సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, March 22, 2011

నీళ్లు



మూడురోజులనించీ నీళ్ళు రాలేదు. పైనవాళ్ల ఇంట్లో చుట్టాలు కూడా వచ్చారు. వాళ్ళు మోటారు వేసినప్పుడల్లా గుండెల్లో రైళ్ళు. ఉన్న ఒక్క బిందె నీళ్ళు ఇవాళ అయిపోతే ఎలాగో అని బెంగపడిపోయాను. అదృష్టం బాగుండి ఇవాళ పొద్దున్నే ఆరింటికే నీళ్ళు వచ్చాయి. ఆనందమే ఆనందం. గంగాళం, స్టీలు బకెట్టు, బిందెలు, చిన్నాపెద్దా గిన్నెలు అన్నీ నింపేసా. మొన్నటి దాకా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం కాబట్టి ఈ ఇబ్బంది తెలీదు. నీళ్ళు రాకపోతే మేనేజ్మెంట్ వాళ్ళు టాంకర్ తెప్పించేవారు. అడిగిన డబ్బులు ఇస్తే సరిపోయేది. ఏ తలనెప్పి లేదు. తెలీదు. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అవటం వల్ల రోజు విడిచి రోజు నీళ్ళు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూపులే . అసలు ఓ టైమూ పాడూ లేదు. ఒకోసారి అవీ రావు. రెండ్రోజులకోసారి వస్తాయి. కాబట్టి వచ్చినప్పుడే ఎక్కువ పట్టేసి ఉంచుతాం. మళ్ళీ ఎల్లుండీ రాకపోతేనో...అనుకుని. ఇక వేసం కాలం ఎలా ఏడ్పిస్తాడో మరి.

బొంబాయిలో రోజు విడిచి రోజు ఇచ్చినా ఒక టైం ప్రకారం వదిలేవాడు నీళ్ళు. ఏమాటకామాటే చెప్పాలి వాళ్ల పధ్ధతుల్ని మెచ్చుకుని తీరాలి. అన్ని సిస్టమేటిక్ గా ఉంటాయి. ఆఖరికి బస్సులు కూడా అందరు లైన్లలోనే ఎక్కుతారు. ఇక్కడిలా పొలోమని తోసుకుపోరు. మేం ఉన్నన్నాళ్ళు ఏనాడూ నీళ్ళకు ఇబ్బంది పడలేదు. ఇక విజయవాడ సంగతి చెప్పనక్కర్లేదు. కృష్ణమ్మ ఉండగా నీళ్లకు ఇబ్బందేమిటీ? అసలు ఆ మాటే తెలీదు. మా పనమ్మాయి అంట్లు తోముతున్నంత సేపు పంపు వదిలేసి ఉంచేది రోజూ. నేను దాన్ని కేకలేస్తూ ఉండేదాన్ని. ఆఖరికి అది మాట వినట్లేదని ఆ నీళ్ళు వేస్టవకుండా మొక్కల్లోకి వెళ్ళేలా పంపు దగ్గర నుంచి ఒక చిన్న కాలవ కూడా నేనే తవ్వాను.

ఇక విజయవాడ వదిలేప్పుడు ఎంత తగ్గించినా నా మొక్కలు కూండిలు ఒక ఏభై అయ్యాయి. సామాన్ల లారీలో అవి పట్టలేదని కేవలం వాటి కోసం నాన్న ఒక వేరే లారీ కూడా మాట్లాడారు. అలా ఒక ఏభై మొక్కలు తెచ్చాను. ఇక్కడి నీళ్ళ బెడదతో కాసిని మొక్కలు, నే పెళ్లయివెళ్ళాకా అమ్మకి ఓపిక లేక కాస్త.. మొత్తానికి ఇప్పుడు ఒక్క మొక్క కూడా మిగల్లేదు. అద్దింట్లో ఉన్నన్నాళ్ళూ వాళ్ల ఇంటాయన వాడుకోవటానికి కూడా నీళ్ళు జగ్గులతో లెఖ్ఖ కట్టి ఇచ్చేవాడు. ఇక మొక్కలకేం పోస్తారు? ఇప్పుడిక సొంతిల్లు కాబట్టి ఓపిక ఉన్నమటుక్కు కాసిని మొక్కలు కొని పెంచితోంది అమ్మ. మొన్నటిదాకా మాకూ ఇల్లు పెద్దదైనా అపార్ట్మెంట్లో బాల్కనీ లేక ఏ మొక్కా పెంచలేకపోయా. ఇదిగో ఈ ఇల్లుకి మారాకానే మొక్కల సరదా తీర్చుకుంటున్నా. ఇక్కడా క్రింద మట్టి లేదు కనుక కుండీల్లోనే.

ఇక నీళ్ల వాడకం గురించి ఎన్ని తెల్సుకున్నాననీ? బట్టలుతికిన నీళ్ళు సందు కడగటానికి, ఆకు కూరలు, కూరలు కడిగిన నీరు మొక్కలకి పొయ్యటానికీ వాడతాను. వంటింట్లో సింక్ లో ఒక పెద్ద గిన్నె పెట్టుకుని చేతులు కడగటానికీ దానికీ దాన్నే వాడి, ఆ నీటిని మళ్ళీ మొక్కల్లో పోస్తాను.(అంటే జిడ్డు చేతులు కాదు. వంటింట్లో చాలా సార్లు చేతులు కడగటం ఒక అలవాటు నాకు..:)) ఇంకా పొద్దున్నే మొహం కడిగేప్పుడు చిన్నప్పుడైతే(పెద్దప్పుడు కూడా) బ్రష్ తో తోముతున్నంతసేపూ నీళ్ళు వదిలేసేదాన్ని. ఇప్పుడు ఒక మగ్ తో వాటర్ పెట్టుకుని వాటితో మొహం కడుగుతాను. అయిపోతే మళ్ళీ పట్టుకుంటా తప్ప టాప్ తిప్పి వదిలెయ్యను. పాపకు టబ్లో స్నానం చేయించి ఆ నీటిని బాత్రూమ్ కడగటానికి వాడతాను. ఇంకా చెప్పాలంటే జంధ్యాల సినిమాలో పిసినారి కోటా టైపులో నీళ్ళు వాడటం నేర్చుకున్నాను. రెండ్రోజులు ఉండటానికి వచ్చిన అమ్మానాన్న కూడా నా నీళ్ళ వాడకం చూసి మరీనూ... విడ్డూరం...ఓవర్ చేస్తున్నావ్..అంతొద్దు...అని వేళాకోళం మొదలెట్టారు. అయినా నే మారనుగా. మరి రెండు మూడు రోజులు నీళ్ళు రాకపోతే తెలుస్తుంది వాటి విలువ. ఏదైనా అంతే మరి. మనుషులైనా, వస్తువులైనా ఉన్నన్నాళ్ళు విలువ తెలీదు !!

నీళ్ల గురించి కరువు పడ్డప్పుడల్లా నాకు చిన్నప్పుడు డిడి లో ఓ మధ్యాహ్నం చూసిన ప్రాంతీయ భాషా చిత్రం "తన్నీర్ తన్నీర్" గుర్తొస్తుంది. సరిత ఎంత బాగా చేస్తుందో. బాలచందర్ డైరెక్టర్ ఈ మూవీకి. ఒక మారుమూల పల్లెలో ప్రజలు నీటి కోసం పడే తాపత్రయం, ఇబ్బందులు, ఓట్ల కోసం రాజకీయనాయకులు చేసే ప్రమాణాలూ...బావుంటుంది సినిమా. దీనినే "దాహం దాహం" అని తెలుగులో డబ్ చేసిన గుర్తు. ఇందాకా వెతికితే యూ ట్యూబ్ లో మూవీ లింక్స్ దొరికాయి. ఇష్టం ఉన్నవాళ్ళు చూడండి. చిన్నప్పుడెప్పుడో చూసింది కదా మళ్ళీ నేనూ చూస్తా.
మొదటిభాగం:

http://www.youtube.com/watch?v=XtDMmQHOGBs&feature=రెలతెద్

రెండవభాగం:

http://www.youtube.com/watch?v=Xqf6s_bFU8A&feature=రెలతెద్


ఎవరికైనా బ్రష్ చేసుకునేప్పుడు సింక్లో నీళ్ళు వదిలే అలవాటు ఉంటే మానేయండి మరి. నీళ్లను జాగ్రత్తగా వాడండి. ఆదా చేయండి. ఇంతకీ ఇవాళ తృష్ణ కన్ను నీళ్ళ మీద పడిందేంటబ్బా అనుకుంటున్నారా? ఇవాళ march 22nd - World water day !!


---------------
note: నే నిచ్చిన యూట్యూబ్ లింక్స్ లో "తన్నీర్ తన్నీర్" సినిమా కొంత భాగమే ఉంది.