నిన్న పొద్దుటి ఊసు. ఆదివారం కదా వాకింగ్ కి బధ్ధకంగా బయల్దేరా. అంటే లేటుగా అన్నమాట. అన్ని Fms లోనూ భక్తిగీతాలు అయిపోయి సినిమా పాటలు మొదలైపోయాయి. ఇదీ బానే ఉందనుకుంటూ వింటూ నడుస్తున్నా. రోబోలోని ఓ హిట్ సాంగ్ మొదలైంది. ఈ పాట ఎలా హిట్టయ్యిందో జనాలే చెప్పాలి. చరణంలో ఏ వాక్యానికీ పొంతనలేదు. ఈ డబ్బింగ్ పాటలు పాడేవాళ్ళు చాలామటుకు తెలుగువాళ్ళు ఉండరు (తెలుగువారు కాకపోయినా తెలుగు వచ్చినవాళ్ళూ ఉంటారు). మరి తెలిసో తెలీకో ఇచ్చిన సాహిత్యాన్ని శ్రధ్ధగా పాడేస్తారు పాపం... వినే మన ఖర్మకి మనల్ని వదిలేసి.
ఇంతకీ ఇందాకటి రోబో పాటలో చిన్మయి అనుకుంటా "తేటగ ఉన్న దూటనయ్యో నన్ను నోటబెట్టెయ్ మొత్తం" అని పాడింది. ఓరి భగవంతుడా ఇదేం ఉపమానం తండ్రీ అనుకున్నా. పచ్చి దూట ఎవరన్నా కరకర నమిలి తినగలరా అసలు? తమిళంలో ఈ పాటలో ఈ వాక్యం ఇలానే ఉందో మరి ఏమన్నా మార్పులున్నాయో...లేక ఇది అనువాదకుల ప్రతిభో మరి తెలీదు. ఇలాంటి భయానక ఉపమానాలు తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ చేసిన పాటల్లోనే ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి.
వెంఠనే నాకు "బాయ్స్" సినిమాలో పాటలోని ఓ వాక్యం గుర్తుకొచ్చింది. సాధనా సర్గమ్ పాడుతుంది "కుళ్ళిపోయిన మామిడిలో జత పురుగులమౌదాం.." అంటూ. నిఘంగా ఆవిడకు ఆ వాక్యం అర్ధం తెలిస్తే ఆ పాట పాడేదా? అని డౌటొచ్చేది నాకు ఆ పాట ఎక్కడైన విన్నప్పుడల్లా.
ఎంత గాఢప్రేమికులైతే మాత్రం కుళ్ళిపోయిన పండులో పురుగులతో పొలికా? వాక్యాలకు పొంతన లేకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి చెత్త కంపారిజన్ లు ఎందుకు వాడతరో...తెలీదు.
'దేషం', 'ఆష', 'ఆకాషాలు' అని పాడుతూంటే చచ్చినట్లు వింటున్నాం. అవికాక ఇలాంటి
ఘోరమైన వాక్యాలు డబ్బింగ్ పాటల్లో కోకొల్లలుగా వస్తున్నా ఆదరించేస్తున్నాం. అయినా చేసేవారు చేస్తున్నారు, రాసేవాళ్ళు రాస్తున్నారు, వినే మనం వినేస్తున్నాం.
మీకూ గుర్తున్న ఇలాంటి చెత్త కొంపారిజన్లు ఏమన్నా ఉంటే తెలపండి...