"క్రిస్మస్" ఈ పేరుతో నాకున్న అనుబంధం ఎన్నో జ్ఞాపకాలను తట్టి లేపుతుంది. నేను ఏడవతరగతి దాకా చదివినది ఒక క్రిస్టియన్ స్కూల్లో. కొందరు స్నేహితులు, టీచర్స్ క్రిస్టియన్స్ అవటంతో ప్రతి ఏటా ఎవరో ఒకరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనే అవకాశం వస్తూ ఉండేది. ఆ తరువాత కాలేజీ కూడా విజయవాడలోని మారిస్టెల్లా, (నాకు చాలా ఇష్టమైన కాలేజీ) అవటంతో "క్రిస్మస్" బాగా ఆత్మీయమైన పండుగ అయిపోయింది నాకు.
స్కూల్లో ఉండగా మా సందుకి రెండు సందుల అవతల ఒక క్రిస్టియన్ స్నేహితురాలి ఇల్లు ఉండేది. క్రిస్మస్ రోజు నాకు ప్రత్యేక ఆహ్వానం ఉండేది. నేను ఆ పార్టీ ఎప్పుడూ మిస్సయ్యేదాన్ని కాదు. ఎందుకంటే ఆ రోజున వాళ్ళ ఇంట్లో తయారయ్యే స్పెషల్ కేక్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. స్వతహాగా స్వీట్స్ అంటే ఇష్టం ఉండటం వల్ల కేక్ అంటే కూడా భలే ఇష్టం ఉండేది నాకు. వాళ్ళింట్లో కేక్ తిని వచ్చి మా ఇంట్లో కేక్ ప్రయోగాలు చేసేదాన్ని. స్పాంజ్ కేక్, ఎగ్ లెస్ కేక్, ఫ్రూట్ కేక్ అంటూ రకరకల కేక్స్ ప్రయత్నించేదాన్ని. కాస్త వంటగత్తెనే కాబట్టి ప్రయోగాలు బానే వచ్చేవి కూడా. అమ్మ మాత్రం గిన్నెలు, ఇల్లూ వాకిలీ ఎగ్ కంపు అని గోలపెట్టేది.
ఇక మిత్రుల కోసం క్రిస్మస్ గ్రీటింగ్స్ స్వయంగా తయారు చేయటం ఒక సరదా. అదవ్వగానే న్యూ ఇయర్ కోసం. క్రిస్టియన్స్ న్యూ ఇయర్ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎంతైనా స్వహస్తాలతో మిత్రులకు ఏదైనా చేసివ్వటం ఎంతో తృప్తిని ఇస్తుంది. నాన్న అయితే మేం సరదా పడుతున్నామని స్టార్ కూడా కొని తెచ్చేవారు. మేం అది ఇంటి ముందు పెట్టుకుంటే ఇంటివైపు వచ్చిన మిత్రులు మీరు క్రిస్టియన్సా? అని అడిగేవారు. కాదు సరదాకు పెట్టుకున్నాం అంటే వింతగా చూసేవారు. అవన్నీ కాక కాలేజీరోజుల్లో నాకు అందరికాన్నా దగ్గరైపోయిన నా ప్రియనేస్తం ఒకమ్మాయి చదువయ్యాకా ఒక క్రిస్టియన్ ను మేరేజ్ చేసుకుంది. నా కుటుంబం తరువాత నాకత్యంత సన్నిహితురాలు తనే. కానీ విచిత్రం ఏమిటంటే ప్రత్యేక కారణాలు లేకపోయినా జీవనయానంలో యాంత్రికమైపోయిన పరుగుపందాల్లో తను నాకు చాలా దూరంగా వెళ్లిపోయింది తను. అయినా ఇప్పటికీ తనకు క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపిస్తూనే ఉంటాను. "where is the time to hate, when there is so little time to love" అన్న పాటలోని మాటలు నేను నమ్ముతాను. నాకు తను ఎప్పటికీ ప్రియమైన నేస్తమే. "our sweetest songs are those that tell saddest thoughts.." అని ప్రఖ్యాత ఆంగ్లకవి షెల్లీ అన్నట్లు బాధాకరమైనవైనా కొన్ని స్మృతులు ఎప్పటికీ మధురంగానే ఉంటాయి.
ఇక ఏ ఊళ్ళో ఎక్కడ ఉన్నా ప్రతిఏడూ మా ఇంట్లో మాకు పరిచయం ఉన్న క్రిస్టియన్ మిత్రులందరికీ ఫొన్లు చేసి క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్తూంటాం నాన్న, నేను. ఇంతే కాక ఈ రోజున నా మరో క్లోజ్ ఫ్రెండ్ "రూప" పుట్టినరోజు. తన గురించి నేను క్రిందటేడు రాసిన టపా "ఇక్కడ".ఇక ఇప్పుడు బ్లాగ్లోకంలోకి వచ్చాకా పరిచయమై అభిమానంతో ఆప్తుడైన తమ్ముడు చైతన్య పుట్టినరోజు కూడా ఇవాళే. ఇద్దరికీ బ్లాగ్ముఖంగా "పుట్టినరోజు శుభాకాంక్షలు".