యలమంచలి దగ్గర మా బంధువుల్లో ఒకరు వర్క్ చేస్తున్న అగ్రికల్చురల్ ఫార్మ్ ఉంది.గార్డెనింగ్ అంటే విపరీతమైన పిచ్చి ఉన్న నాకు ఆ ఫార్మ్ చూడాలని ఎన్నో ఏళ్ళ కోరిక. యానామ్ దాకా ఎలాగూ వెళ్తున్నాం ఇంకొంచెం ముందుకు,విశాఖ జిల్లా అంచులదాకా వెళ్ళి అది కూడా చూసేద్దాం అని మావారి చెవిలో జోరీగలా పోరేసా...సర్లెమ్మన్నారు.యానాం నుంచి బస్సులో యలమంచలి వెళ్దామని పొద్దున్నే లేచి బస్టాండ్ కు చేరాం.రెండు గంటలు కూర్చున్నా మాకావాల్సిన బస్సు రాలేదు.మేము వెళ్ళి మళ్ళీ గౌతమీ టైముకి కాకినాడ రావాలి.అక్కద ఉండే టైము తగ్గిపోతోందని కంగారు నాకు...ఆఖరుకు ఒక సహప్రయాణికుని సలహాపై ముందర కాకినాడ వెళ్ఫోయి అక్కద విశాఖ వెళ్ళే ఎక్సప్రెస్స్ బస్సు ఎక్కాం....అది అలా నెమ్మదిగా అన్నవరం దాటి...వెళ్లి వెళ్ళి...మేం ఆ ఊరు చేరే సరికీ మధ్యాహ్నం పన్నెండు..!!
పొద్దున్నే 4.30కి లేచిన మా కడుపుల్లో ఎలకలు పరిగేడుతూంటే ఆవురావురుమని పెట్టిన తిఫిన్ మాట్లాడకుండా లాగించేసాం.
భోజనాలు తర్వాత అనుకుని ఇంక అన్నాయ్యగారి ఫార్మ్కు బయల్దేరాము.చుట్టుపక్కల ఉన్న నలభై మందలాల్లో ఇరవై మండలాలవాళ్ళు వీళ్లదగ్గరే మొక్కలు కొనుక్కుంటారుట.మామిడి,అరటి,జామా,పనసా ఇలా చాలా రకాల పళ్ళ రకాలూ,టమోటా,వంగ,చిక్కుడు రకాలూ,బెన్డ వంటి కాయగూరలూ,రకరకాల పంటల గ్రాఫ్టింగు,హైబ్రిడ్ వెరైటీలూ వీళ్లు తయారు చేస్తారుట.అదంతా కొండ ప్రాంతం.బీడు భూమి...ఎక్కువ నీరు లేకున్నా,అదంతా సాగు చేసి పచ్చని తొటల్ని పెంచారు.చిన్నప్పుడు దూరదర్షన్లో కృషిదర్షన్,డిడి8 లో వ్యవసాయదారుల కార్యక్రమాలూ బాగా చూసే దాన్ని.నాకెందుకో సరదా..అప్పుడే నాకు ఈ గ్రాఫ్టింగు,హైబ్రీడైజేషన్...మొదలైన విషయాలపై అవగాహన వచ్చింది.చక్కగా ఓ చిన్న పొలం కొనుక్కుని అందులో ఓ గుడిశ వేసుకుని పొలం చేసుకుంటూ జీవితం గడిపెయాలని కలలు కూడా కనేదాన్ని...!!
ఫార్మ్ కబుర్లలోకి వచ్చేస్తే....తక్కువ నీరుతో ఎక్కువ దిగుబడి ఎలా సంపాదించాలి,నీరు లేకపోయినా రెండు,మూడు రకాల మొక్కలతో పంటని ఎలా పచ్చగా ఉంచాలి మొదలైనవి వాళ్ళు రైతులకు తెలియచెప్పే పరిశోధనాత్మక వివరాలు.పాషన్ తో,అంకితభావంతో 17,18 ఏళ్ల ఆయన అనుభవాలూ,పరిశోధనల వివరాలూ,వాళ్ళ ఏక్టివిటీస్ అన్నీ ఆయన చెప్తూంటే..చాలా ఆనందం కలిగింది.ఆ సంస్థ పరంగా ఆయన చేస్తూన్న కృషి అపూర్వం!!చేసే వృత్తి మన ప్రవృత్తికి సరిపడేదైతే,అందులో మనల్ని మనం మరిచేటంత అలౌకికానందం మనం పొందుతూంటే,మనం చేసే పని కొన్ని వందల మందికి ఉపయోగపడ్తూంటే,జీవనోపాధి కల్పిస్తూంటే.....జీవితానికి ఇంతకన్నా సార్ధకత ఉండదేమో అనిపించింది.
ఈ నాలుగురోజుల్లో,మనసు నిండా బోలేడు తియ్యని అనుభవాలూ,మరువలేని జ్నాపకాలూ నింపుకుని...సమయాభావం వల్ల బస్సు వదిలి,టాక్సీ ఎక్కి కాకినాడ సకాలంలో చేరి..మా రైలు ఎక్కాం!ఈసారి ముందుగానే సైడ్ లోయెర్లో తిష్థ వేసి,సీటు మార్పిడి చేసుకుని సుఖంగా నిద్రపోయాం పాపా,నేను!!
మొత్తానికి మా ప్రయాణం విశేషాలు పూర్తయ్యాయి....బాధని మనసులో దాచుకోగలం కానీ ఆనందాన్ని ఎవరితోనూ పంచుకోకుండా ఉండలేము....అన్న నా అభిప్రాయమే ఈ అయిదు టపాలకీ పునాది.