సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, March 23, 2010

" మృత్యోర్మా అమృతంగమయ -- ౩ "

మొదటిభాగం
రెండవ భాగం తరువాయి....

కిషోర్ హాస్పటల్కు వెళ్తుంటే వైజాగ్ లో ఉన్న కూతురు శైలజ దగ్గరకు వెళ్తానని టికెట్లు రిజర్వ్ చేయించమని అడుగుతుంది కాంతిమతి. పదిరోజులకన్నా ఎక్కువ అయితే తను ఉండలేనని త్వరగా వచ్చేయమని చెబుతాడు కిషోర్. శైలు ఇంటికి వెళ్తుంది కాంతిమతి. అల్లుడిది మంచి ఉద్యోగం. ఇద్దరు పిల్లలతో ముచ్చటైన కాపురం శైలుది. ఓ వారం గడిచాకా ఒకరోజు పక్కింట్లో జరిగిన ఒక సంఘటన కాంతిమతిని బాగా కదిలించివేస్తుంది. కొడుకు,కోడలు నిర్లక్యం వాళ్ళ అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన పక్కింటి సుబ్బరాయమ్మ గారి కధ ఆవిడ మనసును కలచివేస్తుంది. ప్రాణసమానంగా పెంచుకున్న కొడుకు పెళ్ళవగానే మారిపోయి కన్నతల్లి మరణానికి కారణం కాగలడన్న సంగతి ఆమె జీర్ణిమ్చుకోలేకపోతుంది. ఆ తరువాత శైలు స్నేహితురాలు, తన ఒకప్పటి స్టూడెంట్ అయిన నీరజను కలుస్తుంది. నీరజ అత్తగారు ఆమెను పెడుతున్న ఇబ్బందుల సంగతి తెలుసుకుని బాధపడుతుంది.

ఒకరోజు తన పీ.ఎఫ్. గురించి ఆరా తీసి వాటితో తనకు ఫ్రిజ్ కొనిపెట్టమని , రెండు జతల గాజులు చేయించమని అడిగిన శైలును చూసి ఆశ్చర్యపోతుంది కాంతిమతి. భర్తకు మంచి ఉద్యోగం ఉండీ, తనది పెన్షన్ లేని ఉద్యోగం అని తెలిసీ వచ్చే కొద్దిపాటి డబ్బుని పంచమన్నట్లు అడుగుతున్నా కూతురికి ఏమి సమాధానం చెప్పాలో అర్ధంకాదు ఆమెకు. "ప్రపంచంలో ఇటు చేసి కాని, అటు పెట్టి కాని ఎవ్వరినీ తృప్తి పరచలేము" అనుకుంటుంది మనసులో. వెళ్ళే ముందు తన మెడలోని గొలుసును శైలుకు ఇచ్చి, శైలు దగ్గర నుంచి మద్రాసులో ఉన్న పెద్దకొడుకు కృష్ణముర్తి దగ్గరకు బయల్దేరుతుంది కాంతిమతి.ఆమె రాకకు చాలా ఆనందిస్తాడు పెద్ద కొడుకు. అయితే ఆడపడుచు కూతురైన పెద్దకోడలు జానకి ఎత్తిపొడుపు మాటలు మాత్రం ఆమెకు చివుక్కుమనిపిస్తాయి. మాట్లాడకుండా కాళ్ళకు చుట్టుకున్న మనుమలిద్దరినీ దగ్గరకు తీసుకుంటుంది కాంతిమతి.

మద్రాసులోనే ఉంటున్న తన స్నేహితురాలు రేవతి కుమార్తె ఉమను కలుస్తుంది. పెద్దింటి సంబంధం , ఎంతో అదృష్టవంతురాలు అనుకున్న ఉమ పరిస్థితి చూసి ఆశ్చర్యపోతుంది ఆమె. ముక్కు మొహం తెలియకపోయినా తనను ఎంతో ఆదరించిన ఉమ అత్తగారు, కోడలిని కొడుకుతో సరిగ్గా మాట్లాడనివ్వదని, వాళ్ళను అన్యోన్యంగా ఉండనివ్వదని తెలుసుకుని ఎంతో బాధ పడుతుంది. ఉమ ఇల్లు వెతుక్కుని వెళ్లి దూరపు చుట్టంగా పరిచయం చేసుకుని కాసేపు ఉండి వస్తుంది కాంతిమతి. ముక్కు మొహం తెలీని తననే ఆదరంగా చూసిన ఉమ అత్తగారు కోడలితో ప్రవర్తించే విధానం ఆమెను ఆశ్చర్యపరుస్తుంది. ఉన్న కాసేపులో కొడుకంటే ఉమ అత్తగారికి ఎంత ప్రాణమో తెలుసుకుంటుంది. తిరిగి వచ్చే దారిలో ఎన్నో ఆలోచనలు ఆమెను చుట్టుముడతాయి.

"కొడుకును అపురుపంగా చూసుకునే తల్లి కోడలిని కూడా ఎందుకు సమానంగా చూడదు? వారిద్దరూ అన్యోన్యంగా ఉంటే తన ప్రాముఖ్యత తగ్గిపోతుందన్న అభద్రతా? పవిత్రమైన తల్లి ప్రేమ కొడుకు వైవాహిక జీవితానికి అడ్దంకు అవుతుందా? సృష్టిలోకెల్లా తీయనైన తల్లిప్రేమ ఇంత సంకుచితంగా, స్వార్ధపూరితంగా ఉంటుందా?...." మొదలైన అనేకరకాల ఆలోచనలతో ఆమెకు ఆ రాత్రి నిద్ర పట్టదు. నిద్రపట్టక దర్లుతున్న ఆమెకు పక్క గదిలోంచి పెద్దకోడలి మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కాంతిమతి పేరన ఉన్న ఇల్లును వాళ్ళ పేరన రాయించుకొమ్మని భర్తతో ఘర్షణ పడుతుంది జానకి. అందుకు ససేమిరా ఒప్పుకోడు కృష్ణమూర్తి. పాత రోజులు కళ్ళ ముందుకు వస్తాయి కాంతిమతికి.

"దానికి అన్యాయం జరిగిందర్రా. కోడలైనా కూతురిలా సేవ చెసింది. ఇంటి బాధ్యతలన్నీ తనపై వేసుకుని తీర్చింది .." అంటు ఆమె అత్తగారు ఆఖరి ఘడియల్లో సర్వహక్కులతో తన పేర్న ఉన్న ఇల్లును పట్టుబట్టి కాంతిమతి పేర్న రాయిస్తుంది. ఆగ్రహించిన మరుదులూ, ఆడపడుచూ అత్తగారు పోయాకా కార్యక్రమాలకు ఖర్చులన్నీ కాంతిమతే భారించాలని వాదిస్తారు. తాకట్టు పెట్టిన గొలుసుని విడిపించి డబ్బు సర్దుతాడు అంత్యక్రియలకు వచ్చిన ఆమె భర్త గోపాలరావు. ఇల్లు తనకు వద్దనీ వాళ్ళందరికీ రాసేస్తానని అన్న కాంతిమతిని భర్త వారిస్తాడు. పెద్దవాళ్ళు ఏం చేసినా ఆలోచించి చేస్తారనీ, ఎట్టిపరిస్థితుల్లోనూ ఇల్లును ఎవరిపేరనా రాయొద్దనీ, ఆ ఊరునూ ఇంటినీ వదిలి వెళ్ళొద్దని మాట తీసుకుంటాడు గోపాలరావు.


బాధామయ గతాన్ని తలుచుకుంతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది కాంతిమతి. కొద్ది రోజుల తరువాత వెళ్పోతూ వెళ్పోతూ తన మెడలోని మరొక పేట గొలుసును ఇచ్చినప్పుడు మాత్రం జానకి మొహం విప్పారుతుంది. తిరువణ్ణామలై కు టికెట్ కొనుక్కున్న తల్లిని చూసి ఆశ్చర్యపోతాడు స్టేషన్ కు వచ్చిన కృష్ణమూర్తి. బాధ్యతలు తీరాయి కద్దా కొన్నాళ్ళు ప్రసాంత వాతావరణంలో గడపాలనుందని చెబుతుందామె. అరుణాచెలం,పుదుచ్చేరి తిరిగి నెల తరువాత ఇల్లు చేరుతుంది కాంతిమతి.

(ఇంకా ఉంది..)