సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, October 20, 2009

గుంటూరు శేషేంద్ర శర్మ కవిత

"ఒక్క పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బ్రతకగలను" అంటారు గుంటూరు శేషేంద్ర శర్మ. ఈయన కవిత్వాన్ని శ్రీ శ్రీ మొదలు విశ్వనాధ సత్యనారాయణ, పుట్టపర్తి నారాయణాచార్యులు దాకా ప్రశంసించారు. తిలక్ సాహిత్యంతో కూడా ఈయన సాహిత్యానికి సామీప్యం కనిపిస్తుంది. వీరిద్దరి కవితల్లో కనబడే భాషా సౌందర్యం ఇతర ఆధునిక కవుల్లో కొంత తక్కువనే చెప్పాలి. శేషేంద్ర శర్మ గారి కవిత్వంలో ప్రకృతి సౌందర్యంతో పాటూ తత్వాన్వేషణ కూడా మిళితమై ఉంటుంది. అందువల్ల మళ్ళి మళ్ళీ ఆ రచనలను చదవాలనే ఆసక్తి, చదివే కొద్ది కొత్త అర్ధాలూ కనబడుతూ ఉంటాయి నాకు.

ఇంతకన్నా గొప్పగా ఆయన కవిత్వాన్ని విశ్లేషించే కవితాశక్తి, అర్హత నాకు లేవు కానీ ఆయన కవిత్వం లోంచి కొన్ని వాక్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను...చదివి ఆస్వాదించండి...

"ఎక్కడ పేరులేని పక్షి కొమ్మల్లో కూర్చున్న మాత్రాన
పరిసరాలు పద్యాలుగా మారుతాయో
ఎక్కడ ఎర్ర యూకలిప్టస్ చెట్టు
సంధ్యలో స్నానం చేసి ఆకుల కొసల్లో
ఎర్రపూల బిందువులు వ్రేలాడుతూండగా
ముందుకు వస్తుందో
ఎక్కడ ముద్దుగా ఇంటి మీదికి ఒరిగిన
జాబిల్లి ముద్ద చేతి కందుతాడనిపిస్తుందో

అక్కడికి, ఆ కల లోయల్లోకి
పోదాం పదమంటుంది ఆత్మ
నగ్న వృక్షాల బారినించి తప్పించుకుని
శాంతి యాత్ర చేద్దాం పదమంటుంది.."
__(శాంతియాత్ర : మండే సూర్యుడు)

+++++++++++++++++++++++++

"తుఫాను" కవితలో ఆయనంటారు...
"ఏమోయ్ తుఫాను ఎక్కడికి పోతున్నావ్
నీ ముఖం ఎంత ప్రశాంతమైన అచ్చాదన నీకు
ఉన్నది ఒక్క గుండె
వంద గాయాలకు చోటేక్కడుంది నీలో..."

+++++++++++++++++++++++++

ప్రేమను గురించి ఉపమానాలు పేనుతూంటే
గుండెని కోకిల తన్నుకుపోయింది
గజల్ని గురించి రాద్దామని కూర్చుంటే
రాత్రి కవిత్వంలో తడిసిపోయింది..

+++++++++++++++++++++

మనసు ఇచ్చిన గాయాలను మమత కొనుక్కున్నది
బ్రతుకు సంతలో చివరకు బాటసారి అయినది..

+++++++++++++++++++

"చిన్న నక్షత్రం చేత్తో పట్టుకుని
అంతరాత్మ సందుల్లో ఒక రహస్యాన్ని
తవ్వుతున్నాను
ఎన్నో కోట్ల రాత్రుల పొరల క్రింద
బయటపడింది
మనిషి కోల్పోయిన మొహం
వెయ్యి కిరణాలతో..."

+++++++++++++++++++


"వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి
చెట్టుగా ఉంటే ఏడాదికొక వసంతమన్నా దక్కేది
మనిషినై
అన్ని వసంతాలూ కోల్పోయాను.."

+++++++++++++++++++++++++

"...భూమిలో ఉన్న చిన్నారి గింజ
మెడ బయటకు పెట్టి
మొదట వచ్చిన రెండాకుల్ని
చేతులుగా జోడించింది
కృతజ్ఞతతో "

+++++++++++++++

ఒక్కటే :

రాళ్ళెన్ని ఉన్నా దూరాన్ని కొలిచే రాయి ఒక్కటే
పక్షులెన్ని ఉన్నా ఒంటరితనాన్ని
తనమీద వేసుకుని
దిక్కులతో చూపులు కలిపే పక్షి ఒక్కటే

దిక్కులెన్ని ఉన్నా
చూపులతో మాట్లాడే దిక్కు ఒక్కటే
మాటలెన్ని ఉన్నా పొందిందీ లేదు
పోగొట్టుకున్నదీ లేదు
ఈ వెలుగు చీకట్ల సంగమంలో
అని చెప్పే మాట
ఒక్కటే

జీవితం అంతా అరిగిపోగా
చివ్వరి రేణువులా మిగిలి ఉన్న
నా ఉనికి అంతా
ఒక్క జ్ఞాపకం
ఒక్కటే
+++++++++++++++++

శేషేంద్ర శర్మ గారు రాసిన ఒకే ఒక సినిమా పాట "ముత్యాల ముగ్గు " చిత్రంలో ఉంది...
సంగీతం:కె.వి .మహదేవన్
పాడినది: పి.సుశీల

నిదురించే తో్టలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది

రమ్యంగా కుటీరానా రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన దీపంలా వెలిగిందీ
శూన్యమైన వేణువులో ఒక స్వరమ్ కలిపి నిలిపిందీ
ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది

విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడీ అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని
నావకు చెప్పండి..నావకు చెప్పండి..