సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, July 16, 2009

ఒక కాఫీ కధ:

( ఇది గత రెండురొజుల టాపాలు చదివినవారికి---"ఇంక పడిన బాధ చాలు.పదమని శ్రీవారు వెంట పెట్టుకెళ్ళి కొత్త కీపాడ్ కొనిపెట్టారు.నేను వెన్ఠనే కొనక పోవటానికి ఒక కారణం ఉంది."ఏ వస్తువైనా నువ్వు ఆడగ్గానే కొనేస్తే ఆ వస్తువు విలువ నీకు తెలీదు.ఒకవేళ అది ఏదైనా పాడయినదయితే నాలుగురోజులు ఆగి కొంటే, మళ్ళీ ఎప్పుడూ ఆ వస్తువుని నువ్వు పాడుచేసుకోవు" అనేది నాన్న చెప్పిన సూత్రాల్లో ఒకటి.)
ఇక టపా లోకి:

ఒక కాఫీ కధ:

అనగనగా ఒక అమ్మాయి.ఆ అమ్మాయికి పాల వాసన గిట్టదు.వాళ్ళ అమ్మ పాలు కలిపి ఇస్తే అమ్మ చూడకుండా మొక్కల్లో పారబోసేది.కొన్నాళ్ళకా విషయం గ్రహించి వాళ్ళమ్మ హార్లిక్స్ కొనడం మొదలెట్టింది.ఏడవతరగతి దాకా బాగానే గడిచింది.తరువాత వాళ్ళ మేనమామకి ఆ ఊరు బదిలీ అయ్యింది.వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా పాలు ఇస్తే తాగేది కాదు ఆ అమ్మాయి.అందుకని వాళ్ళ అత్తయ్య పాలలో2,3 చుక్కలు కాఫీ డికాషన్ వేసి ఇచ్చేది.ఆ రుచి చాలా నచ్చేది ఆ అమ్మాయికి.అప్పుడే కాఫీ ఏమిటని వాళ్ళ అమ్మ,ఇంటికి వస్తే ఏదో ఒకటి తాగించకుండా ఎలా పంపటం అని వాళ్ళ అత్తయ్య ఆర్గ్యూ చేసుకుంటూ ఉండేవారు.ఇంట్లో కూడా అలా కాఫీ చుక్కలు వేసి ఇమ్మని ఆ అమ్మాయి రోజూ వాళ్ళమ్మతొ పేచీ పడేది.వాళ్ళింట్లో వాళ్ళ నాన్న ఒక్కరే కాఫీ తాగేది.మిగతావారు బోర్నవీటా తాగేవారు.ఆ పిల్ల పోరు పడలేక "కాలేజీలోకి వచ్చాకనే కాఫీ" అని తీర్పు ఇచ్చేసింది వాళ్ళమ్మ.అలా "కాఫీ" కోసం పదవతరగతి ఎప్పుడవుతుందా అని ఎదురు చూసింది ఆ అమ్మాయి.


ఇంటరు,కాఫి రెండూ మొదలయ్యాయి.డిగ్రీ అయ్యాకా నాన్నకు,తనకు తానే కాఫీ చేసేది ఆ అమ్మాయి.(వంటొచ్చిన వాళ్ళాతో ఇబ్బంది ఏమిటంటే,వాళ్ళకి ఎవరి వంటా నచ్చదు-కాఫీతో సహా..)పళ్ళు తోమగానే డికాషన్ తీసేయటం,పాలపేకెట్టు కాచిన వెంఠనే వేడి వేడి కాఫీ తాగేయటం...పొద్దున్నే ఆ కాఫీ తాగుతూ న్యూస్ పేపరు తిరగేయటం....ఆమె దినచర్యలో భాగాలు.ఇలా కొన్నేళ్ళు గడిచాకా ఆ అమ్మాయికి కాఫీ రుచి మార్చాలనిపించింది.బ్రూక్ బాన్డ్ పౌడర్ కన్నా మంచిదాని కోసం వెతకటం మొదలెట్టింది.ఒకచోట కాఫీ గింజలు మర ఆడి ఇవ్వటం చూసింది.ఇక అప్పటినుంచీ ప్రతినెలా అక్కడకు వెళ్ళి కాఫీగింజలు మరాడించి ఫ్రెష్ కాఫీ పౌడర్ తిసుకెళ్ళేది.మర ఆడేప్పుడు గింజలు,చికోరీ పాళ్ళు మార్చి ప్రయోగాలు కూడా చేసేది.


కొన్నాళ్ళకు ఆ అమ్మాయికి పెళ్ళయింది. బొంబాయి వెళ్ళింది.అక్కడ ఇంకో చిక్కు.వాళ్ళుండే ప్రాంతంలో కాఫీ పొడి ఆడే కొట్టు లేదు.కొన్నాళ్ళు పుట్టింటినుంచి తెచ్చుకుంది కాఫీపొడి.ఆ తరువాత "మాతుంగా" అనే ఒక చిన్న సైజు తమిళనాడు ప్రాంతంలో ఆమెకు ఒక కన్నడా కాఫీ కొట్టు దొరికింది.ఆ కాఫీ వాసన ఆ వీధి చివరి దాకా వస్తూంటే,గుండెలనిండా కాఫీ వాసన నింపుకుని అనిర్వచనీయమైన ఆనందంతో
కాఫీ పొడి కొనుక్కుని ఇల్లు చేరేది ఆ చిన్నది.అలా కొంత కాలం గడిచింది...

అకస్మాత్తుగా అనుకోని కొన్ని అవాంతరాల వల్ల, ఒకానొక నిముషంలో ఆ అమ్మాయి "చాలా ఇష్టమైన దాన్ని వదిలేస్తాను" అని దణ్ణం పెట్టేసుకుంది...చాలా ఇష్టమైనదేముంది "కాఫీ" తప్ప?...అంతే మరి ఆ అమ్మాయి కాఫీ మానేసింది.దణ్ణానికో,భక్తికో.... ఆ కారణం నెరవేరింది.!ఆ అమ్మాయి మరింక ఎప్పుడూ కాఫీ తాగలేదు....
కాఫీ వాసన వేసినప్పుడాల్లా మనసు చివుక్కుమంటుంది...41/2ఏళ్ళు అయ్యింది. ఆ అమ్మాయి ఇప్పటిదాకా మళ్ళీ కాఫీ తాగలేదు.కాఫీవాసన వచ్చినప్పుడు మాత్రం గుండెలనిండా ఆ గాలి పీల్చుకుని తృప్తి పడిపోతుంది..!! ఆ కాఫీ లోటుని మాత్రం రకరకాల టీ ల ( గ్రీన్ టీ,బ్లేక్ టీ,అల్లం టీ,అయ్స్ టీ, లెమన్ టీ,ఆరెంజ్ టీ,పుదీనా టీ,మసాలా టీ,గులాబీ టీ,డస్ట్ టీ,లీఫ్ టీ...etc ) ద్వారా భర్తీ చేసుకుంది.



ఈ కధ వల్ల నేను తెలుసుకున్న నీతి ఏమిటంటే....మనం చాలా అలవాట్లని (మంచివైనా,చెడ్డవైనా) మానుకోలేము అనుకుంటాము.కానీ దేనినైనా చేయగల శక్తి మనకు దేముడు ఇచ్చాడు.ఏ అలవాటు నైనా నేర్చుకునే,మానుకునే శక్తి మనలోనే ఉంది అని ....!