"ఉత్తరం" అంటే అదొక మధురమైన జ్ఞాపకం.ఉత్తరం దేముడు ఇచ్చిన ఒక తీయని వరం.మనసు పొరల్లో జ్ఞాపకాల దొంతరలో దాగిఉన్న కమ్మటి కబుర్లు ఉత్తరాలు.ఉత్తరం రాసే అలవాటు ఉన్న ప్రతిఒక్కరికీ అవి అమూల్యమైన సంపదలు.
'ఉత్తరం రాయగలిగిన ప్రతివ్యక్తి రచయితే' అన్నరు బెర్నార్డ్ షా.
చదువుకునేరొజుల్లో అదొక పిచ్చి.రెండు రోజులకి ఒక పొస్టు వచ్చి తీరాల్సిందే.పోస్టుమ్యానుకి ఎప్పుడూ మా అడ్రెసు కంఠతానే;యెందుకంటే మాఇంట్లో అతని దసరా మామూలు అందరికన్న రెట్టింపు!!
ఉత్తరం రాయటమూ ఒక కళే. దానికీ కొన్ని మూడ్స్ ఉంటాయి. డాబా మీద వెన్నెల్లో కూర్చున్నప్పుడు కొబ్బరాకుల గలగలలు వినిపిస్తూంటే ,ఝామ్మని వర్షం పదుతూంటే, వర్షం వచ్చి వెలిసాకా కమ్మని మట్టివాసన గుండెలనిండా పీల్చుకున్నప్పుడు, పొద్దున్నే లేవగానే అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, సూర్యుడు అస్తమించే నిశీధివేళ పక్షులు గూళ్ళకు వెళుతూ కిలకిలారావాలు చేస్తున్నప్పుడు, మంచి సినిమా చూసినప్పుడు,మది కదిపే సాహిత్యం చదివినప్పుడూ,అందమైన లెటర్ ప్యాడు దొరికినప్పుడు,బాగా రాసే పెన్ను చేతికందినప్పుడు....ఇష్టమైన పాటలో,లేక మధురమైన సంగీతమో పెట్టుకుని అది వింటూ రాయాలి ఉత్తరం! అప్పుడు కదులుతుంది కలం అక్షరాల వెంట వేగంగా,పరుగుపందెంలో విజేతలాగ.కానీ మధ్యలో యెవరైనా కదిపితే ఇంక పుడుతుంది మంట ...
అందుకే నేను ఉత్తరం రాసేటప్పుడు ముందుగానే వార్న్నింగు ఇచ్చేదాన్ని "నన్నెవ్వరూ దిస్టుర్బ్ చేయకండి.నేను ఉత్తరం రాసుకుంటున్నను" అని.నామట్టుకు నేను4పేజీలకన్నా తక్కువ యే రోజూ రాసి యెరుగను.10,12,20 పేజీల ఉత్తరాలు కూడా రాసిన రొజులు ఉన్నాయి.కార్డులు,ఇన్లాండు కవర్లూ రాసింది తక్కువే. మరి వంశపారంపర్యమేమో తెలేదు.మా తాతగారు మద్రాసులో 'లా' చదివే రోజుల్లో అడివి బాపిరాజుగారు తాతగారి రూమ్మేటుగా ఉండేవారుట.మా తాతగారు ఉత్తరాలు రాసినప్పుడూ,ఆయనకు ఉత్తరాలు వచ్చినప్పుడూ బాపిరాజుగారు అనేవారుట "భలే రాసుకుంటారయ్యా మీరు ఉత్తరలు.ఏది ఓ సారి చూపించు" అనేవారట. ఆయన 'తుపాను ' నవలలో ఉత్తరాల గురించి ఒక మంచి పేరాగ్రాఫే ఉంటుంది.మా ఇంట్లో పిన్నిలు , పెద్దమ్మ, మావయ్యలు, కజిన్సు, అన్నయ్యలూ, ఫ్రెండ్స్,ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపొయిన పక్కింటివాళ్ళు... అందరమూ తెగ రాసేసుకునేవాళ్ళం ఉత్తరాలు. మీ ఫమిలీ పోస్టల్ డిపార్టుమెంటుని బతికించేస్తోంది అని వేళాకోళం చేసినవాళ్ళూ ఉన్నారు.ఈ వ్యక్తిగత ఉత్తరాల్లో కొన్ని భద్రంగా దాచుకునేవి,ఏళ్ళు గడిచినా మళ్ళి మళ్ళి చదువుకునేవి,ప్రేమలేఖలు,త్రిపురనేనిగోపీచంద్ గారు చెప్పినట్టు 'పోస్టు చెయ్యని ఉత్తరాలు ' కూడా ఉంటాయి. ఓ 5,6యేళ్ళ నుంచీ ఈ ఉత్తరాల జోరు తగ్గింది.ఫొనులు,ఈ-మేల్స్,వచ్చేసాకా తీరుబడిగా ఉత్తరం రాసే ఖాళీ ఎవరికీ?తీరుబడి చేసుకుని మైల్ రాసినా చదివే తీరికే ఉండటంలేదు ఇప్పుడు కొందరికి. మొబైలు ఫొనులు వచ్చాకా ఈ-మేల్స్ కూడా తగ్గిపోయాయి. నాకైతే చాలమంది చుట్టాలు ఊళ్ళోనే ఉన్నరు.ఫ్రెంద్స్ అయితే చాలా మంది అడ్డ్రెస్సులోనే లేరు.
మొన్నొకరోజు మా ఫ్రెండు ఒకమ్మాయి ఫొను చేసి 'నీ ఉత్తరం చదివి చాలారోజులు అయ్యిందే.ఓ ఉత్తరం రాయి 'అని అడిగింది.రాయాలి దానికి.కాలేజీ రోజుల్లో ఆ జోరే వేరు.ఎక్కడ మంచి లెటర్ ప్యాడు దొరికితే అది కొనేయటం,రకరకాల కలర్ పెన్నులు,ఇంకులు,కొనేయటం ఉత్తరాలు రాసేయటం.పోస్టు వస్తే నేనే తెరవాలి.ఏవరైన ముట్టుకున్నారో యుధ్ధమే!నా చిన్నప్పుడు మా నాన్నగారికి శ్రోతలు రాసిన ఉత్తరాలు ఎన్ని వచ్చేవో. టి.వి.లో సురభి ప్రోగ్రాములో పెద్ద గంగాళాం నిండా ఉత్తరాలు చూపించేవారు కదా,ఆలానే వాచ్చేవి.అలమారా నిండిపోయాకా ఆవాన్నీ మా అమ్మ చింపేస్తే మేము బయట పడేసి వచ్చేవాళ్ళము.నెలనెలా ఇదే పని.ఎన్నని దాస్తాము?అప్పుడు దిజిటల్ కమేరాలు లేవు ఫొటొ తీసి దాచటానికి అనిపిస్తుంది.
నాకిప్పటికీ ఈ-మేల్ రాయటం కన్నా ఉత్తరం రాయటమే ఇష్టం. ఆ ఆనందమే వేరు.పెన్ను చేత పట్టుకుని ఆలోచనలని కాగితంపైన పెట్టడమే ఒక గొప్ప తృప్తిని ఇస్తుంది. అది రాయటం అలవాటు ఉన్నవాళ్ళకు మాత్రమే తెలిసిన అనుభూతి!!