సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, March 16, 2011

మల్లాది సూరిబాబుగారి గాత్రం


"మల్లాది సోదరులు"గా పేరుగాంచిన కర్ణాటక సంగీతకళాకారులు మల్లది శ్రీరామ్ ప్రసాద్, మల్లది రవి కుమార్ సోదరుల తండ్రిగారు శ్రీ మల్లది సూరిబాబుగారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సీనియర్ అనౌన్సర్ గా రిటైరయ్యారు. నాన్నగారి కొలీగ్ కావటంతో చిన్నప్పటి నుంచీ పరిచయం. సూరిబాబు మావయ్యగారు అనే ఇప్పటికీ పిలుస్తాను. ఇటీవలే ఇంటికి వెళ్ళినప్పుడు మావయ్యగారిని చాలా ఏళ్ళతరువాత కలవటం కూడా జరిగింది. మావయ్యగారు చాలా బాగా పాడతారు. మా చిన్నప్పుడు ఎప్పుడటువైపు వెళ్ళినా శిష్యులతో వాళ్ళ ఇల్లంతా నిండిపోయి ఉండేది. లలిత, శాస్త్రీయ సంగీతాలను ఆయనవద్ద నేర్చుకోవటానికి ఎంతో మంది పొరుగూళ్ల నుంచి కూడా వస్తూండటం నాకు తెలుసు. నాకెంతో ఇష్టమైన ఆయన గాత్రంలో ఒక భక్తి గీతం ఇక్కడ వినండి. రొటీన్ గా కాకుండా ఒక విశిష్ఠతతో వినేకొద్దీ వినాలనిపించే ఆయన గాత్రం చాలా బావుంటుంది.

రచన: ఆదూరి శ్రీనివాసరావు
గానం: మల్లది సూరిబాబు
ఆల్బం: సాయినాదఝరి




వీడకుమా విడనాడకుమా (2)
ఎదనుండి ఎడబాయకుమా(2) llవీడకుమాll

కనులలో దాగిన కాంతివి నీవు
చెవులకు వినికిడి శక్తివి నీవు
దేహము లోని దేహివి నీవు(2)
ఆకృతిలేని ఆత్మవు నీవు llవీడకుమాll

సత్యము తెలిపిన సద్గురు స్వామివి
అందరిలోనీ అంతర్యామివి
శ్రీశైలములో సుందర శివుడవు
పళనిలో వెలసిన శరవణభవుడవు llవీడకుమాll

ఏమరుపాటుతో మిడిసిపాటుతో
ఎపుడైనా నే తలచకున్నను
కంటికి రెప్పగా కాయుము దేవా
తీరుగా నడుపుము జీవన నావ llవీడకుమాll

*******************

ఇది మరో చిన్న ఆలాపన. "నిశ్శబ్దం-గమ్యం" అనే నాన్నగారి అవార్డ్ ప్రోగ్రాం లోది. ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు రాసిన ఈ వాక్యాలు ఎంత సత్యమో కదా అనిపిస్తాయి.


ఇక్కడని అక్కడని ఎక్కడ ఎన్ని శిఖరాలెక్కినా
ఒక్కనాడూ...
ఒక్కనాడూ మనిషి లోపలి లోభము ఎక్కడ తీరదూ
మనిషి లోపలి లోభమెక్కడ తీరదూ...