మనసు బాగున్నప్పుడు, బాగోనప్పుడు మనం మూడ్ కు సరిపడే సంగీతాన్ని వినటానికి ఇష్టపడతాము. కానీ మనసు బాగుందో బాలేదో తెలీని కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు నాకైతే కొత్త సినిమా పాటలు వినాలనే "దుర్బుధ్ధి" పుడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామటుకు కొత్త సినిమా పాటలు బాగున్నాయో, బాలేవో చెప్పలేని సందిగ్ధంలో పడేస్తూంటాయి కాబట్టి. ఎక్కడో ఇదివరకూ విన్నట్టు, పాత పాటల్ని మార్చేసారనో, మళ్ళీ అదే ట్యూన్ వాడారనో అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చిరాకు పెడుతున్న మనసులా ఆ పాటలు కూడా దిక్కుతోచకుండా చేస్తాయి. ఒకోసారి అన్నీ మర్చిపోయి ఆ బీట్ కు అనుగుణంగా చిందులెయ్యాలని కూడా అనిపిస్తుంది. అందుకే కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు నేనెప్పుడూ కొత్తపాటలనే వింటాను. ఇంతకీ నేను కొత్తపాటలను మెచ్చుకుంటున్నానా? తిడుతున్నానా? అదీ ఒక కన్ఫ్యూజనే.
ఇంతకీ నిన్న అలాంటి ఒక మనస్థితిలో కొత్త పాటలు విందామనే దుర్బుధ్ధితో గూగులమ్మ నడిగి ఓ నాలుగు కొత్త సినిమా పాటలు మనసారా వినేసాను...ప్చ్..లాభం లేదు...ఏ పాటలకీ మనసు చిందు వెయ్యలేదు కదా ఇంకాస్త భారం ఎక్కువైనట్లు అనిపించింది. వంశీగారి కొత్త సినిమా పాటల్లో కొత్తదనమెక్కడా వినబడలేదు. నెట్ లో అక్కడక్కడా కనిపించిన క్లిప్పింగ్స్లో విజువల్స్, లొకేషన్స్ బాగున్నాయి కానీ వంశీ వీరోవిన్ కి ఎప్పుడు ఉండే పెద్ద నల్ల బొట్టు, టకటక లాడించే కనురెప్పలూ, విన్యాసాలు చేసే గ్రూప్ డ్యాన్సర్లు...సేమ్ ఓల్డ్ స్టైల్. (కథ అయినా బాగుండి సినిమా ఆడాలనే కోరుకుంటున్నాను.) పాటలలో సాహిత్యం బాగుంది కానీ వింటూంటే ఆహా అని మాత్రం అనిపించలేదు...
ఇక పేరు ఎప్పుడూ వినని ఇద్దరు కొత్త సంగీత దర్శకుల పాటలు విన్నాను...లాభంలేదు. డబ్బాలో గులకరాళ్ళ డమడమలు, చెవులదిరే హోరు తప్ప కొత్తదనమేమీ వినబడలేదు.
హ్మ్మ్మ్మ్....అని కొన్ని నిట్టూర్పుల తరువాత "లయరాజు"గారి పాటలు వినటం మొదలుబెట్టాను. "తగలబడుతోంది..." అంటూ భయంకర శబ్దాలు వినిపించాయి. అమ్మో...అని భయపడిపోయి మిగిలిన వాటివైపు వెళ్ళా. బానే ఉన్నాయి కానీ వాటిలోనూ కొత్తదనమేం లేదు. ఆఖరిలో "రాజా"గారే ఒక పాట పాడేసారు. నేను గతంలో బాగుందనిపించి రికార్డ్ చేయించుకున్న ఒక తమిళ్ పాట గుర్తువచ్చింది. అది ఆయనే పాడారు. నాజర్ ఉంటాదనుకుంట ఆ పాటలో. సరే ఈ చివరిపాట పర్వాలేదు అనుకున్నా.
ఇక నాకు దొరికిన న్యూ రిలీజెస్ లో చివరిది మిగిలింది. "తకిట తకిట". ఇదేం పేరో...ఇదెలా ఉంటుందో..
అని మొదలేట్టా...వెంఠనే సంగీతం ఎవరా అని పైకి చూసా.."BoBo Shashi" అని ఉంది. రోబో లాగ బోబో ఏమిటో..అనుకున్నా. ఈ మధ్యన నేను కొత్త సినిమాలనసలు ఫాలో అవ్వట్లేదు. ఎవరీ "BoBo" అని గుగులమ్మలో శోధించా...ఫలానా మురళీ అనే అతని కొడుకు, మ్యూజికల్ బ్యాండ్ ఒకటి ఉంది, తమిళం లో చేసిన "Kulir 100 Degree" పాటలు బాగా పాపులర్ అయ్యాయని...ఆ తరువాత ఇంకా సినిమాలు వచ్చాయనీ...గట్రా..గట్రా...విషయాలు తెలిసాయి. గట్టివాడే. అనుకున్నా.
ఈ "బోబో" తెలుగులో ఏం చేసాడా అని వెతికితే "బిందాస్" అని వచ్చాయి. కొందరు సినీవారసుల సినిమాలు చూసే సాహసం చెయ్యను కాబట్టి ఆ సినిమా వచ్చిందని తెలుసు కానీ వివరాలు నాకు తెలీదు. పాటలు వింటే ఎన్నొ సార్లు ఎఫ్.ఎమ్.లో విన్నవే. బాగా పాపులర్ అయ్యాయి. బానే చేస్తున్నాడు. అనిపించింది.
ఇంతకీ "తకిట తకిట" లో మూడు పాటలు బాగున్నాయి. "Ishq Hai Yeh " అని ప్రసన్న, శ్రేయా ఘోషాల్ పాడారు. వనమాలి రాసారు. "మిలమిలల" అనే గ్రూప్ వింటేజ్ మిక్స్ ఒకటి బాగుంది. భాస్కరభట్ల సాహిత్యం బాగుంది. ఇక ముఖ్యంగా బాగా నచ్చిన మరో పాట "మనసే అటో ఇటో" కార్తీక్, చిన్మయీ పాడారు. ఈ సాహిత్యం కూడా భాస్కరభట్లగారిదే. ఈ సినిమాలో ఇద్దరు ముగ్గురు ప్రముఖనటులు చిన్నవయినా, కీ రోల్స్ లో వేస్తున్నారని చదివిన గుర్తు. మరి సినిమా బాగ ఆడుతుందని అనిపించింది పాటలు వింటే. ఈ పాటల్ని ఈ లింక్ లో వినవచ్చు.
అద్గదీ "BoBo" కధ. యువన్ శంకర్ రాజా, హారిస్ జైరాజ్, మిక్కీ జె మేయర్ తదితరుల తరువాత దిగుమతి అయిన ఈ తమిళ "శశి" మరో ప్రోమిసింగ్ కంపోజర్ అని నాకనిపిస్తోంది. మరి ఎంతవరకు రాణిస్తాడు అన్నది వేచి చూడాల్సిందే...!!