సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Monday, December 27, 2010
మన్మథబాణం
* చాలా రోజుల తరువాత వ్యక్తిత్వం ఉన్న ఒక హీరోయిన్ ను చూడాలంటే
* పేరిస్, బార్సిలోనా, వెనిస్ మొదలైన అందమైన ఫారెన్ సిటీల్లో చిత్రీకరణ
* అందమైన లొకేషన్స్, నీట్ అండ్ క్లీన్ రోడ్స్ అండ్ fast మూవింగ్ ట్రైన్స్
* తనదైన స్టైల్లో smart even in his fifties అనిపించే సహజనటుడు కమల్ కోసం
* చిత్రంలో లీనమయ్యేలా చేసే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం
* వెకిలి హాస్యం, మితిమీరిన హింస, ఓవర్ ఎక్స్పోజింగ్ లేని cool movie కావాలంటే
* డబ్బింగ్ సినిమా అయినప్పటికీ అర్ధమవుతూ నవ్వు తెప్పించే సంభాషణల కోసం
* చాలా రోజుల తరువాత హాయిగా నవ్వుకోవాలంటే
* ప్రేక్షకులు ఊహించలేనన్ని ట్విస్ట్ లతో పిచ్చెక్కించే తిక్క కధలు వద్దనుకునే వారు
* ఒక మామూలు సాధారణమైన ప్లైన్ కథ కావాలనుకునేవారు
* మాధవన్ sweet smile ఇష్టమైనవారు(ofcourse, ఈ సినిమాలో అవి ఎక్కువగా లేకపోయినా)
* రొటీన్ సినిమాలు చూసీ..చూసీ....బోర్ కొట్టినవాళ్ళు ఓ సినిమా చూసి బాగుందనుకోవాలంటే
* నటనకు అవకాశం ఉన్న పాత్రలో సంగీత ను చూడాలనుకుంటే
చూడాల్సిన చిత్రం "మన్మధబాణం". ముత్తు, సూర్యవంశం మొదలైన సూపర్ డూపర్ హిట్స్ తీసిన ప్రఖ్యాత తమిళ దర్శకుడు కె.ఎస్.రవి కుమార్ గతంలో కమల్ హాసన్ తో భామనే సత్యభామనే, తెనాలి, పంచతంత్రం, దశావతారం మొదలైన సినిమలు తీసారు. మళ్ళీ కె.ఎస్.రవి కుమార్, కమల్ కాంబినేషన్ తో ఇటివలే రిలీజైన రొమాంటిక్ కామిడీ "మన్మథబాణం". ఇవాళ్టి రోజున తెలుగు సినిమాల్లో లోపించిన సహజత్వం నాకు ఈ సినిమాలో కనిపించింది. డబ్బింగ్ సినిమాలు సాధరణంగా నేను చూడను. ఈ సినిమాలో కూడా లోపాలు ఉన్నాయి. కానీ, సినిమాలోని ప్లస్ పయింట్స్ చూసుకుంటే ఈ లోపాలు చిన్నవిగా కనబడతాయి.
కొన్ని లోపాలు చెప్పాలంటే:
* ప్రముఖ విలక్షణ గాయని "ఉషా ఉతుప్" వేయక వేయక ఇలాంటి అత్తగారి పాత్ర వేయటమేమిటి అని నవ్వు పుట్టిస్తుంది.
* కథనంలో ఉన్న స్లోనెస్ అప్పుడప్పుడు బోర్గా ఉందా అనిపించేలా చేస్తుంది.
* చివరలో మాధవన్ కూ, సంగీత కు కుదిర్చిన లింక్ చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.
* రెండవ భాగంలో ఒక పాయింట్ లో కన్ఫ్యుజన్ బాగా ఎక్కువైంది అనిపిస్తుంది.
* అక్కడక్కడ క్లోజప్స్ లో కమల్ ఏజ్ కనబడినప్పుడు కాస్త కాన్షియస్ గా ఉండకూడదూ(ఐ మీన్ ఫేస్ యంగ్ గా కనపడటానికి) అన్పిస్తుంది.
* చివరలో బోట్ సీన్స్ దగ్గర పాత్రలతో పాడించిన కొన్ని సినిమా పాటల పల్లవులు డబ్బింగ్ కు సరిపోయేలా అతికినట్లు స్పష్టంగా తెలిసిపోయాయి.
* మాధవన్ ఫోన్ ఫ్రెష్ రూంలో జారిపడడం లాంటి తమిళ ప్రేక్షకులకు అలవాటైన, వాళ్ళకు హాస్యమనిపించే కొన్ని సన్నివేశాలు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయి.
సినిమాలో నాకు నచ్చినవి:
* చాలా రోజుల తర్వాత డాన్స్ లు చేయటం, చాలీచాలని బట్టలతో ఎక్స్పోజింగ్ చేయటం తప్ప పెద్దగా ప్రాముఖ్యత లేని హీరోయిన్ ని కాక కాకుండా కాస్త ఆలోచన, విచక్షణ ఉన్న హీరోయిన్ కథలో ఉండటం.
* ఒక పాట మొత్తం రివర్స్ షాట్స్ తో తీయటం చాలా బాగుంది.
*"భూషణమా? పేరు ఓల్డ్ గా లేదు అన్నప్పుడూ కమల్ అనే "అంబుజం.. కన్నానా";
"అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక్క మెతుకు పట్టుకుంటే చాలండీ." "అబ్బే నాకీ ఉడకడాలూ అవీ తెలీదు. నేను ప్రెషర్ కుక్కర్. ఒక్క విజిల్.. అంతే." లాంటి కొన్ని కొన్ని డైలాగులు,
* స్త్రీల చిత్త ప్రవృత్తి గురించి మాధవన్ చెప్పే డైలాగ్ లు,
* అప్పుడప్పుడు పిల్లల ప్రవర్తన గురించి, మగవారి నైజం గురించీ సంగీత చెప్పే డైలాగులు,
* ప్రొడ్యూసర్ కురుప్, అతని భార్య (వాళ్ళున్న ప్రతి ఫ్రేం)
* సంగీత పిల్లవాడి డైలాగులు
* మాధవన్ కూ, త్రిష కూ సినిమా మొదట్లో జరిగే ఘర్షణ తాలూకు డైలాగులు
* "ఏం మాయ చేసావే" సినిమాలో హీరోయిన్ కు డబ్బింగ్ చెప్పిన వాయిస్ తోనే ఈ సినిమాలో త్రిషకు చెప్పించారు. స్వచ్ఛమైన తెలుగు పలకకపోయినా ఆ వాయిస్ లోని మెత్తదనం, మాట విరుపు అన్నీ నాకు బాగా నచ్చేసాయి.
* మాధవన్ కు అబధ్ధం చెప్పాకా కమల్ పాడే పాట సాహిత్యం, ఆ పాట లోని కమల్ డాన్స్
* కమల్ నటనకు అతికినట్లు ఉండే బాలూ డబ్బింగ్
ఈ సిన్మా గురించి ఇంకా ఏం చెప్పాలంటే:ఈ మధ్యన భారీ బడ్జట్లతో తీసిన మూడు కొత్త సినిమాలు చూసి కొత్త సినిమా అంటేనే భయం పట్టుకుంది. చివరిగా నెల క్రితం చూసిన ఒక సినిమాలోంచి అయితే వెళ్పోదాం అని లేచి వచ్చేసాను. జీవితంలో మొదటిసారి థియేటర్ లోంచి నేను బయటకు వచ్చిన సినిమా అది. అలాంటిది ఈ సినిమా చూస్తూంటే కొన్న టికెట్ కు పూర్తి న్యాయం జరిగింది. అనిపించింది. చూడగానే "అబధ్ధం" పాట గుర్తుకు తెచ్చే సంగీత ను మరి కాస్తంత బొద్దుగా చూడ్డం ఇబ్బందే అనిపించినా ఆ పాత్రకు ఉన్న వైటేజ్ మన దృష్టిని పాత్ర తాలూకు నటన వైపుకే లాగుతుంది.సినిమా మొదట్లో కాస్త లావుగా కనిపింఛిన కమల్, సంగీత ఇద్దరూ తరువాతి సీన్స్ లో కాస్త సన్నబడ్డట్టు కనిపిస్తారు.సంగీత నటన అప్పుడప్పుడూ ఓవర్ అనిపించినా మొత్తమ్మీద బాగా చేసిందనిపిస్తుంది. త్రిష నటన కూడా బాగుంది. కథంతా కమల్, త్రిష, సంగీతల చుట్టూ ఉండటంతో మాధవన్ కు పెద్దగా నటనకు చాన్స్ లేదు.
కమల్ అదివరకూ కూడా సినిమాల్లో పాటలు పాడారు. అయితే ఈ సినిమాలో పాడిన రెండు పాటల్లో వాయిస్ క్వాలిటీ పెరిగినట్లు అనిపించింది. దేవీశ్రీప్రసాద్ ఒక పాటలో ఓ చోటెక్కడో తళుక్కుమన్నారు. పాటలు బానే ఉన్నాయి కానీ నాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే బాగుంది. "అనుమానం" మనిషిని ఎంత హీనమైన స్థితికి దిగజారుస్తుందో, దానివల్ల మనిషి ఏం పోగొట్టుకోగలడో మధవన్ పాత్ర బాగా తెలియజేస్తుంది. నాకు బాగుంది కానీ ఫార్ములా సినిమాలకూ, మూస సినిమాలకు అలవాటు పడిపోయిన తెలుగు ప్రేక్షక్లులకు ఈ సినిమా నచ్చుతుందా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే మరి తొడ కొడితేనో చిటిక వేస్తేనో విలన్ గానీ రౌడీలు కానీ అల్లంత దూరాన ఎగిరిపడే సీన్లూ్; జీపులూ,బస్సులూ తగలబడే సీన్లూ; రక్తం ఏరులా పారే వెర్రి హింస ఈ సినిమాలో లేవు మరి.
"సతీ లీలావతి" అంతటి పూర్తిహాస్యభరిత చిత్రం కాకపోయినా చూసాకా "బాగుంది. చాలా రోజులకు ఒక మంచి(డబ్బింగ్) సినిమా చూసాం" అని తప్పక అనిపిస్తుంది. క్రితం నెల జయప్రదం(లోకల్)లో ప్రసారమైన కమల్ ఇంటర్వ్యూ చూసాకా ఇప్పటివరకూ అన్నయ్య అభిమాన నటుడిగానే నాకు నచ్చే కమల్ ఒక అసాధారణ వ్యక్తిగా నాకు అనిపించాడు. పర్సనల్ రిలేషన్స్ సంగతి ఎలా ఉన్నా హీ ఈజ్ డెఫినేట్లీ ఏ గుడ్ హ్యుమన్, ఏ నాలెడ్జబుల్ మేన్ అనిపించాడు. నిన్న రాత్రి సినిమా చూసాకా నాకనిపించినవన్నీ రాసేసాననే అనుకుంటున్నాను...:)
Subscribe to:
Posts (Atom)