సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Tuesday, December 21, 2010
చిత్రమాలికలో - The Sound of Music(1965)
నాకిష్టమైన సినిమాల్లో ఒకటైన "The Sound of Music" గురించి చాలా రోజుల్నుంచీ రాయాలని. ఇన్నాళ్ళకు కుదిరింది. ఈ సినిమా గురించి నేను రాసిన ఆర్టికల్ ఇక్కడ చదవండి.
---------------------------
అదే ఆర్టికల్ ఇక్కడ క్రింద:
సినిమాను అర్ధం చేసుకుని, ఆస్వాదించేంత ఊహ వచ్చాకా నేను థియేటర్ లో చూసిన మొదటి ఇంగ్లీష్ సినిమా "The Sound of Music". ఇప్పటికీ నా ఫేవరేట్ సినిమాలో ఒకటి. 1965లో "38వ ఆస్కార్ బెస్ట్ పిక్చర్"గా అవార్డ్ అందుకున్న ఈ సంగీతభరితమైన చిత్రం ఏభైఏళ్ల తరువాత కూడా సినీసంగీత ప్రేమికులను ఆకట్టుకుంటూనే ఉంది. 1959లో అప్పటి ప్రముఖ సంగీతరూపకకర్తలైన Richards Rodgers మరియు Oscar hammerstein II బ్రాడ్వే మ్యూజికల్ థియేటర్ కోసం సంయుక్తంగా రచించిన సంగీతరూపకం The Sound of Music. "జార్జ్ లుడ్విగ్ వోన్ ట్రాప్" అనే మిలిటరీ కేప్టెన్ జీవిత కథ ఈ సంగీతరూపకానికి ఆధారం. ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్న ఈ సంగీతరూపకాన్ని 1965లో Robert Wise తానే దర్శక నిర్మాణ బాధ్యతలు చేపట్టి సినిమాగా తీసి 20th century fox ద్వారా విడుదల చేసారు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు చేస్తూ ఈ సినిమా అఖండ విజయాన్ని చవిచూసి కాసుల వర్షం కురిపించింది. అంతర్జాతీయ ప్రఖ్యాతిని సంపాదించుకున్న ఈ సినిమా వందేళ్ళ ప్రపంచసినీ చరిత్రలో నూరు గొప్పచిత్రాల్లో ఒకటిగా నిలిచింది. "వన్ ఆఫ్ థ బెస్ట్ మ్యూజికల్స్ ఎవర్ మేడ్" అనిపించుకుంది.
దక్షిణ జర్మనీ కి చెందిన ఆస్ట్రియాలోని "సాజ్బర్గ్" అనే పట్టణంలోని "వోన్ ట్రాప్" అనే మిలిటరీ కెప్టెన్ జీవితకథ The Sound of Music చిత్ర కథకు ఆధారం. ఆస్ట్రియన్ నేవీ నుండి రిటైరైన కమాండర్ జార్జ్ లుడ్విగ్ వోన్ ట్రాప్. భార్యను పోగొట్టుకున్న అతనికి ఏడుగురు సంతానం. ఆర్మీ కెప్టెన్ కావటం వల్ల పిల్లలను కూడా క్రమశిక్షణతో కట్టుదిట్టంగా పెంచుతూ ఉంటాడు. అయితే అతని కట్టుదిట్టమైన పెంపకం ఇష్టంలేక అల్లరిగా తయారైన అతని ఏడుగురు పిల్లలను చూసుకోవటానికి కెప్టెన్ తీసుకువచ్చే గవర్నెస్ లు ఎవ్వరూ ఆ పిల్లల అల్లరిని భరించలేక పారిపోతూ ఉంటారు. కొత్త గవర్నెస్ కోసం ఒక మొనాస్ట్రీ లోని మదర్ కు లెటర్ పంపుతాడు కెప్టెన్.
నన్ గా మారటానికి ఆ మొనేస్ట్రీ లో చేరుతుంది మరియా. కానీ అక్కడి కట్టుబాట్లతో ఇమడలేకపోతూ ఉంటుంది. అమెదొక స్వేచ్ఛా ప్రపంచం. ఆమె మనసుని అర్ధం చేసుకున్న మదర్ మార్పు కోసం ఆమెను కెప్టెన్ ఇంటికి కొత్త గవర్నెస్ గా పంపిస్తుంది. అక్కడ పిల్లలు ఆమెను బెదరగొట్టడానికి పెట్టే తిప్పలు నవ్వు తెప్పిస్తాయి. నెమ్మదిగా తన సంగీతంతో, వాత్సల్యంతో పిల్లలకు దగ్గరౌతుంది మరియా. వారిలో ఒకరిగా కలిసిపోయి కెప్టెన్ నియమించిన రూల్స్ అన్నింటినీ మార్చేసి, పిల్లలకు స్వేచ్ఛాపూరిత ప్రపంచాన్ని చూపిస్తుంది మరియా. ఆమెలో మాతృత్వ వాత్సల్యంతో పాటూ తాము ఎన్నడూ చూడని సరదాలను, కొత్త అనుభూతులను చవిచూస్తారు పిల్లలు. ఆమె వల్లనే పిల్లలు క్రమశిక్షణ తప్పుతున్నారని మరియాను మందలిస్తాడు కెప్టెన్. అయితే ఆమెలోని చలాకీతనానికీ, సంగీత పరిజ్ఞానానికీ అతడు ముగ్ధుడౌతాడు. ఎల్సా తో ఎంగేజ్మెంట్ అవబోతున్న కెప్టెన్ పై తన మనసు మళ్ళుతోందని అర్ధమైన మరియా అది నన్ గా మారాలనుకుంటున్న తన నిర్ణయానికి విరుధ్ధమని భావించి ఇల్లు విడిచి తిరిగి మొనాస్ట్రీకు వెళ్పోతుంది.
మరియా వెళ్పోయాక తన మనోభావాలను స్పష్టం చేసుకున్న కెప్టెన్ తాను ఎల్సాకు తాను మరియాను ప్రేమిస్తున్నట్లుగా చెప్పి ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుంటాడు. మరియా కోసం మొనాస్ట్రీ కు వెళ్తాడు కెప్టెన్. మనసు చలించే చోటికి తానిక వెళ్లనని అంటుంది మరియా. కానీ మదర్ బలవంతం మీద కొత్త గవర్నెస్ వచ్చేదాకా ఉండటానికి ఒప్పుకుని బయల్దేరుతుంది. కెప్టెన్ ఆమెను పెళ్ళికి ఒప్పించగలుగుతాడా? ఆర్మీ నుంచి వచ్చిన పిలుపును తప్పించుకోవటానికి కెప్టెన్ ఏం చేసాడు? సజ్బర్గ్ మ్యూజిక్ ఫెస్టివల్ లో వోన్ ట్రాప్ కుటుంబం పాల్గొనగలిగారా? నాజీ ఆర్మీ నుంచి తప్పించుకుని ఆ కుటుంబం ఎలా ఆస్ట్రియా దాటివెళ్తారు అన్నది మిగిలిన కథ.
కొన్ని సన్నివేశాల తాలూకూ యూట్యూబ్ వీడియో ఇక్కడ
సినిమలో ప్రధాన ఆకర్షణ సంగీతం. 1959లో Richards Rodgers మరియు Oscar hammerstein II సంయుక్తంగా బ్రాడ్వే మ్యూజికల్ థియేటర్ కోసం రూపొందించిన సంగీతరూపకం The Sound of Musicలోని పాటల బాణీలనే సినిమాలో కూడా వాడుకున్నారు. అయితే సినిమా రిలీజయ్యే hammerstein చనిపోవటంతో మరో రెండు పాటలను చిత్రం కోసం Rodgers తానే రాసి బాణీ కట్టారు.
టైటిల్ సాంగ్ :
"The hills are alive with the sound of music
With songs they have sung for a thousand years
The hills fill my heart with the sound of music
My heart wants to sing every song it hears",
వెస్ట్రన్ సంగీత స్వరాలను వర్ణించే
"Doe, a deer, a female deer
Ray, a drop of golden sun
Me, a name I call myself
Far, a long, long way to run
Sew, a needle pulling thread",
మరియా ఫేవరేట్ థింగ్స్ ..
"Raindrops on roses and whiskers on kittens
Bright copper kettles and warm woolen mittens
Brown paper packages tied up with strings
These are a few of my favorite things",
మదర్ ఎబెస్ పాడే
"Climb every mountain,
Search high and low,
Follow every byway,
Every path you know.",
కెప్టెన్ ప్రేమని తెలిపినప్పుడు మరియా పాడే
"Perhaps I had a wicked childhood
Perhaps I had a miserable youth
But somwhere in my wicked, miserable past
There must have been a moment of truth
For here you are, standing there, loving me
Whether or not you should
So somewhere in my youth or childhood
I must have done something good",
మొనాస్ట్రిలో నన్స్ పాడే "How to solve a problem like maria",
పిల్లలు పాడే "So Long, Farewell",
ఇంకా "iam sixteen going on seventeen",
"Edelweiss" మొదలైన అన్ని పాటలు కూడా సంగీతం, సాహిత్యం రెండింటిలోనూ వేటికవే సాటి. ఈ సినిమా కథ ఇన్స్పిరేషన్ తో పాతిక ఆంగ్లేతరభాషల్లో మరో పాతిక సినిమాలు విడుదలయ్యాయి. తెలుగులో శాంతినిలయం(1969), తరువాత తీసిన "రావుగారిల్లు" సినిమా, రాజా చిన్ని రోజా(ఇది డబ్బింగ్ సినిమా అనుకుంటా), హిందీలో గుల్జార్ తీసిన "పరిచయ్"(ఇందులో టీచర్ జీతేంద్ర . అంతే తేడా) మొదలైన సినిమాలకు Sound of Music సినిమా కథే ఆధారం. ఇళయరాజా, రెహ్మాన్ కూడా ఈ పాటల బాణిలను తమ సొంత బాణిలల్లో వాడుకున్నారు.
65లో ఐదు ఆస్కార్లు గెలుచుకున్న ఈ సినిమా మరెన్నో చోట్ల నామినేషన్లు, ప్రశంసలు పొందింది. సినిమాలో కెప్టెన్ గా "క్రిష్టఫర్ ప్లమ్మర్" నటించారు. మదర్ ఎబెస్ గా "పెగ్గి వుడ్" నటించారు. మరియాగా నటించిన "జూలీ ఏండ్రూస్" సినిమాలో పాటలు స్వయంగా పాడిన గాయని కూడా కావటంతో సినిమాకు జూలీ ఏండ్రూస్ సగం ప్రాణం. Ted D.McCord చేసిన సినిమాటోగ్రఫీ కూడా గొప్పగా ఉంటుంది. అప్పట్లోనే 70mm లో తీసిన ఈ చిత్రంలోని లొకేషనల్ అందాలు మనసు దోస్తాయి. సినిమా మొదట్లో స్క్రీనంతా నిండుకున్నట్లున్న పచ్చని కొండలు, గ్రీనరీ నుంచీ సినిమా చివర్లో కనిపించే ఆల్ఫ్ మంచు కొండలు వరకూ ప్రతి ఫ్రేమ్ అందమైనదే. చాలా సార్లు సినిమా చూసి ఉండటంతో పాటల సాహిత్యం అంతా కంఠతా నాకు. ముఖ్యంగా "Do-Re-Mi", "My favourite Things" నాకు చాలా ఇష్టమైన పాటలు.
ఒక యదార్ధ జీవితకథ, చక్కని పాటలు, పాత్రలలో కనిపించే రకరకాల భావోద్వేగాలు,గుర్తుండిపోయే సన్నివేశాలతో ఈ సినిమా చూసిన ప్రతివారికీ తప్పక నచ్చుతుందని నా అభిప్రాయం. సినీప్రేమికులందరూ తప్పక కొని దాచుకోవాల్సిన మంచి సినిమా. ఈ సినిమాలోని పాటల బిట్స్ క్రింద చూడండి.
Subscribe to:
Posts (Atom)