శ్రావణమాసం మొదలైంది...ఇంక పండగలు మొదలు..మనసులో ఎన్నొ జ్ఞాపకాలు...శ్రావణంలో చిన్నప్పుడు పేరంటాలకి మొక్కుబడిగానే వెళ్ళేదాన్ని.తెచ్చిన శెనగలు మాత్రం అమ్మ పొగిస్తే సుభ్భరంగా తినేదాన్ని. వివాహం తరువాత నాలో చాలా మార్పు ...ఒక కూతురు నుంచి ఒక గృహిణి రూపంలోకి....అన్నదమ్ముల అనురాగం నుంచి భర్త అడుగుజాడల్లోకి మారినందుకొ తెలేదు మరి...!!
"చేతికి గాజులు వేసుకోవె..ఆడపిల్లవి అలా ఉంటే ఎలా?"
"సంకల్పం చెప్పుకుని,ఆచమనం చేసుకోవటం నేర్చుకో,కాస్త దేముడి దగ్గర దీపం పెట్టడం నేర్చుకోకపోతే ఎలా?"
"పేరంటానికి రమ్మంటే ఎందుకొ అంత బాధ?"
"మొహానికి ఆ నల్ల బొట్టేమిటి?కాస్త పెద్దది ఎర్రనిది పెట్టుకోరూ?"
"ఎంతసేపూ ఆ వి టి.వి,ఎం టి.వి,స్టార్ మూవీసు,హెచ్.బి.వో..ఇంకో చానల్ చూడనీవా మమ్మలని?"
"బట్టలు మడత పెడదామని లేదు,తోమిన గిన్నెలు సర్దుదామని లేదు,ఎంతసేపూ ఆ పుస్తకాలు పట్టుకుని లీనమైపోతుంది..ఉలుకూ పలుకూ లేకుండా!"
ఇలాంటి మందలింపులు,కసుర్లు మనం ఎప్పుడైనా లక్ష్య పెడితేగా?!
అలాటి నేను పెళ్లైన రెండు నెలలకే వచ్చిన శ్రావణం లో నొములు మొదలెట్టేసా.మడి చీరకట్టుకుని,కాళ్లకి పసుపు రాసుకుని,చేతినిండా గాజులు వేసుకుని బుధ్ధిగా పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించేసా.మా అన్నయ్య ఇంక నన్ను చూసి ఒకటే నవ్వు...అటునుంచి,ఇటునుంచీ నన్ను పరికించి,పరిశీలించి....బేక్ స్ట్రీట్ బోయిస్,బోయిజోన్,రిక్కి మార్టిన్ వినే నువ్వేనా?..గృ..గృ..గృహిణివైపొయావే అని ఆటపట్టించేసాడు.అద్దంలో నన్ను నేను చూసుకుంటే నాకే ఆశ్చర్యం.కానీ ఏదొ ఆనందం.సంతృప్తి.
ఊరు మారాక కూడా క్రమం తప్పకుండ దీపారాధన,సహస్రనామాలు,అమ్మ లాగ నవరాత్రుల్లొ తొమ్మిది రొజులూ పూజలు,ప్రసాదాలు చేయటం...అలవాటయిపోయాయి.
పెద్ద పండగలే కాక,సుబ్రహ్మణ్య షష్ఠి,కార్తిక పౌర్ణమి,క్షీరబ్ది ద్వాదశి,ముక్కోటి ఏకాదశి,రధ సప్తమి లాంటి పర్వదిన్నాల్లొ కూడా ఎలా పుజలు చేయాలి,ఏ స్తోత్రాలు చదువుకోవాలి అని ఫోన్లోనొ,మైల్ ద్వారానొ అమ్మని అడిగి తెలుసుకుని యధావిధిగా అవన్ని చేయటం నాకెంతో సంతృప్తి ని ఇచ్చేవి.అవన్ని మళ్ళి అమ్మకి,అత్తయ్యగారికీ ఉత్తరాల్లో రాసేదాన్ని..బాగుందమ్మా అని వాళ్ళు అంటే సంతోషం.ఉపవాసాలు,మడి ఆచారాలు,మూఢనమ్మకాలు నాకు లేవు.నమ్మకం కూడా లేదు.కానీ పర్వదినాల్లో నియమంగా యధావిధిగా పూజ చేయటం ఎందుకో మరి భలే ఇష్టం.ఏదో పరిపూర్ణత్వం పొందుతున్న భావన.
ఈ మార్పు ప్రతి ఆడపిల్లలొ కలిగేదే.గొప్పేమి కాదు.కాని కొందరు బుధ్ధిమంతులైన అమ్మాయిలు పెళ్ళి కాని క్రితం కూడా పుజాపునస్కారాలు చేస్తారు.కాని నాలాటి వాళ్ళకు బుధ్ధి,మార్పు పెళ్ళి అయ్యాకే వస్తాయేమో మరి...!!