సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, December 22, 2010

BLOG...connecting friends


"శారద" గుర్తుకు రాగానే మంచులో తడిసిన నందివర్ధనం పువ్వు గుర్తుకు వస్తుంది. తెల్లటి తెలుపులాంటి స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి. ఎంతో అణుకువగల సుగుణాల రాశి. అలాంటి అమ్మాయిలు చాలా తక్కువమంది ఉంటారు. బహుశా ఓ ఇరవైఏళ్ల క్రితం పుట్టవలసిన అమ్మాయి ఇప్పుడు పుట్టింది అనిపించేది తనని చూస్తే. మేం క్వార్టర్స్ లోకి వచ్చాకా పరిచయమైంది. గేటు ఎదురుగా వాళ్ళ ఇల్లు ఉండేది. లోపలికి వెళ్ళేప్పుడూ వచ్చేప్పుడూ చిరునవ్వుల ఎక్స్చేంజ్ లు అయ్యిన కొంతకాలానికి మా స్నేహం పెరిగింది. ఇప్పటికి దాదాపు ఇరవైఏళ్ళ స్నేహం మాది. టేబుల్ రోజంత పెద్ద పువ్వు పూసే మల్లె మొక్క వాళ్ళింట్లో ఉండేది. మా ఇంటికి వచ్చినప్పుడల్లా నాకోసం ఆ పెద్ద పెద్ద మల్లెపూలు తెచ్చేది. భలే ఉండేవి ఆ మల్లెపూవులు. తను నాకన్నా ఏడాది పెద్దది. ఇంటర్ తరువాత ఎమ్సెట్లో రేంక్ వచ్చి కాకినాడలో ఇంజినీరింగ్ చదివింది. అన్నయ్య కూడా అక్కడే చదవటం వల్ల మా ఇంటికి కూడా వెళ్తూండేది. మా అత్త తనూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. మేం కాకినాడ వెళ్ళినప్పుడల్లా నేను వాళ్ళ హాస్టల్కు వెళ్ళేదాన్ని. ఇంజినీరింగ్ నాలుగేళ్ళు పూర్తయ్యేసరికీ తను విజయవాడ నుంచి తెచ్చి హాస్టల్లో వేసిన పారిజాతం మొక్క పెద్ద వృక్షమై బోలెడు పువ్వులు పూస్తూ ఉండేది. ఇప్పటికీ కాకినాడ లేడీస్ హాస్టల్లో శారద నాటిన ఆ పారిజాత వృక్షం ఉంది.

తను విజయవాడ వదిలాకా మా కమ్యూనికేషన్ ఉత్తరాల ద్వారానే. తన పెళ్ళి కూడా విచిత్రమే. అబ్బాయి తన క్లేస్మేటే, వచ్చి అడిగారు చేసుకుంటామని అని వాళ్ళమ్మగారు చెప్పారు. ఎవరా అంటే నా మరో క్లోజ్ ప్రెండ్ మాధవి వాళ్ళ అన్నయ్యే పెళ్ళికొడుకు. అలా రెండు రకాలుగా దగ్గరైపోయింది తను. చాలా ప్రత్యేకమైన స్నేహితురాలు తను. పెళ్ళైన కొన్నాళ్ళాకే వాళ్ళిద్దరూ అమెరికా వెళ్పోయారు. అమెరికాలో కూడా గుడికెళ్ళి మరీ సాయిపారయణ చేసేంత భక్తురాలు శారద. ఉపవాసాలు, పూజలూ ఇష్టం. పిల్లలిద్దరూ అమెరికాలోనే పుట్టారు. సంసార సాగరంలో పడ్డాకా మా మధ్యన ఉత్తరాలు ఈమైల్స్ గా మారాయి. ఉద్యోగాల హడావుడి పరుగుపందాల్లో నెమ్మదిగా అవీ పండగలకీ, పుట్టినరోజులకీ గ్రీటింగ్స్ పంపుకునేంతగా తగ్గిపోయాయి. మాధవి ద్వారా వాళ్ళ కబుర్లు తెలుసుకుంటూ ఉండేదాన్ని. ఎప్పుడన్నా ఫోన్ చేసేది తను. కమ్యూనికేషన్ లేకపోయినా ఒకటి రెండు సంవత్సరాల తరువాత తను మాట్లాడినా నిన్ననే మాట్లాడినట్లుగా మాట్లాడుకునేవాళ్ళం. కొన్ని స్నేహాలు అంతేనేమో. విడిపోవటాలూ కలవటాలూ అనేవి ఉండవు. దూరంలో ఉన్నా, కలవకపోయినా ఆ స్నేహంలోని మాధుర్యం ఇద్దరి మధ్యన ఉన్న బంధాన్ని తాజాగా నిలిపే ఉంచుతుంది.

ఆ మధ్యన ఏవో టపా లింకులు కొందరు స్నేహితులకు పంపుతూ తనకూ పంపాను. తర్వాత మర్చిపోయాను. కొన్నాళ్ళ తరువాత తన ఈమైల్ వచ్చింది. నీ బ్లాగ్ చూసాను. చాలా బాగుంది. ఓపిగ్గా ఉత్తరాలు రాసినట్లే రాస్తున్నావు అని. మా మధ్యన మళ్ళీ ఉత్తరాలు(మైల్స్) మొదలైయ్యాయి. పాత ఐడీ తాలూకూ మైల్బాక్స్ చాలా రోజుల తరువాత నిన్ననే తెరిచి చూసాను. క్రితం వారం శారద రాసిన మైల్ ఉంది. ఆశ్చర్యం. అన్ని కబుర్లూ తనే అడుగుతోంది... ఇల్లు సర్దుకోవటం అయ్యిందా? గుమ్మిడివడియాలు బాగా ఎండాయా? భలే పెట్టేసావు...అంటూ. చివరలో రాసింది "అదివరకూ ఖాళీ ఉంటే నెట్లో ఈనాడు చూసేదాన్ని. ఇప్పుడు నీ బ్లాగ్ మాత్రమే చదువుతున్నాను.బాగుంటోంది...నీ బ్లాగ్ చదువుతూంటే మనం మళ్ళీ దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది..." అని. ఎంత ఆనందం వేసిందో. నా బ్లాగ్ చదువుతున్నందుకు కాదు. బ్లాగ్ వల్ల దూరమైన స్నేహితులు కూడా మళ్ళీ దగ్గరౌతున్నందుకు. తనలాగే ఈ మధ్యన దూరాల్లో ఉన్న ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ "నీ బ్లాగ్ చదువుతున్నాం రెగులర్ గా. చాలా బాగుంది. నీ కబుర్లు కూడా తెలుస్తున్నాయి..." అని ఫోన్ లో చెప్పారు.

బ్లాగ్ వల్ల ఇతర ఉపయోగాల సంగతి ఎలా ఉన్నా దూరమైన స్నేహితులను కూడా కనక్ట్ చేసే శక్తి బ్లాగ్ కి ఉంది అని అర్ధమైంది. వెరీ నైస్ కదా. కామెంట్లు వస్తే ఏంటి రాకపోతే ఏంటి? నా ప్రియమైన స్నేహితులు చదివి నాకు ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. మళ్ళీ దగ్గరౌతున్నారు. అంతకన్నా ఏం కావాలి? నిన్న శారద మైల్ చదివాకా అన్పించింది " NOKIA...connecting people" అయితే "BLOG...connecting friends" అని.