సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, March 27, 2011

నచ్చిన రచయితలు: కోడూరి కౌసల్యాదేవి

తెలుగు సరిగ్గా చదవటం రాని మా తమ్ముడు ఒకసారి హాస్టల్ నుంచి రాసిన ఓ ఉత్తరంలో అక్కడి లైబ్రరీలో తను ఏకబిగిన చదివిన తెలుగు నవల గురించి గొప్పగా రాసాడు. ఉలుకూ పలుకూ లేకుండా నేను పుస్తకాలు చదువుతూంటే నన్ను ఆటపట్టించే పిల్లాడు ఒక నవలనీ, అందులోనూ తెలుగు నవలనీ చదివాడా అని ఆశ్చర్యం వేసింది. పైగా చాలా బాగుంది, ఇదివరకు చదవకపోతే చదువు అని. మా పిన్ని ఇంట్లో ఉందంటే తెచ్చుకుని చదివానా పుస్తకం. అదే కోడూరి కౌసల్యాదేవి రాసిన "శంకుతీర్థం". ఆ తర్వాతెప్పుడో కొనుక్కున్నా. తెలుగు నవలా సాహిత్యంతో పరిచయమున్నవారిలో "కోడూరి కౌసల్యాదేవి" పేరు తెలియని పాత తరం పాఠకులు అరుదుగా కనిపిస్తారు. "కోడూరి" ఇంటిపేరు "అరికెపూడి" అయ్యాకా రచనలపై అరికెపూడి(కోడూరి) కౌసల్యాదేవి అని వచ్చేది. అయినా "కోడూరి" పేరుతోనే పిలవటం అలవాటు మా ఇంట్లో. కోడూరి గారి నవలల్లో ముఖ్యంగా కనబడేవి బలమైన స్త్రీ పాత్రలు, వ్యక్తులను అధిగమించి జీవితాల్ని మార్చివేసే విధి విలాసాలు. చిత్రమైన విధి మనుషుల జీవితాల్ని ఎక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్లగలదు, ఎన్ని మలుపులు తిప్పగలదు అనే సత్యమే కోడూరి నవలల్లో అంతర్లీనంగా కనబడే నేపథ్యం.


కోడూరి కౌసల్యాదేవి నవలల్లో నేను చదివినవాటిల్లో మొదటిది "శాంతినికేతన్". నాకూ, మా సమస్తబంధువర్గానికీ ఫేవొరేట్ నవలల్లో ఒకటి. పత్రికలో సీరియల్ గా పడినప్పుడు కట్ చేసి బైండ్ చేయించింది అమ్మ. నేను మళ్ళి మళ్ళీ చదివే పుస్తకాల్లో ఇదీ ఒకటి. అసలీ నవల చదివాకే రవీంద్రుని శాంతినికేతన్ చూడాలని బలమైన కోరిక. నవలలో వర్ణించిన కలకత్తాలోని ప్రదేశాలు అవీ మేము కలకత్తా వెళ్ళినప్పుడు చూస్తూంటే ఒక అవ్యక్తానందం. దక్షిణేశ్వర్లో అయితే ఇక్కడే కదా 'రాజా' మొదటిసారి 'శాంతిని చూసింది అనుకుంటూ...చూసాను. ఈ కథను సినిమాగా తియ్యాలని అనుకున్నారుట కానీ ఎందువల్లో కుదరలేదు. అదే మంచిదయ్యింది అనిపిస్తుంది నాకు. వచ్చి ఉంటే పూర్తిగా ఖూనీ అయ్యుండేది. కథలోని పాత్రలకు సినిమాలో సరిపోయే హీరోయిన్, హీరో అప్పట్లో దొరికేవారేమో కానీ ఇప్పుడిక అసాధ్యం. అందులో ఐడియల్ మాన్ అనిపించే "రాజా" పాత్రకు ఇప్పుడు సరిపోయే హీరోలెవరూ లేరు. నాకు చాలా చాలా ఇష్టమైన పాత్ర. అసలలాటి ఉత్తమ వ్యక్తులు నవలల్లోనే ఎందుకు ఉంటారు అనుకునేదాన్ని.


ఈ కథను "టివీ సీరియల్ "గా చేసే సాహసం చేసారు. కానీ నవల బాగా నెమరేసేసుకున్న మా సమస్తబంధువర్గానికీ అది అస్సలు నచ్చలేదు. ఒకటి రెండు ఎపిసోడ్స్ తరువాత చూడటం మానేసాము. పూర్తిగా టివీలో వచ్చిందో లేదో తెలియదు. అసలు ఊహల్లో ఉన్న పాత్రలలో తెరపై మరో వ్యక్తులను చూడటానికి మనసు అంగీకరించదు ఎందువల్లో. నాయికానాయకులు "అలా మొదలైంది" సినిమాలోలాగ చివరిదాకా కలవలేరు పాపం. వారిద్దరు ఒకరికోసం ఒకరు అన్న సంగతి అర్ధమయ్యాకా కూడా పరిస్థితులు ఇద్దరినీ విడదీసేస్తాయి. ముఖ్యంగా శాంతి పాత్ర స్వభావంలో వచ్చే పరిపక్వత ఎంతో హృద్యంగా ఉంటుంది. శాంతిని కానీ, రాజాని కాని, పద్మ-శ్రీధర్ లను కానీ ప్రేమించకుండా మనం అసలు ఉండలేము. ఉమ్మడికుటుంబం లోని అనురాగాల్ని, మనుషుల్లోని ప్రేమతత్వాన్నీ ప్రతిబింబించే ఈ నవలలోని ప్రతి పాత్రా గుర్తుండిపోతుంది.


కోడూరి గారి నవలలు "చక్రభ్రమణం", "శంఖుతీర్థం", "ప్రేమ్ నగర్" మూడూ సినిమాలుగా వచ్చాయి. చాలా వరకు సినిమాలుగా మారిన నవలలన్నీ పుస్తకరూపంలోనే మనల్ని ఎక్కువగా అలరిస్తాయి. "చక్రభ్రమణం" "డాక్టర్ చక్రవర్తి" పేరుతో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. అన్యోన్యత, అనుబంధం, అనుమానాలు, అపార్ధాలు, స్నేహం మొదలైన విషయాల చుట్టు ఈ కథ తిరుగుతుంది. సినిమా కథలో కొన్ని మార్పులు చేసారు. ఈ సినిమాలోని "మనసున మనసై" "నీవు లేక వీణ" "పాడమని నన్నడగవలెనా" పాటలు ఎంత హిట్టో. ఎందుకో సినిమా కన్నా నవలే బాగుందని నాకనిపిస్తుంది.


"ప్రేమ్ నగర్" సినిమా కూడా హిట్టాయి ఏ.ఎన్.ఆర్ కి పేరు తెస్తే, రామానాయుడుగారికి కూడా ఎన్నో ఇబ్బందులు తీర్చింది. ఆయన కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. నవల విషాదాంతం. కథ రైట్స్ కొనుక్కుని ఇందులోనూ కొన్ని మార్పులు చేసారని అంటారు. సినిమా సుఖాంతమనుకుంటా. నేనీ సినిమా చూడలేదు. విషాదాంతం అని కొనుక్కోలేదు . "శంఖుతీర్థం" సినిమాను కృష్ణ, జయప్రదలతో విజయ నిర్మలగారు డైరెక్ట్ చేసారు. ఈ సినిమా కూడా నేను చూడలేదు. కాబట్టి ఎలా తీసారో తెలియదు. పెద్దగా ఆడలేదనుకుంటా. నవల మాత్రం చాలా బాగుంటుంది. చివరలో వరద రావటం అదీ మరీ సినిమాలాగ అనిపించినా మొదటినుంచీ పాత్రలు,కథనం అన్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా వందన పాత్ర గుర్తుండిపోతుంది. ఓ కుటుంబం తాలూకూ జీవితం, అన్నాచెల్లెళ్ళ తాలూకు వారసులు, వారి చూట్టూ గ్రామీణ వాతావరణం, వారి జీవన విధానంతో నిండిన కథ ఇది. వల్లమాలిన స్వార్ధం ఎప్పుడూ మనిషి పతనానికే దారి తీస్తుంది్; నిస్వార్ధం మంచిని, మంచితనం విచక్షణను పెంచుతాయి అన్నది నవల మనకిచ్చే సందేశం. చదివిన చాలా రోజులవరకూ వెంటాడే శక్తివంతమైన కథ ఇది.


"చక్రభ్రమణం" నవల చాలా బావుంటుంది. కానీ కొంతవరకే నాకు నచ్చుతుంది. అత్యంత ప్రేమగా ఉండే ఓ భర్త ఎవరో రాసిన ఆకాశరామన్న ఉత్తరం వల్లో, మరో కారణం వల్లో భార్యను అనుమానించటం అనేది నాకు అస్సలు మింగుడుపడదు. నమ్మకం ఉన్న చోట అనుమానం రానే కూడదు. అనుమానం మొదలైతే అది ప్రేమే కాదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అందువల్ల ఆ నవల కొనుక్కోలేదు. మా పిన్ని కూడా ఇటీవలే నా దగ్గర లేని మరికొన్ని కోడూరి నవలలు కొన్నానని చెప్పింది. ఎలా ఉన్నాయో చదివాలి. ఆమధ్యన "నెమలికనులు", "శిలలు-శిల్పాలు", ఇంకా కోడూరి గారి "కథల పుస్తకం" కొన్నాను. "నెమలుకనులు" నవలలో నాయిక దీప తన ఆదర్శాలను వివాహం తరువాత కూడా ఎలా కాపాడుకోగలిగింది అన్నది ఆసక్తికరంగా రచించారు కౌసల్యాదేవి గారు.


"శిలలు-శిల్పాలు" నవల చాలా నచ్చింది నాకు. ఒక పురుషుడు ఉన్నతుడుగా మారాలన్నా, అధముడు కావాలన్నా అది స్త్రీ చేతిలోనే ఉంటుంది. శిల్పి శిల్పాలను మలిచినట్లు పురుషుడి వ్యక్తిత్వాన్ని మలిచే శక్తి స్త్రీ పెంపకానికి ఉంది అనే నేపథ్యం ఈ నవలది.


కౌసల్యాదేవి కథల పుస్తకం సగమే చదివాను. ఇంకా కొన్ని కథలు చదవాల్సి ఉంది..:)

కోడూరి కౌసల్యాదేవి ఇతర రచనల జాబితా: