సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, September 5, 2010

సుల్తానా మిస్



ప్రతి టీచర్స్ డే కీ, ఏప్రిల్ 16 కీ నాకు గుర్తు వచ్చేది "
సుల్తానా మిస్". నా ఫేవొరేట్ టీచర్. మా 7th క్లాస్ మిస్. అన్ని సబ్జక్ట్స్ కూ ఆవిడే టీచర్. మేము స్కూల్లో అందరు టీచర్స్ నూ "మిస్" అనే పిలిచేవాళ్ళం. అందరూ మిస్సులే ఉండేవారు. (అంటే "సార్లు ఉండేవారు కాదు) నేను 7th క్లాస్ దాకా ఇంటికి దగ్గరగా ఉన్న ఒక క్రిష్టియన్ స్కూల్లో చదివాను. అక్కడ అంతదాకే ఉండేది. స్కూల్ పిల్లలందరికీ "సుల్తానా మిస్" అంటే భయమ్. చాలా స్ట్రిక్ట్, వెరీ డిసిప్లీన్డ్. చదువు విషయంలో ఏమాత్రం అలక్ష్యం సహించేవారు కాదు. అప్పట్లో ఫోటోలు తీసుకుని దాచుకోవాలి అనే తెలివితేటలు ఉండేవికాదు. గుర్తున్నంతమటుకు ఆవిడ సమానమైన ఎత్తులో, తెల్లగా, కాస్త ఎక్కువ బొద్దుగా, అందంగా ఉండేవారు. ఆవిడ మట్టెలకు మువ్వలు ఉండేవి. నడుస్తూంటే విచిత్రమైన శబ్దం వచ్చేది. ఆ మువ్వల సవ్వడి వినిపిస్తే ఆవిడ వచ్చేస్తున్నారని అర్ధం. పిల్లలందరూ గప్చుప్ అయిపోయేవారు. మా హెడ్మిస్ట్రెస్ కూడా సుల్తానా మిస్ కు చాలా అధికారాలు ఇచ్చేవారు.


మమ్మల్ని 6th క్లాస్ దాకా ఇంట్లోనే అమ్మ చదివించేది. 7th క్లాస్ కామన్ ఎగ్జామ్స్ ఉండేవి. అందుకని అప్పటి నుంచీ ట్యూషన్కు పంపించేది, మా 7th క్లాస్ మిస్ "సుల్తానా మిస్" దగ్గరకు. మేము బెజవాడలో సూర్యారావు పేటలో ఉండేవాళ్ళం. మిస్ ఇల్లు ఏలూర్ రోడ్డులో రామమందిరం ఎదురు సందులో ఉండేది. రిక్షాలు తెలియవు. అంత దూరం నడుచుకునే వెళ్ళేవాళ్ళం. 5.30-6pm నుంచీ 8.30-9pm దాకా ట్యూషనే. స్కూల్ నుంచి రాగానే ఏదో తినిపించేసి ట్యూషన్కు తోలేసేది అమ్మ. మాననిచ్చేది కాదు. 1st floorలో మిస్ వాళ్ళ ఇల్లు, ఆ పై మేడ మీద ట్యూషన్. మేడంతా పిల్లలతో నిండిపోయేది. వాళ్ళఇంట్లో మొత్తం ఐదుగురు సిస్టర్స్, తల్లి ఉండేవారు. ఇంకో అమ్మాయి, అబ్బాయి వేరే ఊళ్ళో ఉండేవారు. మిగిలిన వివరాలు మాకెవరికీ తెలియవు. ముగ్గురు సిస్టర్స్ మా స్కూల్లోనే చేసేవారు. మిగిలిన ఇద్దరూ మరో స్కూల్లో చేసేవారు. చాలా సాంప్రదాయమైన ముస్లిం ఫ్యామిలీ. మిస్ వాళ్ళ అమ్మగారు ట్యూషన్ పిల్లలందరినీ ఎంతో ప్రేమగా పలకరించేవారు. పరీక్షలుంటే అందరం లైన్లో వెళ్ళి ఆవిడ ఆశీర్వాదం తీసుకునేవాళ్ళం. అదో సామ్రాజ్యం. భయంతో పాటే ఆవిడంటే ఎంతో గౌరవం ఉండేది అందరికీ.

ఒకసారి ఏదో విషయంలో ఒక అమ్మాయి "ఉండు..మిస్ కు చెప్తాను నువ్విలా చేసావని" అని భయపెట్టింది. నాకు చాలా భయం వేసింది. ఎందుకనో మరి ధైర్యంగా ఆవిడ దగ్గరకు వెళ్ళి, "ఇలా జరిగిందండీ, తను మీతో చెప్తానని భయపెడుతోంది. మీఋ నన్ను కొడతారాండీ?" అని అడిగేసాను. ఆవిడ నవ్వేసి, "నిన్నెందుకు కొడతానురా...నీ గురించి నాకు బాగా తెలుసు...నువ్వు నా ఫేవొరేట్ స్టుడెంట్ వి" అంటూ దగ్గరగా తీసుకున్నారు. నాకు అదో అద్భుతం క్రింద తోచింది. స్కూలంతా భయపడే సుల్తానా మిస్ కు నేనంటే ఇష్టమా? ఆశ్చర్యం వేసింది. ఆనందం వేసింది. ఆ అభిమానాన్ని నేను చివరిదాకా కాపాడుకున్నాను.


పిల్లలందరమూ మంచి మార్కులు తెచ్చుకోవాలని సుల్తానా మిస్ శ్రమించేవారు. 7th క్లాస్ లో ఎగ్జామ్స్ ముందు రివిజన్ చేయించేవారు. పొద్దున్నే చదివితే బాగా గుర్తుంటాయి అని అందరూ పొద్దున్నే 4.30am లేచి చదవాలనీ, పేరెంట్స్ అందరూ పిల్లలు ఎన్నింటికి లేచారో,ఎంతదాకా చదివారో డైరీలో టైములు రాయమనేవారు. "నేను మీ ఇళ్ళకు వచ్చి చూడను. ఇది మీకోసమే. మీరు నన్ను మోసం చెయ్యాలని మీవాళ్ళతో తప్పు టైమింగ్స్ వేయించి తెస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే. నాకు ఒరిగేదేమీ లేదు." అని చెప్పారు. అందరం పొద్దున్నే లేచి చదివేవాళ్ళం. నాన్న అలారం పెట్టుకుని నన్ను లేపి చదువుతున్నానో, నిద్రోతున్నానో చెక్ చేస్తూ ఉండేవారు. ఆవిడ పుణ్యమా అని చదువు మీద ఆ శ్రధ్ధ ఇప్పటికీ ఉండిపోయింది నాకు. ఇంకా ఏదన్నా కోర్సు దొరికితే చదవటానికి నేనిప్పటికీ రెడీ.

పిల్లలకు చదువు పట్ల శ్రధ్ధ, ఆసక్తి కలిగించటమేకాక ఇతర విషయాల పట్ల కూడా అవగాహన ఉండేలాగ అన్ని కబుర్లూ మాతో చెప్తూ ఉండేవారు. ఏ స్టూడెంట్ ఏ సబ్జక్ట్ లో వీక్ గా ఉన్నాడో తెలుసుకుని అది బాగా అర్ధమయ్యేలా చెప్పి, ప్రత్యేక శ్రధ్ధ తీసుకుని చదివించేవారు. చాల అందంగా రాసేవారు. బహుశా నేను గుడ్ హేండ్ రైటింగ్ కూడా ఆవిడను చూసే నేర్చుకుని ఉంటాను. పిల్లలందరూ ఇంగ్లీష్ సరిగ్గా మట్లాడేలా నేర్పించేవారు. క్లాస్ లో ఒక బ్రైట్ స్టూడెంట్, ఒక వీక్ స్టూడెంట్, అలా ఆర్డర్లో కూర్చోపెట్టేవారు. తెలియనివి వెంఠనే తెలుస్తాయి, పక్కనున్నవాళ్ళను చూసి సగం నేర్చుకోవచ్చు అంటూండేవారు. పిల్లలందరూ ఆవిడ అనుకున్న ప్రకారం మార్కులు తెచ్చుకునేలా చూసేవారు. ఇంతకన్న బెస్ట్ టీచర్ ఉండరేమో అనిపించేది. స్కూల్ మారాకా కూడా నేను మరో రెండేళ్ళపాటు ఆవిడ దగ్గరకే ట్యూషన్కు వెళ్ళేదాన్ని. తరువాత ఇల్లు మారిపోయాకా దూరమైందని మానేసాను.

స్కూల్ వదిలి వెళ్ళిపోయిన ఐదారు బ్యాచ్ ల తాలుకూ పిల్లలు అందరూ మిస్ ను కలవటానికి వస్తూండేవారు. నేను కూడా ఇంటర్ అయ్యేదాకా కూడా ప్రతి ఏడూ ఏప్రిల్ 16 కి వెళ్ళి కలిసేదాన్ని. ఆ రోజు ఆవిడ పుట్టినరోజు. ఏమిటో నీకింకా గుర్తే అని నవ్వేవారు. "నా ఫేవొరేట్ స్టూడెంట్" అని అక్కడున్నపిల్లలందరికీ చెప్పేవారు. ఇంటర్లో "HSC" గ్రూప్ తీసుకున్నానంటే నేనూ లిటిరేచర్ స్టూడెంట్ నే అని సంతోషించారు. ఆ తరువాత స్కూల్ మారారనీ, ఊరు మారిపోయారని విన్నాను. ప్రయత్నించాను కానీ ఆచూకీ తెలియలేదు. గట్టిగా ప్రయత్నిస్తే దొరికేదేమో అనుకుంటూ ఉంటాను. ఇప్పుడెకడున్నారో తెలీదు. ఎక్కడున్నా ఆరోగ్యంగా, కుశలంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను. అటువంటి డిసిప్లీన్డ్ వ్యక్తిని, మంచి డేడికేటెడ్ టిచర్నూ నేను చదువుకున్నంత కాలం మళ్ళీ ఎక్కడా చూడలేదు. ఆవిడను చూసి నేను చాల నేర్చుకున్నాను. ఇప్పటికీ ప్రతి టీచర్స్ డే కీ, ఏప్రిల్ 16 కీ ఆవిడను తలుచుకుంటూనే ఉంటాను.