"వినండి వినాండి ఉల్లాసంగా ఉత్సాహంగా.."
"ఇది చాలా హాటు గురూ.."
"రైన్ బో తో మీ జీవితం రంగుల మయం..."
"....నంబర్ 1 రేడియో స్టేషన్..." అంటూ రేడియోనో ,మొబైల్ FMనో ఆన్ చెయ్యగానే వినిపించే కబుర్లు...మనసుని ఉత్తేజం చేస్తాయి.ఒకప్పుడు రేడియో అంటే "వివిధభారతి",ఏ ప్రాంతం అయితే ఆ "లోకల్ స్టెషన్" మాత్రమే.మొక్కుబడిగా,కట్టె కొట్టె తెచ్చే అన్నట్లుండే అనౌన్సుమెంట్లు...!!వాణిజ్య రంగం అబివృధ్ధి చెందాకా గత కొన్నేళ్ళుగా మనకి పరిచయమైనవి ఈ ఎఫ్.ఎం స్టేషన్లు.శ్రోతల అభిప్రాయాలను,సలహాలను,వారి భావాలను తమ కార్యక్రమాల్లో ఒక భాగం చేసుకుని అనునిత్యం అలుపులేకుండా అనర్గళంగా మాటలాడుతూనే ఉంటాయి ఈ FMలు.ఫుల్ స్టాప్ల్ లు,కామాలు లేకుండా నాన్ స్టాప్ గా మాటాడే నేర్పు,ఓర్పు ఆ రేడీయో జాకీలకి ఎలా వస్తాయా అని నాకు విస్మయం కలుగుతూ ఉంటుంది... కరంట్ అఫైర్స్,వింత వార్తలు,విశేషాలు, కొత్త పాటలు ,పాత పాటలు,భక్తిగీతాలతో నిండిన కార్యక్రమాలతో... సమయానుకూలంగా,కాలానుగుణంగా ముఖ్యంగా యువతని ఆకట్టుకునే విధంగా తయారయ్యాయి ఈ FMలులు.ఎక్కువ భాగం వీటిని వినేది కాలేజీలకు,ఆఫీసులకు వెళ్ళే జనం.బస్సుల్లో,లోకల్ ట్రైనుల్లో,ఆఫీసు కాబ్ లలో..వెళ్తూ వస్తూ,ఆఖరుకి రోడ్డు మీద నడుస్తూ కూడా జనాలు ఇవాళ FMలు వింటున్నారు.
మొబైలు రేడియోలు వచ్చిన కొత్తల్లో, నాకు రోడ్ల మీద జనాలు యియర్ ఫొనెలు పెట్టుకుని అంతంత సేపు ఏమి వింటున్నారో తెలిసేది కాదు.ఆఫీసు పనుల మీద ఫోను మాట్లాడుకుంటున్నారేమో అనుకునేదాన్ని.కానీ కొన్నాళ్ళ తరువాత అప్పలసామిలా ఉన్నవాడు కూడా యియర్ ఫోను పెట్టుకుంటూంటే డౌటు వచ్చి ఆరా తేస్తే.....అందరూ వినేది FMలని అని తెలిసింది.అప్పుడింక నేను కూడ ఒక FM రేడియో + యియర్ ఫోను ఉన్న మొబైలు ఒకటి కొనేసుకుని బయటకు వెళ్తే అవి పెట్టేసుకుని పోసుకొట్టడం మొదలెట్టాను. ఇప్పుడు రోడ్డెక్కుతే చాలు నా యియర్ ఫోను,రేడియో ఆన్ అయిపోతాయి.ముఖ్యంగా ట్రాఫిక్ జాంలలో మంచి కాలక్షేపం ఇవి.ఒంటరిగా ఉన్న బ్రహ్మచరులకు,హాస్టల్ పిల్లలకు నేస్తాలు ఈ FMలే.
పెళ్లయిన కొత్తల్లో మేము బొంబాయిలో ఉన్నప్పుడు మా చుట్టుపక్కల ఒక్క తెలుగు మొహమైనా ఉండేది కాదు.గుజరాతీ,మరాఠి,కొంకిణీ,తుళు భాషలవాళ్ళు ఉండేవారు మా వింగ్ లో.అందువల్ల + కాస్త హిందీ భాష రావటం వల్లా నా కాలక్షేపమంతా FMలతోనే ఉండేది.కొన్నాళ్ళకి అన్ని FMలలోని జాకీల పేర్లు,గొంతులు,మాట్లాడే తీరు అన్నీ కంఠతా వచ్చేసాయి."జీతూ రాజ్" "అనురాగ్" నా ఫేవరేట్లయిపోయారు.ఒక్కరోజు వాళ్ళు రాకపోతే వీళ్ళేమయిపోయారబ్బా అని బెంగపడిపోయేదాన్ని!
పాత తరాలవాళ్లకి,మామూలు MWరేడియో వినే అలవాటు ఉన్నవాళ్లకీ కొందరికి ఈ FMలు నచ్చవు."వీళ్ల వాగుడు వీళ్ళూను.చిరాకు" అని కొందరు విసుక్కోవటం నాకు తెలుసు.కానీ నామటుకు నాకు అవి ఒంటరితనాన్ని దూరం చేసే నేస్తాలు.చికాకుల్ని,ఆవేశాలని తగ్గించే టానిక్కులు.ఏదో ఒక చానల్ పెట్టుకుని పని చేసేసుకుంటూ ఉంటే అసలు అలుపు తెలియదు,బుర్ర పాడుచేసుకునే ఆలోచనలూ రావు.బస్సు ఎక్కి హాయిగా యియర్ ఫోనులు తగిలించేసుకుంటే ప్రాయాణం చేసినట్లుండదు.వాకింగ్ కి వెళ్ళేప్పుడు అయితే అసలు ఎంత దూరమైనా అలా వెళ్పోతాను ఆ పాటలు,కబుర్లూ వింటు..!మనతోపాటూ ఎవరో కబుర్లు చెబుతూ మనకు తోడు ఉన్న భావన ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
FMల కన్నా ముందు "WorldSpace Satellite Radio" వచ్చింది.బాగానే పాపులర్ అయ్యింది.కానీ అది ఖర్చుతో కూడుకున్నది అవటం వలన అంతగా జనాలను ఆకర్షించలేకపోయింది.5,6రకాలFM చానల్స్ వచ్చాకా ఆ రేడియో జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి.కాని అది ఇంట్లో ఉంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది.దగ్గర దగ్గర 42 చానల్స్ తో ఏ రకం ఇష్టమైన వాళ్లకి ఆ రకం అందులో దొరుకుతుంది.అన్ని భాషల చానల్సే కాక,కర్నాటిక్,హిందుస్తానీ,రాక్,పాప్,జాజ్..ఇలా రకరకాల సంగితాలు మాత్రమే వచ్చే చానల్స్,వెల్ నెస్,న్యుస్,స్పిరిట్యుఅల్ ఇలా రకరకాల టపిక్ రిలేటెడ్ చానల్స్ దీంట్లో ఉంటాయి. http://www.worldspace.in/ అనే వెబ్సైటుకి వెళితే ఈ రేడియో తాలూకు వివరాలు ఉంటాయి.