సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Tuesday, January 12, 2010
సంక్రాంతి...ముగ్గులు...
స్కూల్లో ఉన్నన్నాళ్ళూ ప్రతి "సంక్రాంతి"కీ నానమ్మా వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం. ప్రతి ఏడూ భోగి రోజున చీకటిఉదయనే రిక్షాలో ఇంటికి వెళ్తూంటే, చల్లని చలిలో్ దారి పొడుగునా వెచ్చని భోగిమంటలు...ప్రతి ఇంటి ముందూ మట్టినేల మీద తెల్లని, రంగురంగుల ముగ్గులతో నిండిన లోగిళ్ళు...
నలుగుపిండి స్నానాలూ, పట్టు పరికిణీలూ,
వంటింట్లోంచి పిండివంటల ఘుమఘుమలూ,
బొమ్మల కొలువులూ, భోగిపళ్ళ పేరంటాలూ,
గొబ్బెమ్మలూ...వాటిపై ముద్దబంతి పూలూ,
గంగిరెద్దులాటలూ , సన్నాయి మేళాలూ,
డుడు బసవన్నలు, హరిదాసు గానాలూ,
....ఆ స్మృతుల మధురిమలే అంబరాన్నంటే సంబరాలు...!!
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని జ్ఞాపకాలో..ఎన్ని నిట్టూర్పులో...ఎన్ని సరదాలో...ఇప్పుడే చిలికిన వెన్నలా తెల్లగా,మెత్తగా,కరిగిపోయే జ్ఞాపకాలు...అపురూపాలు.
సంక్రాంతి అనగానే నాకు నచ్చిన, గుర్తొచ్చే "సింధూరం" సినిమాలో పాట....
ఆ పాట తాలూకూ యూట్యూబ్ లింక్:
http://www.youtube.com/watch?v=Zj-S2_gYfVo
ఇక సంక్రాంతి అనగానే మొదట గుర్తు వచ్చేవి నాకెంతో ఇష్టమైన "ముగ్గులు". ఇంకా చెప్పాలంటే ముగ్గులంతే పిచ్చి. ధనుర్మాసం ఆరంభమౌతూనే నెలపట్టి ఇంటి ముందర ముగ్గులేయటం మొదలుపెట్టేవాళ్ళం. నానమ్మ, అత్త, పెద్దమ్మా, పిన్నిలు, అమ్మా....ఇంట్లో అందరు ముగ్గుల స్పెషలిస్టులే. మా అత్త పేరు వీధిలో ఎవరికీ తెలియదు. ఆవిడని అందరూ "ముగ్గులత్తయ్యగారు" అనే పిలుస్తారు ఇప్పటికీ.
మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్న ఒక ముగ్గు టెక్నిక్ "వెడల్పు పోత ముగ్గు". మామూలుగా సన్నని గీతలా కాక బొటనవేలూ,చూపుడువేలూ,మధ్యవేలు కలిపి మూడు వేళ్ళతో వేసే ముగ్గును "వెడల్పు పోత ముగ్గు" అంటారు.మా అమ్మ వాళ్ళ అత్తగారి దగ్గర నెర్చుకుంది.నేను అమ్మ చూసి నేర్చుకున్నా..క్రింద మట్టి నేలపై ఉన్న ముగ్గులన్ని ఆ విధంగా వేసినవే. ఎప్పుడో వేసినవి....ఇదివరకూ మొదట్లో ఎప్పుడో ప్రచురించిన కొన్ని "ముగ్గులు"...
Subscribe to:
Posts (Atom)