సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, July 7, 2009

మొక్కజొన్న పొత్తులు

మొక్కజొన్న పొత్తులు...ఓహ్..irresistable !!
వర్షాలు ఇంకా కురవట్లేదు కానీ మొక్కజొన్నపొత్తులు వచ్చేసాయి.
చిటపటచినుకులు పడుతూంటే,రోడ్డు చివర చెట్టు క్రింద బొగ్గులపై కాల్చిన లేత మొక్కజొన్న పొత్తులు... తినను అనేవారు ఉంటారా?(పళ్ళలో ఇరుక్కుంటాయి అని తిననివారుంటారేమో చెప్పలేం.)
నాకు మాత్రం ఇంట్లో గాస్ స్టౌ మీద కాల్చుకున్న వాటికన్నా బయట బొగ్గులపై కాలిన మొక్కజొన్నల రుచే ఇష్టం.మా ఇంట్లో (గాస్ స్టౌ కాకుండా)చిన్నప్పుడు రెండు చిన్న ఇనప కుంపటులు ఉండేవి.మా అమ్మ వాటిమీద ఉల్లిపాయలు,మొక్కజొన్నలు కాల్చి పెడుతూ ఉండేది.వాటి రుచే వేరు.మొక్కజొన్నలని ఉడకపెట్టి కూడా కొన్ని చోట్ల అమ్ముతూ ఉంటారు.తిరుపతి కొండ మెట్లదారిలో వెళ్ళేప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి అవి.మొక్కజొన్నలతో తయారు చేసే వంటల్లోకి వెళ్తే వాటితో --వడలు,సూప్ లు,రకరకాల కూరలూ వండుకోవచ్చు.మొక్కజొన్నల్లో రకాల్లోకి, వెళితే--'బేబీ కర్న్ ' అయితే పచ్చివే తినేయచ్చు.చపాతీల్లోకి బేబీకార్న్ మసాల,బేబికార్న్ చాట్ మొదలైనవి వండుకుంటే భలే ఉంటుంది.అప్పుడప్పుడు మాత్రమే దొరికే "స్వీట్ కార్న్" తొ కూడ చాలా రకాల సూప్ లు,కర్రీలు,కట్లెట్ లు చెసుకోవచ్చు.మేము బొంబాయిలో ఉండేప్పుడు ప్రతి లోకల్ ట్రయిన్ స్టేషన్ ప్రవేశద్వారం దగ్గరా అన్నికాలాల్లోను "స్వీట్ కార్న్" దొరికేది.డెలివరీకి అమ్మావాళ్ళింట్లో ఉన్నప్పుడు బొంబాయి నుంచి మావారి ద్వారా కొరియర్లో "స్వీట్ కార్న్" తెప్పించుకుని మరీ తిన్నాను!!
మొన్న శనివారం నేను,మా పాప బస్సు దిగగానే ఎదురుగుండా కనిపించిన మొక్కజొన్నల బండి మీదకి దృష్టి పోయింది.అన్ని కండెలూ అయిపోయి ఇంక 5,6మాత్రమే మిగిలాయి ఆ బండి మీద.పరుగునవెళ్ళి ఒక లేతది కాల్చి ఇవ్వవయ్యా అని అడిగాను.మాడ్చకుండా కాల్పించుకుని ,చాలా లేతగా ఉన్న ఆ మొక్కజొన్నని తినడానికి నేను,పాప ఇద్దరం పోటీ పడిపోయాం...రోడ్డు మీద వింతగా చూసే జనాల్ని కూడా పట్టించుకోకుండా !!