సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Sunday, March 20, 2011
దెబ్బకు ఠా...
నిన్న ఒకచోటకు వెళ్ళాం. అనివార్య కారణాలవల్ల అక్కడ్నుండి morning showకు వెళ్ళాలని నిర్ణయించటం అయ్యింది. అయితే ఏ సినిమా? ఏ హాలు? అని ఆలోచిస్తే మేం వెళ్ళిన చోటుకు దగ్గరలో ఉన్న రెండు మూడు హాల్స్ లో అని డిసైడైయ్యింది. మూడింటిలోనూ "దొంగల ముఠా" అని ఉంది. ఇదేం సినిమా? ఊరూ పేరూ వినలేదే? పబ్లిసిటీ ఏం ఇవ్వలేదా? ఎప్పుడు రిలీజైంది? అన్నాను పొరపాటున. 'ఏం తల్లి ఏ లోకంలో ఉన్నావు? ఐదురోజుల సినిమా, ఐదురోజుల సినిమా అని డప్పు మోగుతూంటే? పైగా నిన్ననే రిలీజ్..' అన్నారు. "విన్నాను కానీ అయిపోయిందనీ,రిలీజ్ కూడా అయ్యిందని తెలీదు.." అన్నా. అయినా నిన్నే రిలీజ్ అయితే టికెట్లేం దొరుకుతాయి? పైగా ఎలా ఉంటుందో తెలుసుకోకుండా వెళ్తే ఏమౌతుందో ఈ మధ్యన బాగా అర్ధం అయ్యాకా అంత సాహసం తగునా? అనిపించింది. కానీ మనసు పీకింది.. వద్దంటే మళ్ళీ ఎప్పటికి కుదురుతుందో.. ఏదో ఒకటి చూసేస్తే పోలా అనేస్కుని సరేననేసా. మనకో దుర్వ్యసనం ఉంది. తను నా కూడా వస్తే చాలు ఏ డొక్కు సినిమా అయినా చూసెయ్యబుధ్ధేస్తుంది. టిపికల్ భార్య మెంటాలిటీ. కాన్ట్ గెట్ డీవియేటెడ్ !
ఇరవై నిమిషాలు ఉంది సినిమా మొదలవటానికీ. ఎందుకైనా మంచిదని వెళ్ళినచోటే ఓసారి "దీప రివ్యూ" కోసం నెట్లో వెతికా. ఎవరీ దీప? అంటే ఫుల్ హైదరాబాద్.కామ్ లో రివ్యూలు రాస్తుందీవిడ. రివ్యులు చూసి వెళ్ళినా కొత్త సినిమాకి వెళ్ళి బుక్కయిపోతున్నామని గగ్గోలు పెడితే అన్నయ్య చెప్పాడీమధ్యనే. ఈ సైట్లో రివ్యూ చూడు. అదీ "దీప" రివ్యూ చూడు. ఆవిడ బాగా రాస్తే మనకీ నచ్చుతుంది. కనీసం రేటింగ్ అయినా సరిగ్గా వేస్తుంది. మన views తో match అవుతుందావిడ రివ్యూ అని. అప్పటి నుంచీ ఏదన్నా తెలీని సినిమాకు వెళ్ళే ముందు దీప ఎంత రేటింగ్ ఇచ్చింది అని చూసి మరీ వెళ్లటం అలవాటైపోయింది. ఇక అదివరకూలాగ నిరాశపడట్లేదు. నిన్న ఏం రాసిందో చదివే టైం లేదు కానీ రేటింగ్ 5.5 అని చూసి పర్వాలేదు అనుకుని బయల్దేరా.
ఐదు నిమిషాల్లో హాల్ చేరాం. టికెట్లు ఈజీగానే దొరికేసాయి. మా పక్కకి ఒక ముదుసలి జంట(ఇద్దరికీ 65ఏళ్ళు పైనే ఉంటాయి) వచ్చి కూర్చున్నారు. అమ్మో వీళ్ళకెంత ఓపికో ఈ ఎక్స్పరిమెంటల్ సినిమాకు వచ్చారు అని హాచ్చర్యపడిపోయేసాము. ఆ మధ్యన వర్మగారు "అడవి"లోకి తీసుకెళ్ళి భయపెట్టేసాకా మళ్ళీ వర్మ సినిమాలేం చూడలేదిక. సినిమా మొదలైంది. కెమేరా తెగ కదుల్తోంది. ఒక చోట నిలవట్లేదు. కుంచెం భయమేసే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తోంది. కొంపతీసి ఇది దెయ్యాల సినిమా కాదుకదా అన్నా. అయితే దెయ్యాలు లేకపోతే అండర్ వరల్డ్. రెండే కదా ఈయన థీములు.
రవితేజ గెటప్ బానే ఉంది. హీరోలా కాకుండా ఇలా ఒక మర్యాదైన భర్త పాత్ర ఏదైనా వెయ్యచ్చు అనిపించింది. అదేమిటో చార్మీ అలా మాట్లాడుతోంది? నట్టుతోందా? భర్తని దెప్పుతోందా? అర్ధం కాలే. సరే ఇద్దరు ముగ్గురు పాత్రలు బయటకు వచ్చారు. నయం ఈ ఇద్దరితోనే సినిమా లాగించేస్తాడేమో అని భయపడ్డా. కానీ ఎంతసేపటికీ కథ ముందుకి జరగదే? తొసేవాళ్ళెవరూ లేకపోయారో ఏమో. మంచు లక్షిగారు జీన్సే వేసుకుని ఓ పైపుచ్చుకుని పైకి పాకుతున్నారు. సారీ ఎక్కుతున్నారు. ఆ తర్వాత కూడా కెమేరా ఛార్మీ జీన్స్ దాటి ముందుక్కానీ వెనక్కిగానీ వెళ్లటం లేదు. నాకు "క్షణ క్షణం"లో శ్రీదేవి జీన్స్ వేసుకుని పైకెక్కటం గుర్తు వచ్చింది. పాపం జీన్స్ కీ - డైరెక్టర్ కీ ఏదో అవినాభావసంబంధం ఉండి ఉంటుంది అనుకున్నా.
సినిమా సస్పెన్సా? కామిడీనా? డైరెక్టర్ ఇంటర్వెల్ దాకా డిసైడ్ చేసుకోలేకపోయాడు పాపం. ఇంటర్వెల్లో పక్కన కూర్చున్న తాతగారు బయటకు వెళ్ళివచ్చారు ఓపిగ్గా. మంచు లక్ష్మి ని చూస్తూంటే నాకు పాత సినిమాల్లోని విజయలలిత గుర్తుకు వస్తోంది. "అనగనగా.. " సినిమాలో కూడా ఆ నటన అదీ చూస్తూంటే విజయలలితే గుర్తు వచ్చింది. సరిగ్గా వాడుకోవాలి కానీ తెలుగు తెరకు ఒక మంచి కేరెక్టర్ ఆర్టిస్ట్ దొరికింది అనిపించింది నాకు. లేడి విలన్ గా ఎస్టాబ్లిష్ అవటం ఇష్టం లేకనేమో ఈ సినిమా కథ మధ్యలో అర్జెంట్గా పోలీస్ఆఫీసర్ అయిపోతుందీవిడ. ఏదో ఒకటి తెలుగు కాస్త సరిగ్గా పలికితే బాగుండు...ఆ డైలాగులు వింటూంటే రెండు మూడు రోజుల క్రితం ఏదో బ్లాగ్లో ఈవిడ తెలుగు ఏక్సెంట్ మీద చదివిన టపా గుర్తుకొచ్చింది.(తన పక్కన కూర్చుని, సినిమాహాల్లో కూడా బ్లాగు ని మర్చిపోని వీర బ్లాగర్ని..హా..హా..హా)
రెండవ భాగం సినిమాలో కాస్త కామెడీ కనబడింది. సినిమాను ఏ జానర్ లోకి తొయ్యాలో అప్పటికి డిసైడ్ అయ్యిందన్నమాట. బ్రహ్మాజీకి పాత్ర, డైలాగులు లేకపోయినా అతని మేనరిజం నాకు భలే నచ్చేసింది. ముగ్గురు దొంగలతో రవితేజ డైలాగులు చెప్తున్నప్పుడు, తలొకరి వైపూ చూసి తలాడించటం విసుగనిపించినా నవ్వు తెప్పించింది. బ్రహ్మానందానికి బొత్తిగా చెయ్యటానికి ఏం లేదు. ప్రకాష్ రాజ్ కూడా అనవసరమ్ అనిపించింది. కానీ కథనంలో బలం లేక ఈ నటులవాల్లనైనా చివర్దాకా చూడగలిగాం. కొత్త ఎక్స్పరిమెంట్ చెయ్యాలన్నా శ్రధ్ధ కథనం పట్ల కూడా ఉండి ఉంటే మంచి సినిమాగా మిగిలిపోయేదేమో. చివరలో ఆ పాట ఎందుకో తెలీలేదు. ప్రేక్షకుడిలో ఇంకా ఏ మాత్రమైనా సహనం మిగిలి ఉందా అని పరీక్షించడానికేమో.
ఇహ సినిమాకు వాడిన కెమేరా, లైటింగ్ గట్రాల గురించి చాలామంది చాలా చోట్ల రాసేసారు. గంటన్నర లో సినిమా అయిపోవటం మాత్రం తెగ నచ్చేసింది.ఇంతకీ సినిమా ఎలా ఉందీ అని మేం వెళ్ళమని తెలిసిన అందరూ అడగటమే. "అదే..సమాధానం ఏం చెప్పాలో అర్ధం కాకుండా ఉంది..."అని చెప్పా. ఇంతవరకూ డిసైడ్ చేస్కోలేకపోయా. అద్ది రాం గోపాల్ వర్మ టాలెంట్ అంటే. ఈ డెసిషన్ మేకింగ్ లో కాస్త మీరు హెల్ప్ చేయ్యరూ..?
Subscribe to:
Posts (Atom)