సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Sunday, December 26, 2010
(గడచిన)కాలానికి కృతజ్ఞత
T.S.Eliot ఒక poemలో "I have measured out my life with coffee spoons.." అని చెప్పినట్లుగా చెప్పాలంటే నేనొక సగటు వ్యక్తిని మాత్రమే. కానీ నేను నా ఆలోచనలనూ, కొన్ని జీవిత సంఘటనలనూ ఇలా బ్లాగులో గొప్పకో సరదాకో రాయను. నేను తెలుసుకున్న సత్యం మరెవరికైనా ఉపయోగపడుతుండేమో అని రాస్తాను. అది అర్ధమయ్యేవారే 'తృష్ణవెంట' నడుస్తారు. వణికించే చలి వాకిట తిరుగుతున్న ఈ పొద్దుటి పూట ఓసారి ఈ ఏడాది ఎలా గడిచిందా అని వెనక్కి తిరిగి చూసాను..
కాలం గిర్రున తిరిగింది అంటూంటారు కధల్లోనూ నవలల్లోనూ. జీవితంలో మొదటిసారి అది ప్రాక్టికల్ గా తెలిసింది ఈ సంవత్సరంలో. ఎలా వచ్చి ఎలా వెళ్ళిపోయిందో తెలియలేదు ఈ ఏడాది. ఇక నాలుగురోజులు మిగిలి ఉంది. ఈసారి మొదటి రెండు మూడు నెలల తరువాత డైరీ ముట్టుకున్నదే లేదు. అయితే ఇది అలా వెళ్ళిపోవటమే బాగుంది. ఎందుకంటే ఈ ఏడాది విధి నాకు చూపించిన విశ్వరూపం బహుశా నే ఎప్పుడూ చూసి ఎరుగను. రోజులు తెలిసేలా గడిస్తే వాటి భారాన్ని మోయటం కష్టమే. ఈ ఏడు నేను చూసినది పదినెలల అమావాస్యని. కోల్పోయినవి ఎన్నో...ఒక నమ్మకాన్ని, ఒక నిజాన్ని, ఒక అనుభూతినీ, ఒక గౌరవాన్ని...ఎన్నింటినో. ఇంట్లో జరిగిన అనర్ధాలు కూడా ఎన్నో పాఠాలు నేర్పించాయి. చేతికొచ్చిన పంట కళ్ళెదురుగా నష్టపోతూంటే విలవిల్లాడిన రైతు సోదరుల్లాగ, నా ఆశలు ఫలించబోయే తరుణంలో జరిగిన అనర్ధం నా చైతన్యాన్ని వేళ్ళతో కుదిపేసింది. ఒకటి రెండు కాదు...మూడో నష్టం. ఒక ఆరని మంటని రగిల్చింది. మిగిలిన సంఘటనలు అయితే నాలోని వివేకాన్ని, వివేచననీ తొక్కివేసాయి. నమ్మకం అన్న పదానికున్న నమ్మకాన్నే పోగొట్టాయి.
కాలం ఎంత మధురమైనదో అంత జాలిలేనిది కూడా. మన కోసం ఎక్కడా ఆగదు. తన దారిన తాను పోతూ ఉంటుంది. విచిత్రమేమిటంటే కాలం చేసిన గాయాలకు కాలమే మందు. మొన్నలా నిన్న, నిన్నలా ఇవాళ అసలు ఉండనే ఉండవు. ఇదే సృష్టి రహస్యమేమో మరి. నేనూ ఆ సూత్రానికి లొంగిపోయను. లేచి నిలబడ్డాను. ఈసారి మరింత జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ మళ్ళీ నడవటం మొదలెట్టాను. కాలం నేర్పిన పాఠాలు మననం చేసుకుంటూ. కొత్త పాఠాలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ.
నిలబడటానికి మరో చేయి అవసర మౌతుందేమో అనుకున్న క్షణం నిర్ణయించుకున్నాను no more help..అని. "ఇంతా తెలిసియుండి.." అని పాడినట్లు ఇంతకాలం, ఇన్నేళ్ళు జీవించాకా ఇంకా ఊతం కోసం ఎదురుచూడటం మూర్ఖత్వమే. పేజీలు తిప్పబడిన కేలండర్లు, పెట్టె నిండిన పాత డైరీలు నేర్పిన అనుభవల పాఠాలు మర్చిపోతే ఎలా? దారిలో వచ్చిన ప్రతి అడ్డంకి దగ్గరా ఆగిపోతే గమ్యం ఎప్పటికైనా చేరతామా? nobody can help us untill we help ourselves అని ఎప్పుడో చెప్పారు కదా. రేపు ఎప్పుడూ ప్రశ్నార్ధకమే. ఇక ఇవాళలో జీవించకపోతే ఇన్నాళ్ల జీవితం ఎందుకు? అనుకున్నాను. and then...i stood up. జీవితాన్ని ఆస్వాదించటానికి ఏవైతే చెయ్యగలనో అవన్నీ చేసాను..చేస్తున్నాను... finally iam here writing my blog posts. మళ్ళీ అసలు తెరవననుకున్న బ్లాగ్ రెండునెలలలోపే తెరిచాను. రాస్తూనే ఉన్నాను. రాస్తూనే ఉండాలనుకుంటున్నాను..ప్రస్తుతానికి...:)
అయితే ఇన్ని గాయాలు చేసినా ఈ సంవత్సరానికి నేనెంతో ఋణపడిపోయాననిపిస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం నాకు నేర్పిన పాఠాలు చాలా విలువైనవి. నన్ను కొంతైనా ప్రాక్టీకల్ గా తయారుచేసింది. నాలో గొప్ప మార్పుని తెచ్చింది. అది నేను నిలబెట్టుకోవాలి. కాలం మామూలుగా గడిచిపోయి ఉంటే ఈ మర్పు వచ్చేదే కాదు. అందుకే నన్నెంతో బాధపెట్టి మనసు విరిచేసిన ఈ సంవత్సరం అంటే నాకు ఎంతో కృతజ్ఞత.
==========================================
note:ఈ టపా కేవలం ఈ సంవత్సరం గురించిన నా మనోభావాలే తప్ప నేనేవిధమైన వ్యాఖ్యలనూ ఆశించి రాయలేదు. అందువల్ల కామంట్ మోడ్ తొలగిస్తున్నను.ఇప్పటిదాకా కామెంట్లు రాసినవాళ్ళకు ధన్యవాదాలు.
Subscribe to:
Posts (Atom)