సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, October 23, 2010

రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ - 3 !!

రెండవ భాగం తరువాయి...

ramam performing first programme
శ్రీరామ్మూర్తి లాంటి వాళ్లకోసమే అన్నట్లు ఆకాశవాణిలో "యువవాణి" విభాగం కొత్తగా దేశవ్యాప్తంగా మొదలైంది. ప్రతి శుక్రవారం ఉదయం విజయవాడ కేంద్రo నుంచి ఒక యువ శ్రోత తనకు నచ్చిన ఎనిమిది పాటలు వ్యాఖ్యానంతో సహా వినిపించే ప్రత్యేక అవకాశం వచ్చింది. దానిలో భాగంగానే శ్రీరామ్మూర్తికీ ఒక ప్రోగ్రామ్ చేసే అవకాశం వచ్చింది. తను మద్రాస్ లో ఉండగా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కోసం తయారుచేసి పెట్టుకున్న స్క్రిప్ట్ లు ఎప్పుడు అతని దగ్గర రెడిగా ఉండేవి. అందులో ఒకటి "మూడ్స్ అండ్ మ్యూజిక్". ఒకరోజు సాయంత్రం విజయవాడ కేంద్రంలో మ్యూజిక్ ప్రొడ్యూసర్, ప్రముఖ కర్ణాటక సంగీట విద్వాంసులు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారితో ఈవెనింగ్ వాక్ చేస్తూ ఈ కాన్సెప్ట్ గురించి చెప్పే అవకాశం దొరికింది శ్రీరామ్మూర్తికి. అది ఎంతో శ్రధ్ధగా విన్న ఓలేటిగారు "బావుంది. ఇది మా స్టేషన్కే కొత్త ఐడియా.యువవాణిలో ఓ అరగంట దీని మీద ప్రోగ్రామ్ చేయండి" అని, అప్పటి యువవాణి విభాగం అధినేత శంకరనారయణగారికి( ప్రముఖ చిత్రకారులు, దర్శకులు బాపు గారి సొదరుడు) పరిచయం చేసారు. ఆ ప్రోగ్రాం పేరు "భావనా సంగీతం". ఎవరో కుర్రకళాకారుడు అని తీసిపారేయక తానే స్వయంగా లైబ్రరికి వచ్చి కావాల్సిన రికార్ద్లన్నీ తీయించి ఇచ్చి, ఆ ప్రోగ్రాంకి పరిచయ వాక్యాలు కూడా తానే చదివి దగ్గరుండి ఆ కార్యక్రమం తయారు చేయించారు శ్రీ ఓలేటి. విజయవాడ, హైదరబాద్ రెండు కేంద్రాల నుంచీ ఒకేసారి ప్రసారమైన ఈ కార్యక్రమానికి ప్రముఖుల ప్రశంసలు లభించటమే కాక B-high grade కూడా లభించింది. అప్పట్లో అదొక రికార్డ్. అందుకే ఆ కార్యక్రమం మళ్ళీ ఎన్నోసార్లు ప్రసారం చేసారు విజయవాడవారు.


aparanji arts, E.S.murthy from left
ఇక రేడియోనే తన తదుపరి మజిలీ అని నిర్ణయించుకున్నాడు శ్రీరామ్మూర్తి. కాకినాడ తిరిగి వచ్చి తన మిత్రుడు, గాయకుడు, గిటారిస్ట్, రచయిత, కంపోజర్, దేవరకొండ బాల గంగాధర తిలక్ గారి మేనల్లుడు అయిన ఈ.ఎస్.మూర్తి తో కలిసి "అపరంజి ఆర్ట్స్ అసోసియేషన్" పేరుతో ఎన్నో యువవాణి కార్యక్రమాలు ఇచ్చాడు. అవన్నీ పున: పున: ప్రసారం అవుతూనే ఉండేవి. (ఆ తరువాత కాలంలో ఈ.ఎస్.మూర్తి తన మద్రాసు ప్రస్థానంలో కొంతకాలం బాలు దగ్గర, ఎంతో కాలం సంగీత దర్శకులు ఎస్.ఏ.రాజ్ కుమార్ దగ్గర కంపోజింగ్ అసిస్టెంట్గా పనిచేసారు.) కార్యక్రమానికి వెళ్ళిన ప్రతిసారీ విజయవాడ కేంద్ర ముఖ్య కార్యక్రమ నిర్వాహకులు రఘురాం గారు ఈ కాకినాడ బేచ్ ని గేట్ దాకా సాగనంపి మళ్ళీ మంచి ప్రోగ్రాం తీసుకురండి అని వీడ్కోలు పలికేవారు. టాలెంట్ ఉన్న యువశక్తిని ప్రోత్సహించే సుగుణం ఆనాటి పెద్దల్లోనే ఉండేది. ఈ ప్రోత్సాహమే 1970లో విశాఖపట్నంలోనూ, 71లో హైదరబాద్ వివిధభారతిలో కేజువల్ అనౌన్సర్ గా పని చేసే అవకాశాన్నిచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ లో పనిచేస్తున్న కాలంలో ప్రముఖ వేణుగాన విద్వాంసులు కీ.శే. ఎన్.ఎస్.శ్రీనివాసన్, వారి సతీమణి, నాటక విదుషీమణీ శ్రీమతి శారదా శ్రీనివాసన్ చూపిన ఆదరణ, వాత్సల్యం అతని జీవితంలో ఎప్పటికీ మరువలేనివి.




రామానికి పదేళ్లప్పుడు జరిగిన వాళ్ళ అక్క పెళ్ళి తరువాత చేరువైన బావగారి కుటుంబం అతని కుటుంబంగా మారింది. బంధుత్వాలు, వాటి ఆప్యాయతలూ ఎరుగని ఒంటరితో మచ్చిక చేసారు వారంతా. 1970లో తన బావగారి చెల్లెల్లినే ఇచ్చి పెళ్ళి చేస్తానన్నారు మామగారు. సరైన ఉద్యోగం లేదని రామం తాత్సారం చేసినా ఇరిపక్షాల వత్తిడితో వివాహానికి అంగీకారం తెలిపాడు అతను. ఇద్దరి పేర్లు, మనసులు కలిసాయి. సీతారాములు ఒకటైయ్యారు. సంసారసాగరం మొదలైంది. పేరుకు తగ్గట్టుగానే ఎంతో సహనవతి, అనుకూలవతి సీత. అన్యోన్యదాంపత్యం అంటే వాళ్ళిద్దరిదే అనిపించేది అందరికీ. రేడియోనే జీవితంగా బ్రతికే అతని మనసుని అర్ధం చేసుకుని, పిల్లల చదువులు మొదలు ఇంటి బాధ్యతలు అన్నీ తానే చూసుకునేది సీత. ఇల్లు మారితే "డ్యూటీ అయ్యాకా ఆఫీసు నుంచి ఫలానా అడ్రస్కు వచ్చేయండి" అంటే అక్కడికి వెళ్ళటం మినహా రామం మరేమీ చేయాల్సిన అవసరం ఉండేది కాదు.

పర్మనెంట్ అనౌన్సర్ గా సెలక్ట్ అయిన తరువాత శ్రీరామ్మూర్తి ప్రస్థానం ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి మారింది.1972 నుంచీ 2002 వరకూ పర్మనెంట్ సీనియర్ గ్రేడ్ అనౌన్సర్ గా శ్రీరామ్మూర్తి జీవితం నిరాటంకంగా కొనసాగింది. అనౌన్సర్ గా డైలీ షిఫ్ట్లు చేస్తూనే సినిమా సంగీతం పైన, లలిత సంగీతం పైన, వాద్య సంగీతాల పైన ఎన్నో కార్యక్రమాలు "రామం" పేరుతో రూపొందించాడు అతను. వారానికో శీర్షిక ఎంచుకుని అనువైన పాటలు, ఆకట్టుకునే వ్యాఖ్యానంతో "సరాగమాల" కార్యక్రమం కొనసాగింది కొన్ని సంవత్సరాలు. తన కాలేజీరోజుల్లో "ఆంధ్రసచిత్రవారపత్రిక"లో సినిమా సంగీతం పైన సరాగమాల పేరుతో వి.ఏ.కె.రంగారావు గారు నిర్వహించిన కార్యక్రమానికి గుర్తుగా ఆ పేరే ఈ కార్యక్రమనికి కూడా పెట్టుకున్నాడు రామం. తరువాత రేడియో సిలోన్ లో "అమీన్ సయానీ" వారం వారం సమర్పించే బినాకా గీత్ మాలా క్రమం తప్పకుండా విని ఆయన ఒరవడిని ఆకళింపుచేసుకున్న రామం ఆయన అడుగుజాడల్లోనే తెలుగులో కూడా అలాంటి కార్యక్రమం శ్రోతలకు అందించాలని "ఇంద్రధనసు" అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు అతను.


ప్రతివారం ఒక సంగీత వాయిద్యాన్ని పరిచయం చేస్తూ దాని రూపురేఖలు, పుట్టు పూర్వోత్తరాలూ వివరిస్తూ, దాన్ని శాంపిల్ గా వినిపిస్తూ, అదే వాయిద్యాన్ని వివిధ సంగీత దర్శకులు తెలుగు పాటల్లో ఎలా వినియోగించారో శోదాహరణాత్మకంగా చెబుతూ "ఇంద్రధనసు" కార్యక్రమాన్ని రూపొందించేవాడు రామం. వారం వారం వందలాది శ్రోతల ఉత్తరాలు ఉత్తరాల కార్యక్రమాన్ని ముంచెత్తేవి. రేడియో స్టార్ రామాన్ని చూడటానికి విజయవాడ కేంద్రానికి, కొందరు రామం ఇంటికి కూడా వస్తూనే ఉండేవారు. ఇక గ్రీటింగ్ కార్డ్లు, బహుమతులు, పార్సిల్స్ లెఖ్ఖే లేదు. భారతీయ వాయిద్యాలైన వీణ, వేణువు, సితార్, సంతుర్, షహనాయ్ వంటి వాయిద్యాలే కాకుండా పాశ్చాత్య వాయిద్యాలైన ఎకార్డియన్, గిటార్, ట్రంపెట్, సాక్సో ఫోన్, మాన్డొలీన్, మౌత్ ఆర్గాన్ వంటి అనేక వాద్యాల గురించి ఎంతో ఆసక్తికరంగా వివరించే ఈ కార్యక్రమం తెలుగు సినీగీతాల కూర్పుతో 25వారాల పాటు దిగ్విజయంగా కొనసాగింది. 25వ వారం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా చేసాడు రామం. (హిందీలో అమీన్ సయానీ దాదాపు 25 సంవత్సరాల పాటు నిర్వహించిన బినకా గీత్ మాలా నే దీనికి స్ఫూర్తి.) ఆఖరు రోజు శ్రొతలందరూ ఆనంద భాష్పాలతో కన్నీటి వీడ్కోలు ఇచ్చారు. ఆ రోజును ఇప్పటికీ తలుచుకుంటున్న శ్రోతలు ఇంకా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు శ్రోతలు ఆ వీడ్కోలు కార్యక్రమంలో ప్రత్యక్ష్యంగా పాల్గోవాలని రేడియో రామం ఒక ఇంద్రజాలం చేసాడు. అది ఆకాశవాణి చరిత్రలోనే వినూత్న ప్రయోగం.


అదేమిటంటే, అరగంట ప్రోగ్రాం కొద్ది నిమిషాల్లో పూర్తవుతుందనగా శ్రోతలని రేడియో సెట్ల దగ్గరకు ఆహ్వానించాడు రామం. మీ ఎడమ చేయి రేడియో సెట్ మీద పెట్టి, కుడి చేయి గాల్లో ఎడమ నుంచి కుడికి మూడుసార్లు అడ్డంగా కదపండి అని 1,2,3 చెప్పాడు రామం. నలభై కిలోమీటర్ల పరిధిలో వివిధ భరతి వింటున్న శ్రోతలందరూ రామం చెప్పినట్లే మంత్ర ముగ్ధుల్లా ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ తో అతను చెప్పినట్లే చేసారు. "చూసారా..మీకు తెలీకుండానే ఇంద్రధనసు కు వీడ్కోలు చెప్పేసారు.." అని నవ్వుతూ చమత్కరించాడు రామం. ఆ కాసేపూ తను ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ అయ్యాడు. వివిధభారతి శ్రోతలంతా ప్రేక్షకులయ్యారు. ఈ ట్రిక్లో పాల్గొన్న శ్రోతలు మహదానందంతో మళ్ళీవారం ఉత్తరాల వర్షం కురిపించారు. ఆ రకంగా ఇంద్రధనసు ఆకాశవాణిలో చరిత్ర సృష్టించింది.


దాని తరువాత కొన్ని సంవత్సరాలపాటు "సంగీత ప్రియ" కార్యక్రమం రాజ్యమేలింది. ఇందులో ముఖ్యమైన ఆకర్షణ "singing partners" అనే అంశం. ఈనాటి టి.వి. "పాడుతా తీయగా"కు 30 ఏళ్లకు ముందే రామం ఈ అంశాన్ని ప్రవేశపెట్టాడు. అటు సినీమా ఫీల్డ్ కు వెళ్ళలేకపోయినా, ఇటు రేడియో సంగీతానికి అర్హత పొందలేకపోయినా, ఇంట్లో అద్భుతంగా పాటలు పాడే యువ కళాకారుల్ని వెతికి పట్టుకుని వారిచేత వివిధభారతిలో అద్భుతమైన పాటలు పాడించిన ఘనత రామానిదే. దానితో పాటూ కొంతమంది వాద్య కళాకారులను కూడా సంగీతప్రియ ద్వారా పరిచయం చేసాడు రామం. కీబోర్డ్ ఇన్స్ట్రుమెంట్ రేడియోలో ప్రవేశించక ముందే వివిధభారతిలోని సంగీతప్రియ ద్వారా శ్రోతలను చేరిందంటే ఆశ్చర్యపడక తప్పదు.

రాత్రి పన్నెండు దాకా స్క్రిప్ట్ రాసుకుని, పొద్దున్న రేడియో స్టేషన్ తెరిచ గానే రికార్డింగ్ మొదలుపెట్టి, పదింటికల్లా పూర్తి చేసి టేప్ అప్పజెప్పి వచ్చేవాడు. ఇలాంటి అన్ని ప్రోగ్రాంల వెనుకా అన్ని సంవత్సరలూ రామం సతీమణి సీత అందించిన సహకారమే అతన్ని ముందుకు నడిపించింది - ఎందుకంటే తన ప్రతి కార్యక్రమానికీ ప్రధమ శ్రోత, క్రిటిక్ సీతే కనుక. ఈ కార్యక్రమాలన్నింటి ద్వారా మధ్యాహ్నం పన్నెండు అయ్యేసరికల్లా వివిధభారతి శోతల్ని రేడియో దగ్గరకి లాక్కొచ్చి కూచోపెట్టిన ఖండవిల్లి రావుడు, "రేడియో రామం" గా స్థిరపడిపోయాడు.

(మూడవ భాగం పూర్తి...)