ఆ రెండు కుటుంబాల మధ్యన జగడానికి దారి తీస్తుంది.
(నాకు చాలా ఇష్టమైన పెళ్ళి చూపుల సీన్. .)
వీరేన్ ప్రేమించిన అమ్మాయిని ఒప్పించటానికి అదితి అతనికి చాలా సాయం చేస్తుంది. వీరిద్దరినీ బయట చూసిన అదితి బంధువులు పెద్ద గొడవ చేస్తారు. దాంతో రెండు కుటుంబాల మధ్యన రాజుకున్న జగడం వైరంగా మారుతుంది. క్రిష్టియన్ అయిన వీరేన్ ప్రేమికురాలిని ఒప్పుకోవటానికి వీరేన్ తండ్రి(సురేష్ ఓబ్రాయ్) ఒప్పుకోడు. కుటుంబాన్ని, తండ్రి ని ఒప్పించటానికి వీరేన్ వదిన(అయేషా ఝుల్కా) సహాయాన్ని అడుగుతాడు. వీరేన్ కుటుంబం పెళ్ళికి ఒప్పుకుని పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టాలని నిర్నయించుకునే సమయానికి తాను అదితిని ప్రేమిస్తున్నానని అర్ధం అవుతుంది వీరేన్ కు. తన ప్రేమికురాలికి ఆ సంగతి చెప్పి పెళ్ళి చెడగొట్టుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు వీరేన్.
సమస్యలతో సతమతమౌతూ పారిపోవాలనే ఉద్దేశంతో అదితి దగ్గరకు వెళ్తాడు వీరేన్. తనకు పెంచి పెద్దచేసిన ఆంటీ, అంకుల్ ఋణం తీర్చుకోవాలనీ, వాళ్ళు చూసిన సంబంధాన్నే ఒప్పుకున్నాననీ, తనను మర్చిపొమ్మని చెప్తుంది అదితి. వీరేన్ ను అతని కుటుంబం ఆదుకుంటుందా? అదితి పెళ్ళి జరిగిపోతుందా? వాళ్ల ప్రేమకు ముగింపు ఏమిటి? అన్నది మిగిలిన కథ. మొదటి సినిమా అయినా అభయ్ డియోల్ కనబరిచిన నటన ఆకట్టుకుంటుంది. పాత్ర వ్యక్తిత్వంలోని అయోమయం , ఆ తర్వాత వచ్చిన పరిపక్వత బాగా చూపెట్టగలిగాడు అతను. నాకు బాగా నచ్చింది అతని పాత్ర. గ్లామర్ రోల్స్ కే పరిమితమనుకున్న ఆయేషా టాకియాను నటనకు ఆస్కారం ఉన్న పరిపక్వమైన పాత్రలో చూస్తాం మనం. ప్రతిభ ఉన్నా మళ్ళీ "డోర్" సినిమాలో తప్ప ఇటువంటి మంచి పాత్రలు మరేమీ రాకపోవటం అయేషా దురదృష్టం అనే చెప్పాలి.
ఈ సినిమాలో పాటలు హిట్ కాకపోయినా సందర్భోచితంగా బావుంటాయి. పాటల సాహిత్యం కూడా చాలా బావుటుంది. "కుచ్ న మిలే తో నా సహీ", "మేరా తుమ్హారా", "ఏ యారా రబ్" పాటలు నాకు ఇష్టం. నిశ్చితార్ధాలు అయ్యాకా ప్రేమ అనే అంశం మీద తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చేసాయి కాబట్టి కొత్తగా అనిపించకపోవచ్చు కానీ ఆరేళ్ల క్రితం తీసిన సినిమాగా చూస్తే ఇది కొత్త కథే. డ్రామా తో పాటూ హాస్యం కూడా సమపాళ్ళలో ఉన్న ఈ సినిమా సినీ ప్రేమికులెవరికైనా నచ్చేస్తుందని నా అభిప్రాయం.
అభయ్ డియోల్ కు ఇది మొదటి చిత్రం కాబట్టి అతని బంధువైన(మేనమామనుకుంటా) ధర్మేంద్ర ఈ చిత్ర నిర్మాత అయ్యారు. ఇదే కథను తెలుగులో కూడా తీసినట్లున్నారు. పేరు గుర్తులేదు కానీ ఓ రోజు ఏదో ఛానల్ లో చూసాను. కానీ హిందీ సినిమా చూసాకా తెలుగుది నచ్చలేదు. పెద్దగా ఆడినట్లు కూడా లేదా తెలుగు సినిమా.
Subscribe to:
Posts (Atom)