కొన్నాళ్ళ క్రితం ఒక రాత్రి మా ఇంటికి ఐదారిళ్ళ అవతల డాబా మీద ఒక పార్టీ జరిగింది. అలా చాలా జరుగుతూ ఉంటాయి, అర్ధరాత్రి దాటాకా లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేసేస్తూంటారు. కానీ ఆ రోజు పన్నెండు, ఒంటిగంట, రెండు అయినా ఆ పార్టీ అవలేదు. లౌడ్ స్పీకర్లో అలా భీకర శబ్దాలు(వాళ్ళ దృష్టిలో అది పార్టీ మ్యూజిక్ అన్నమాట) వస్తూనే ఉన్నాయి. పిచ్చి పిచ్చి పాటల ఆ విపరీతమైన సౌండ్ వల్ల ఇంటిల్లిపాది నిద్రకు చాలా ఇబ్బంది కలిగింది. మావారు ఇక ఆగలేక "ఫలానా ఏరియలో పార్టి....ఈ ఏరియాలో అందరికీ ఇబ్బంది కలిగిస్తోంది" అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కాసేపటికి పోలీస్ వ్యాన్ సైరను వినబడింది, పార్టీ ఆగింది. ప్రభుత్వం అర్ధరాత్రి లౌడ్ స్పీకర్స్ పెట్టరాదు, పబ్లిక్ డిస్టర్బెన్స్ కూడదు అని ఎన్ని రూల్స్ పెట్టినా ఉపయోగంలేదు. ఎక్కడో అక్కడ ఇలా లౌడ్ స్పీకర్స్ వల్ల చుట్టుపక్క జనాలకు చికాకు కలుగుతూనే ఉంది.
నిన్న రాత్రి అలానే కాస్తంత దూరంలో మళ్ళీ పెద్ద సౌండ్‌లో పాటలూ గట్రా వినబడ్డాయి. స్కై షాట్స్ అవీ కాల్చారు. కానీ పన్నెండు దాటినా ఇంకా పాటలు ఆగలేదు.నిద్ర పట్టడం లేదు. ప్రాంతీయ జానపద పాటలు, కొత్త సినిమా పాటలు ఒకటేమిటి అన్నిరకాలూ వినబడుతున్నాయి. "ఎందుకే రమణమ్మా....", "రింగ రింగా...." ఇంకా ఏవో. కాసేపయ్యాకా మళ్ళి "రింగ రింగా..." అంటూ ఇంకా పెద్దగా వినబడింది. ఏదో పెళ్ళి కాబోలు అనుకున్నాము. ఊరేగింపు దగ్గరకు వచ్చినట్లుంది, కిటికీలు మూసేస్తే కాస్తైనా సౌండ్ తగ్గుతుంది అని కిటికీ దగ్గరకు వెళ్ళాను. దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఊరేగింపు వెళ్తోంది. మధ్య మధ్య ఆగి మైక్‌లో పాడుతూ వెళ్తున్నారు. గుంపుకి మధ్యన ఓపెన్ వ్యాను, అందులో వినాయక విగ్రహం....!! మతిపోయింది. నాకీ నవరాత్రి ఉత్సవాలు వద్దు బాబోయ్...ఇంకా పారిపోకుండా వినాయకుడు అందులోనే ఉన్నాడా? అని ఆశ్చర్యం కలిగింది... !
ఆ తరువాత "పాపం వినాయకుడు..!" అనిపించింది. జనాల మీద కోపం వచ్చింది. వాడ వాడలాదేవుడి పూజ చేస్తున్నారు. బాగుంది. సుభ్భరంగా భక్తి పాటలో, భజనో చేయకుండా ఈ చెత్త పాటలేమిటి? నేను విన్నది ఒక్కచోటే. ఇలాంటివి ఇంకెన్ని చోట్ల జరుగుతున్నాయో. చిన్నప్పుడు రామనవమి పందిళ్ళలోనూ, ఈలాటి గణేశనవరాత్రి రోజుల్లోనూ మైకుల్లో సినిమా పాటలు పెట్టడం ఎరుగుదును. కానీ ఇలా రోడ్డు మీద పబ్లిగ్గా రింగా రింగా పాటలు పాడుతూ నిమజ్జనానికి తీసుకువెళ్ళటం ఇదే మొదటిసారి నేను చూడటం. ఇంతకన్న ఘోరం లేదు అనిపించింది...ప్చ్...! పోలీసు బందోబస్తుల మధ్యన, అల్లర్ల మధ్యన, నిమజ్జనం అంటే ప్రాణాలు అరచేతిల్లో పెట్టుకుని రోడ్డేక్కే జనాలను చూసి, చెత్త సినిమాపాటల ఊరేగింపుల మధ్యన...పాపం వినాయకుడు...అని మరోసారి నిట్టూర్చాను. అంతకన్నా చేసేదేముంది ఇలా బ్లాగ్ లో ఘోషించటం తప్ప...!!
ఒక సైట్లో కనబడిన ఈ జోక్ బాగుందని ఇక్కడ పెడుతున్నను. ఈ ఫొటో ప్రచురణపై ఎవరికన్నా అబ్యంతరాలుంటే తొలగించబడుతుంది.