"నీ అందం ఆరోగ్యం, నీ చదువూ సంస్కారం ఇవే నిజమైన నగలు. నీ వినయం వందనం, నీ నిదానం నిగ్రహం ఇవే నిన్ను కాపాడే ఆయుధాలు."
"పుట్టిల్లు వదిలి రేపట్నుంచీ అత్తింటికి వెళుతున్నావు. ముత్యం మూడు రోజుల్లో అత్తిల్లే పుట్టిల్లుగా మార్చుకోవాలి. ఇకనుంచీ నీకు అమ్మా,నాన్న,గురువు,దేవుడు,స్నేహితుడు అన్నీ నీ భర్తే."
"నిన్ను చూసి ఇంకోళ్ళకి కన్ను కుట్టేలా ఉండాలి తప్ప అయ్యో పాపం అనిపించుకునే స్థితిలో పడకు."
"కాల్లో ముల్లు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చుకోలేదని సంతోషించాలి తప్ప ఏడుస్తూ కూచోకూడదు."
"ప్రతి గుండెలో గోరంతదీపం ఉంటుంది. కటిక చీకటిలా కష్టాలు చుట్టూముట్టినప్పుడు ఆ దీపమే కొండంత వెలుగై దారి చూపుతుంది. ఆ దీపం పేరే ధైర్యం. దాని పేరే గెలవాలన్న ఆశ. చిగురంత ఆశ."
"నువ్వు చాలా హాయిగా సంతోషంగా ఉన్నప్పుడే కన్నవాళ్ళను తలుచుకో.చూడ్దానికి రా ! ఓడిపోతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు నాకు చెప్పకు."
"నువ్వు తినే అన్నం నువ్వే హరాయించుకోవాలి. నీ కష్టాలు నువ్వే భరాయించుకోవాలి."
"గోరంత దీపం(1978)" సినిమాలో పెళ్ళై అత్తారింటికి వెళుతున్న కూతురు పద్మావతికి తండ్రి సీతారామయ్య అప్పగింతల ముందు చెప్పిన మాటలివి. నిజం చెప్పాలంటే అక్షర సత్యాలు. పెళ్ళైన ప్రతి కూతురికీ తల్లీ,తండ్రీ చెప్పే మాటలు ఇవి. నాకు చాలా ఇష్టమైన చిత్రాల్లో ఇదీ ఒకటి. "ముత్యాలముగ్గు" సినిమా కన్నా ముందు నుంచీ ఈ సినిమా గురించి రాయాలని...ఇన్నాళ్ళకు కుదిరింది.
కథలోకి వెళ్తే...ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం. కొత్తగా ఇంట్లో అడుగుపెట్టిన కోడలిని సాధించే అత్తగారూ, ఇంటి బాగోగులు పట్టించుకోని మావగారూ; పెళ్ళికెదిగిన ఆడపడుచు; తల్లిని ఏమీ అనలేని నిస్సహాయుడే కాక భార్యపై కన్ను వేసిన స్నేహితుడి నిజ స్వరూపాన్ని అర్ధం చేసుకోలేని అమాయకపు భర్త, వీరందరి మధ్యా నలిగిపోయే ఒక కొత్త పెళ్ళికూతురు. అపార్ధాలు సృష్టించి భార్యాభర్తలను వేరు చేసినా వారిద్దరి మధ్యా ఉన్న అనుబంధం వారిని ఎలా మళ్ళీ ఒకటి చేసింది అనేది ప్రధానాంశం.
సినిమాలో నాకు బాగా నచ్చినది ఎంత దూరమైనా, అపార్ధాలకు లోనైనా, భార్యాభర్తల మధ్యన అంతర్లీనంగా దాగి ఉన్న నమ్మకం. పరిస్థితులు విడదీసినా,ఎవరెన్ని చెప్పినా ఒకరిపై ఒకరికి తరగని ప్రేమ చివరికి వారిద్దరినీ కలుపుతుంది. చివరి సన్నివేశంలో పద్మ కలిపిన "ఆవకాయ ముద్ద"కు కూడా వారిద్దరినీ కలిపిన క్రెడిట్ దక్కుతుంది...:) ఇరుకు వంటింట్లో భార్యాభర్తల పాట్లూ, సరసాలూ; శేషు-పద్మ బాడ్మింటన్ ఆడే సన్నివేశం; అత్తగారింటికి వెళ్ళినప్పుడు శేషగిరి కి పద్మ ఔన్నత్యం అర్ధమైన సీన్; పద్మను వరలక్ష్మి ఆదరించి ధైర్యాన్ని చెప్పే సన్నివేశం; సినిమా చివరలో శేషు పద్మను కలవటానికి వచ్చినప్పటి సన్నివేశం, ఆ వెనుక వచ్చే మేండొలిన్ బిట్ మొదలైన సన్నివేశాలన్నీ మనసుకు హత్తుకుంటాయి.
బాపూగారి హీరోయిన్స్ లో నాకు నచ్చేది... అందంతో పాటూ అభిమానం, సంస్కారం, ధైర్యం మొదలైన సద్గుణాలే కాక అంతకుమించిన ఆత్మస్థైర్యం. ఈ సినిమాలో కూడా పద్మావతి పాత్ర, ఆమెలోని సహనం, మౌనం, నేర్పూ,ఓర్పూ అన్నీ మనల్ని ఆకట్టుకుంటాయి. చాలా సినిమాల్లో లాగ కాకుండా హెవీమేకప్ లేకుండా, అతి సామాన్యంగా, మధ్యతరగతి కోడలి పాత్రలో ఒదిగిపోయిన వాణిశ్రీగారి నటన సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. అతి తక్కువ డైలాగ్స్ తో, హీరోయిన్ కళ్ళతోనే సగం భావాన్ని వ్యక్తపరిచే బాపూగారి దర్శకత్వ ప్రతిభను ఇంకా ఇంకా పొగడగలమే తప్ప కొత్తగా చెప్పవలసింది లేదు.
శేషు పాత్రలో శ్రీధర్, గయ్యాళి అత్తగారిగా సూర్యాకాంతం, శేషు తండ్రిగా రావుగోపాల్రావ్, ఆదినారాయణ పాత్రలో అల్లురామలింగయ్య మెప్పిస్తారు. "నో ప్రాబ్లం" డైలాగుతో పరిపూర్ణ విలన్ గా మోహన్ బాబు తనదైన ప్రత్యేక నటనను కనబరుస్తారు.
"ముత్యాల ముగ్గు"కు ఫొటోగ్రఫీ అందించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ "ఇషాన్ ఆర్య" ఈ సినిమాకు కూడా తన కెమేరాతో రంగులు దిద్దారు. ఈ సినిమాలో పలు దృశ్యాల్లో అద్భుతమైన మేండొలిన్ వాదన వినిపిస్తుంది. అది "ముత్యాల ముగ్గు" సినిమాలో మనల్ని తన మేండొలిన్ తో అలరించిన ప్రముఖ మేండొలీన్ విద్వాంసుడు శ్రీ సాజిద్ హుస్సేన్ గారే అయిఉంటారని అనుకుంటున్నాను.
ఇక కె.వి.మహదేవన్ గారి సంగీతం; నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరధి గార్ల సాహిత్యం; పాటల చిత్రీకరణ అన్నీ అద్భుతమే. ఈ సినిమాలో నాకు 3 పాటలు చాలా ఇష్టం. ముందుగా టైటిల్ సాంగ్...ఈపాటను ఇక్కడ వినవచ్చు.
పాట మీద ఇష్టం కొద్దీ సాహిత్యాన్ని కూడా రాస్తున్నాను.
పాడినది: ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, సుశీల
రచన: నారాయణరెడ్డి
సంగీతం: కె.వి.మహాదేవన్: గోరంతదీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ..జగమంత వెలుగు
౧చ:కరిమబ్బులు కమ్మేవేళ మెరుపుతీగే వెలుగు
కారుచీకటి ముసిరేవేళ వేగుచుక్కే వెలుగు
మతితప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు
దహియించే బాధల మధ్యన సహనమే వెలుగు
౨చ:కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి
నీళ్ళులేని ఎడారిలో కన్నీళ్ళైనా తాగి బతకాలి
ఏ తోడూ లేని నాడు నీ నీడే నీకు తోడు
జగమంతా దగా చేసినా చిగురంత ఆశను చూడు
చిగురంత ఆశ..జగమంత వెలుగు
గోరంతదీపం కొండంట వెలుగు
చిగురంత ఆశ..జగమంత వెలుగు
******
రెండవది "రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా..." ఈ పాట యూ ట్యూబ్ లింక్:
*****
మూడవది సరదాగా సాగే "గోడకు చెవులుంటేనో...నో..నో..."
(ఈ టపాలోని ఫొటోలు ఎమ్వీఎల్ గారు నవలీకరించిన "గోరంతదీపం" పుస్తకంలోనివి. మొదటిది అట్ట మీద బాపూగారు వేసిన వాణిశ్రీ స్కెచ్.)