సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, September 8, 2009

మనస్విని

ప్రముఖ తమిళ నవలారచయిత అఖిలన్ గారి గురించి,ఆయన రాసిన "చిత్తిరప్పావై" అనువాదం "చిత్రసుందరి" గురించి అదివరకొక టపా రాసాను.క్రింది లింక్ లో ఆ వివరాలు చూడగలరు.
http://trishnaventa.blogspot.com/2009/07/blog-post_17.html

అఖిలన్ గారు రాసిన మరొక నవల "స్నేహితి" గురించి ఈ టపా..ఈ నవలను కూడా మధురాంతకం రాజారాంగారు 1958లో "మనస్విని"గా అనువదించారు. ఒక ప్రముఖ వార పత్రికలో సీరియల్ గా ప్రచురితమైన ఈ నవల తెలుగు పాఠకుల ఆదరణకు పాత్రమైంది.1981లో "చిత్రసుందరి"తో పాటూ "మనస్విని" కూడా నవలా రూపం సంతరించుకుంది.

"స్నేహితి" అంటే స్నేహితురాలని అర్ధం.అఖిలన్ గారి శైలిలో,మొదలుపెట్టిన దగ్గరనుంచీ పూర్తయ్యేదాకా ఆపలేని ఆకట్టుకునే కధనంతో,జీవితం గురించిన మంచి సందేశంతో రాయబడిన ఒక అపురుపమైన నవల ఇది.ఎన్నిసార్లు చదివినా కొత్తగా తోచే ఈ నవలంటే నాకు చాలా ఇష్టం.ముఖ్యంగా కొన్ని విషయాలపై అఖిలన్ గారు తెలియపర్చిన అభిప్రాయాలు ఎవరికైనా బాగా నచ్చుతాయి.కిటికీ లోంచి లోకమన్న బూచిని చూపి భయపెట్టకుండా;సామాజిక స్పృహతోనే,తమ నవలలకు కట్టుబాట్లకు,సాంప్రదాయానికీ విరుధ్ధంగా ముగింపులను ఇవ్వగల ధైర్యం ఉన్న కొద్ది మంది రచయితలలో ఈయన ఒకరు.ఏభైలలోనే ఇంతటి మహోన్నతమైన ఆలొచనలతో రచనలు చేసారంటే సమాజంలో మార్పు కోసం ఆయన ఎంత తపన పడ్డారో అర్ధం అవుతుంది.

"మనస్విని" కధ:
రాజు "ఉషస్సు" పత్రిక సంపాదకుడు,కధా రచయిత.పేరుప్రఖ్యాతలున్న సహృదయుడు.ఒకానొక సందర్భంలో అతనికి సీతారామయ్య గారనే సంపన్న,వయొవృధ్ధునితో పరిచయమౌతుంది.మొదటి పరిచయంలొనే ఆయన పట్ల గౌరవభావం,ఆత్మీయత,స్నేహభావం ఏర్పడిపోతాయి.కానీ, మొదటిసారి వారి ఇంటికి వెళ్ళినప్పుడు బంగారుబొమ్మ లాంటి ఇరవైయ్యేళ్ల "లలిత" ఆయన భార్య అని తెలిసి అవాక్కవుతాడు.వాళ్ల వివాహం వెనుక గల కారణాలు,జరిగిన సంఘఠనలు తెలిసాకా వారిద్దరి విచిత్ర దాంపత్యాన్ని ,అన్యోన్య స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అయితే,సీతారామయ్యగారి మృదుభాషణ,హృదయాన్ని కదిలించే ఆదరణ,ప్రసన్నమైన ప్రవర్తన రాజును ఆయనవైపు ఆకర్షింపచేస్తాయి.కపటంలేని అమాయకత్వం,సిరిసంపదల వల్ల ఏమాత్రం తరగని ఆయన ఉన్నత సంస్కారం ముందర సహృదయుడైన రాజు తలవంచుతాడు.సమాజం అడ్దగిస్తున్నా;సాహిత్యాన్ని అభిమానించే ఆ విచిత్ర దంపతులను,వారి పెద్ద గ్రంధాలయాన్ని,కూర్చూంటే సేదతిర్చటానికి ఉన్న అందమైన వారి పూలతొటను,వారిద్దరి అభిమానాన్ని,ఆ ఇంటినీ వదులుకొలేకపోతాడు రాజు.

స్వార్ధభావానికి తావులేని సేవాశీలత;ఆడంబరాలు,అలంకారాలూ లేని నిరాడంబరత;పరాధీనమైన పరిస్థితుల్లో కూడా కొట్టొచ్చినట్లు కనిపించే లలిత హృదయసౌందర్యం,వారిదీ వీరిదీ అన్న వ్యత్యాసం లేకుండా అందమైన కవితలో,సంగీతంలో,శిల్పంలో పరవసించిపోయే లలిత కళారాధన చూచిన రాజు ఆమెను ప్రేమించకుండా ఉండలేకపోతాడు.కానీ కట్టుబాట్లు,సాంప్రదాయాల విలువ తెలిసిన మనిషిగా మనోభావాలను మనసులోనే దాచుకుంటాడు.అతని రచనలను, వ్యక్తిత్వాన్ని, నిరాడంబరతనూ,స్నేహాన్ని ఇష్టపడిన లలిత కూడా మౌనంగా అతడిని ఆరాధిస్తుంది.కాని ఇద్దరూ వారి వారి హద్దులను,పరిధులను దాటి అబిప్రాయాలను ఎన్నడూ వ్యక్తపరుచుకోరు.ఒక సాంఘిక మర్యాదకు కట్టుబడి తమ మూగ బాధను హృదయాల్లొనే దాచుకుంటారు వారిద్దరూ.అయితే, అసుయాపరులైన కొందరి కారణంగా,ప్రముఖుల జీవితాలను భూతద్దం లోంచి చూసే సమాజం చేయని నేరానికి రాజుకు కళంకాన్ని అంటకడుతుంది.మర్యాద పొందిన సమాజంలొనే అపహాస్యంపాలై ఒకానొక రోజున దిక్కతోచని దయనీయ స్థితిలో సముద్రపుటొడ్డున స్పృహ కోల్పోతాడు రాజు.

వివాహమన్న పవిత్రమైన కట్టుబాటుకు వారిద్దరూ చూపిన గౌరవం,దాన్ని కాపాడటం కోసం వారు పడిన బాధ,చేస్తున్న త్యాగాన్ని,వారి నిగ్రహాన్ని చూసి చలించిపోయిన సీతారామయ్యగారు, వారిద్దరిని కలపాలనే నిర్ణయానికి వచ్చి,తన నిర్ణయానికి వారిని బధ్ధులని చేసి,ఆశీర్వదించడంతో కధ ముగుస్తుంది.మహోన్నతమైన ఆ పెద్దాయన సంస్కారానికి చేతులెత్తి దణ్ణం పెట్టాలనిపిస్తుంది.మనుషుల్లోని సున్నితమైన భావాలను ఎంతో లలితంగా చిత్రికరింపబడ్డాయి ఈ నవలలో. చదవటం అయిపొయాకా కూడా చాలా కాలం మన మనసు కధనం చుట్టూ పరిభ్రమిస్తుంది.కధలో "కాంతం" అనే మరో పాత్ర ద్వారా స్త్రీ సహజమైన మనోభావాలను,స్త్రీల స్వభావాన్ని ఎంతో చక్కగా వ్యక్తీకరిస్తారీ రచయిత.ఈ నవల గొప్పతనానికి మధురాంతకం గారి అద్భుత అనువాదం కూడా ఒక కారణమే.

నవలలో మనల్ను ఆలోచింపజేసే కొన్ని వాక్యాలు:
"కొన్ని ప్రేమగాధలలా సుఖాంతం కావటానికి ముందు ఎంత కన్నీరు ప్రవహించిందో,హృదయాలెంతగా వ్రక్కలైపొయాయొ,మనసుల్లో ఎంతటి దావాగ్ని చెలరేగిందో ఎవరాలొచిస్తారు?"

"వేదికలెక్కి మహిలాభ్యుదయం ఎంత అవసరమో నొక్కిచెప్పటం కన్నా ఒక మంచిపనిని సక్రమంగా నెరవేర్చటమం వల్ల దేశానికి ఎంతొ కొంత మేలు చేకూరుతుంది."

"సమ వయస్కులైన యువతీయువకులు సన్నిహితంగా ప్రవర్తించడమంటూ జరిగితే వాళ్ళీ దేశంలో భార్యాభర్తలైనా కావాలి లేదా అన్నా చెళ్ళెలైనా కావాలి.అంతకుమించి మరెలాంటి సంబంధాన్నీ లోకం హర్షించడంలేదు.స్త్రి పురుషులు పవిత్ర హృదయాలతో ఒకరినొకరు ఆత్మీయులు కావటానికి ఇవి తప్ప మార్గాంతరాలు లేనే లేవా?ప్రతిఫలాన్ని ఆపేక్షించని స్నేహసౌహార్ధాల మూలంగా స్త్రీపురుషులు సన్నిహితులు కావటానికి వీలులేదా?"

"లక్ష్యమని, త్యాగమనీ పెరు బెట్తి అబలల జీవితాన్ని బలిపెడితే గాని ముగింపుకురాని దు:ఖాంతమైన గాధల్ని వ్రాసి జీవితం పట్ల వాళ్లకున్న నమ్మకాన్ని నాశనం చేయకండి"
"లక్ష్యాలు.ఆదర్శాలు,యుగయుగాలకూ మార్పు చెందని షాషాణపంక్తులు గావు.కాలప్రవాహం వాటిని తనకు వీలైనట్టు మలచుకుని ఆవలికి వెళ్ళిపోతుంది.ఆదర్శమ్ కొరకు గాదు జీవితం,జీవితం కొరకే ఆదర్శం."

"మానవుడి స్వభావం మీద అతడి ఇష్టా ఇష్టాలతో ప్రసక్తి లేకుండా ప్రకృతి కొన్ని మార్పుల్ని సాధించగలుగుతుంది."

"రచయితలు తమకు మంచిదని తోచిందేదో రాస్తారు.నచ్చేవాళ్లకు నచ్చుతుంది,నచ్చనివాళ్ళ గురించి ఆలోచించక్కర్లేదు.అవి జీవితపు గొడవల్లో అలసి,సొలసి విసిగివేసారిపొయిన మానవుడికి ఇంత మనశ్శాంతి,ఇంత ఆనందం ఇవ్వగలిగితే చాలు"