శ్రీమహా విష్ణువు ఎప్పుడూ గుర్రు పెట్టిన దాఖలాలు లేవు. లేకపోతే ట్వెంన్టీఫోర్ అవర్సూ లక్ష్మీదేవికి ఎంత డిస్టర్బెన్స్...!! "గుర్రు". ఎవరుపెట్టారో కానీ భలే పేరు పెట్టారు. "గుర్రు"కు ఇంతకన్నా మంచి పేరు దొరకదేమో.
చిన్నప్పుడూ ఓ రోజు మేం స్కూల్ నుంచి వచ్చేసరికీ హాల్లో ఓ బేగ్ ఉంది. ఎవరో చుట్టాలు వచ్చారని చాలా సంబరపడుతూ అమ్మని అడిగాం ఎవరొచ్చారమ్మా అని. ’బొజ్జతాత’ వచ్చారు అండి అమ్మ. "బాబోయ్" అన్నాం వెంఠనే. తప్పు అలా అనకూడదు అని అమ్మ మందలించింది. బొజ్జతాత అనే ఆయన మా తాతయ్యకు వరసకు తమ్ముడు అవుతారు. పేద్ద బొజ్జ ఉండేదని బంధువుల్లో ఆ పేరు ఖాయం అయ్యిందాయనకు. ఈయన రెండు విషయాలకు ఫేమస్. ఆయనకు రెండడుగుల దూరానికి వెళ్ళగానే విపరీతమైన సిగరెట్టు కంపు. రాత్రికి ఆయన ఏ ఇంట్లో బస చేస్తే వాళ్ళకి నిద్ర ఉండదు. అంత భయంకరమైన గుర్రు పెట్టేవారాయన(పాపం ఇప్పుడు లేరు). మా ఇంట్లో కానీ బంధువుల్లో కానీ ఎవరికీ సిగరెట్ అలవాటు లేకపోవటం వల్ల నాకు ఆ వాసనకు అస్సలు పడదు. ఇక రాత్రి పూటలు చీమ చిటుక్కుమన్నా మెలుకువ వచ్చేసే నిద్ర నాది. మెలుకువ వస్తే ఓ పట్టాన ఇక ఆ పూట నిద్ర అయినట్లే.
ఎవరన్నా వస్తే హాల్లో నవారు మంచం వేసి పక్క వేసే డ్యూటీ నాది. బొజ్జతాతగారికి పక్క వేసేంతలో ఆయన వచ్చేసారు. ఏమ్మా బాగున్నావా? అని దగ్గరగా వచ్చి బుగ్గలు లాగారు. కంపు కంపు...! ఎలాగో తప్పించుకుని లోపలికి పరిగెట్టా. ఇక రాత్రికి భయంకరమైన గుర్రు...పాపం ఆయనను మాత్రం ఏం అంటాం. ఎవరి అలవాట్లు వారివి. మనకు గిట్టకపోతే మన ప్రోబ్లం. రెండు రోజులూ ఉండి, వచ్చిన పని అయ్యాకా మా ఆతిధ్యాన్ని మెచ్చుకుంటూ వెళ్పోయారాయన.
కొన్నాళ్ళ తరువాత ఓ రోజు స్కూల్ నుంచి రాగానే అమ్మ మమ్మల్ని కూర్చోపెట్టి టేప్రికార్డర్లో ఓ కేసెట్ పెట్టి ఇదేమిటో కనుక్కోండే అంది. చెప్పుకోవాలని చాలా ప్రయత్నించాం కానీ చెప్పలేకపోయాం. తగ్గుతోంది హెచ్చుతోంది...ఒక విచిత్రమైన సౌండ్ అది. మావల్ల కాదు కానీ అదేమిటో చెప్పమ్మా అన్నాం. "కొన్ని రోజులుగా మీ నాన్న గుర్రు పెడుతున్నారు. చెప్తే నమ్మటం లేదు. నేనేమిటి గుర్రేమిటి అని. అందుకని గుర్రు పెడుతూంటే రికార్డ్ చేసాను" అంది. నాన్న గుర్రు పెడుతున్నారా? ఆశ్చర్యపడీపోయాం. గుర్రు అంటే ఎవరో పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు మాత్రమే పెడతారని మా అభిప్రాయం. అదిమొదలు క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే ఇదేమిటో చెప్పుకోండి అని ఆ కేసెట్ వినిపించేవాళ్ళాం. అప్పటి నుంచీ మా ఇంట్లో కూడా గుర్రు మొదలైంది.
అత్తగారింట్లో మొదటి రోజు మధ్యలో మెలుకువ వచ్చింది. కొత్త కదా అనుకునేలోపూ పక్కనుంచి గుర్రు వినబడింది. అమ్మో ఈయన గుర్రు పెడతారా...అనుకునే లోపూ మరో రెండూ మూడూ గుర్రు సౌండ్లు వినిపించాయి. బాబోయ్ వీళ్ళింట్లో అందరూ గురక పెడతారన్న మాట...అనుకున్నా. మిగతావాళ్ళ సంగతి సరే ఏం చెయ్యలేం. పక్కనున్న పతిదేవుడి సంగతి ఏమిటో అనుకున్నా. కొన్నాళ్ళకు సౌండ్ తీవ్రమైనప్పుడల్లా కాస్త కదిపితే (టేప్ రికార్డర్ సౌండ్ తగ్గించినట్లు)మళ్ళీ సౌండ్ తగ్గుతుంది అని తెలుసుకున్నా. ఇక ఆ సిస్టం ఫాలో అవటం మొదలెట్టా. కాస్త రిలీఫ్. కానీ అప్పుడప్పుడూ ఆఫీస్ వర్క్లోడ్ ఎక్కువ ఉన్నప్పుడూ ఈ గుర్రు సౌండ్ మరీ పెరిగిపోతుంది. నాకు మెలుకువ వచ్చేసి ఇక నిద్ర పట్టనంత. మధ్యలో సౌండ్ తగ్గించటానికి కదిపినా అయ్యగారి నిద్రకు ఏం ఆటంకం కలగదు. పిలిస్తే వస్తుంది నిద్రాదేవి ఆయన దగ్గరకు. శలవురోజు మధ్యాహ్నం అయినా సరే ఓ కునుకు పట్టిందంటే "గుర్రు" లేకుండా నిద్ర అవ్వదు.
ఆమధ్యన ఓసారి మధ్యాహ్నం అమ్మావాళ్ళింటికి వెళ్లా. అన్నయ్య నిద్రపోతున్నాడు. ఎక్కడనుంచో పెద్ద గుర్రు వినిపిస్తోంది. ఎవరూ?పక్కింట్లోంచా? అన్నా. "ఇంకెవరూ మీ అన్నయ్యే..." అంది వదిన. "పాపం వదిన" అనుకున్నా మనసులో. రాత్రి మెలుకువ వచ్చేసింది. పక్కన అమ్మ నాన్న కన్నా పెద్ద గుర్రుపెడుతోంది. ఇదేంటి నాన్నా అనడిగా పొద్దున్నే. 'ఈమధ్యనే అప్పుడప్పుడూ పెడుతోందే. అలసట ఎక్కువైపోయీ...' అన్నారు.
ఆమధ్యన ఓసారి మధ్యాహ్నం అమ్మావాళ్ళింటికి వెళ్లా. అన్నయ్య నిద్రపోతున్నాడు. ఎక్కడనుంచో పెద్ద గుర్రు వినిపిస్తోంది. ఎవరూ?పక్కింట్లోంచా? అన్నా. "ఇంకెవరూ మీ అన్నయ్యే..." అంది వదిన. "పాపం వదిన" అనుకున్నా మనసులో. రాత్రి మెలుకువ వచ్చేసింది. పక్కన అమ్మ నాన్న కన్నా పెద్ద గుర్రుపెడుతోంది. ఇదేంటి నాన్నా అనడిగా పొద్దున్నే. 'ఈమధ్యనే అప్పుడప్పుడూ పెడుతోందే. అలసట ఎక్కువైపోయీ...' అన్నారు.